చంద్రబాబు పట్టు కోల్పోయారా!

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను 1995 ఆగస్టునుంచి 2004 మే వరకు, తొమ్మిదేళ్ళు పాలించిన కాలంలో చంద్రబాబునాయుడు గొప్ప పరిపాలనాదక్షుడని, అపర చాణుక్యుడని, కాకలు తీరిన రాజకీయ యోధుడని, వ్యూహ ప్రతివ్యూహాలలో తలపండిన దురంధరుడని పలువురిచేత ప్రశంశించబడ్డారు. హైటెక్ ముఖ్యమంత్రి అని ఇంటా, బయటా అనేక మీడియా సంస్థలు ఆయనను ఆకాశానికెత్తాయి. జాతీయ రాజకీయాలలోకూడా బాబుగారు కీలకపాత్ర పోషించారు(టీడీపీ కార్యకర్తల మాటల్లో చెప్పాలంటే చక్రం తిప్పారు). యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా పనిచేశారు. అయితే పదేళ్ళ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ఇప్పుడు చూస్తే అప్పటి మనిషేనా అనిపిస్తోంది. ముఖ్యంగా గత రెండునెలలలో జరిగిన రెండు కీలక పరిణామాల దృష్ట్యా చూస్తే….

మే నెలాఖరులో బయట పడిన ఓటుకు నోటు కుంభకోణాన్నే తీసుకుంటే – తెలుగుదేశం నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి దొరికిపోయారు. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో అంతర్గత లోపాలను, సమన్వయ రాహిత్యాన్ని బయటపెట్టింది. దిశా నిర్దేశం చేసే సరైన నాయకత్వం, సలహాదారులు లేరని ఎత్తిచూపింది. ఎమ్మెల్సీ ఎన్నికలకోసం బేరసారాలు జరగటం సమకాలీన రాజకీయాలలో సర్వసాధారణం. అది అన్ని పార్టీలూ చేసేదే. ఒకరకంగా చూస్తే టీఆర్ఎస్ మరింత అడ్డగోలుగా చేసింది. తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సామ, దాన, బేధ, దండోపాయాలతో లొంగదీసుకుంది. వారిలో కొందరిని మంత్రులుగా చేయటం ఇంకా అరాచకమని చెప్పాలి. అయితే దొంగతనం పెద్దదైనా, చిన్నదైనా దొరికినపుడు దొంగ అనే అంటారు. టీడీపీ ఇక్కడ అడ్డగోలుగా దొరికిపోయింది. దీనికి కారణం ఎవరు? కేసీఆర్ మంత్రాంగం అనే విషయాన్ని పక్కనపెట్టి టీడీపీ కోణంలోనుంచి చూస్తే – రేవంత్ రెడ్డి లోపమని బయటకు అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే – లోపాయికారీగా, అతి రహస్యంగా జరగాల్సిన పనిని ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా దుడుకుగా వెళ్ళటమే మౌలిక కారణం. దానికితోడు ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేను ఒప్పించటానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తితో ఫోన్ చేయించటం పరాకాష్ఠ. దాదాపు 35 సంవత్సరాల వయసున్న పార్టీ ఇలాంటి వ్యవహారంలో ఇలా అడ్డంగా దొరికిపోయిందంటే ఎవరూ నమ్మరు. ఏదో నిన్నగాక మొన్న పుట్టిన పార్టీవారు కొత్తగా చేస్తున్న వ్యవహారంలాగా చేసి అడ్డంగా దొరికిపోయారు. నిజంగానే కొత్తగా పార్టీ నాయకత్వాన్ని చేతుల్లోకి తీసుకున్నవారే ఈ వ్యవహారానికి కారణం. పార్టీని కొంతకాలంగా చినబాబు, చౌదరిగారు చేతుల్లోకి తీసుకుని నడిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక తాజాగా మంగళవారంనాడు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తీసుకుంటే – పుష్కరాలకోసం ఏపీ ప్రభుత్వం ఆరునెలలక్రితం కసరత్తు మొదలుపెట్టింది. కనీవినీ ఎరగనిరీతిలో చేస్తామని ప్రకటనలు గుప్పించింది. దీనికోసం ముఖ్యమంత్రి అనేకసార్లు రాజమండ్రి వెళ్ళి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. దాదాపు రు.1,500 కోట్లను పుష్కర పనులకోసం కేటాయించారు. అన్నింటా తనకు చేదోడు వాదోడై నిలుస్తున్న మంత్రి నారాయణను పుష్కరాల నిర్వహణ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఉండనే ఉన్నారు. చివరికి ఏమి జరిగింది? ఎన్నో సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పటికీ క్రౌడ్ మేనేజ్‌మెంట్(జన సమూహాన్ని నియంత్రించటం) తప్ప అన్నీ చర్చించారట. 150 సంవత్సరాలకొకసారి వచ్చే మహా పుష్కరాలు అని విపరీతమైన పబ్లిసిటీ చేయటంతో మొదటిరోజే జనం పోటెత్తారు. ఘటన జరగటానికి ముందు పుష్కరఘాట్‌వద్ద సీఎమ్ స్నానం చేస్తుంటే నారాయణతోసహా మంత్రులందరూ పక్కన నిలుచుని వేడుక చూస్తున్నారు. ఎంతమంది జనం వస్తారు అనే అవగాహన, విపరీతంగా వచ్చిన జనాన్ని వేర్వేరు ఘాట్‌లకు తరలించాలనే ఆలోచన లేకపోవటంతో ఘోరం జరిగిపోయింది. చిన్న పొరపాటువలన దాదాపు 30 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం విపక్షాలకు అడ్డంగా దొరికిపోయింది. ఇవి ప్రభుత్వ హత్యలేనని, చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టాలని ప్రతిపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారింది. ప్రజలలో పలచనయింది. దీనికి కారణమెవరు అంటే ప్రభుత్వంలోని వారందరి వేళ్ళూ అన్నింటా తానై ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నారాయణ, అమూల్యమైన సలహాలు ఇస్తున్న పరకాలవైపే చూపిస్తున్నాయి.

ఈ రెండు ఘటనలను బట్టీ చూస్తే మొదటిదానినిబట్టి పార్టీమీద, రెండోదానినిబట్టి ప్రభుత్వంమీద చంద్రబాబు పట్టుకోల్పోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో తన దక్షత, సమర్థతలతో తిమ్మిని బమ్మిని చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇలా ఇతరులపై ఆధారపడటంవల్లే పార్టీపరంగా, ప్రభుత్వపరంగా తప్పులమీద తప్పులు చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు 2004నుంచే వరసగా తప్పులు చేస్తూ వస్తున్నారు. 2004లో ఆరునెలలకుముందే ఎన్నికలకు వెళ్ళటమే తప్పు. అయితే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత(Anti-incumbency) బాగా పెరిగిపోయిందని ఇంటెలిజెన్స్ వర్గాలద్వారా తెలుసుకున్న చంద్రబాబు, అలిపిరి దాడి సానుభూతి కురిపిస్తుందనే ఒక తప్పుడు అంచనా వేసి ఆరునెలలముందే ఎన్నికలకు వెళ్ళారు. అదే సమయానికి పాదయాత్ర చేసి ఉన్న వైఎస్‌కు ప్రజాదరణ బాగా పెరిగిపోవటం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రతిపక్షనేతగా ఏమిచేయాలో అర్థంకాకో, ఓటమి ప్రభావమోగానీ ఓడిపోయిన తర్వాత బాబు చాలా కాలం స్తబ్దుగానే ఉండిపోయారు. ప్రతిపక్షనేతగా వైఎస్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు చాలా వచ్చినప్పటికీ ఉపయోగించుకోలేదు. ఇక 2009 ఎన్నికలలోకూడా తప్పులో కాలేశారు. తనమీద, తన పార్టీమీద నమ్మకంలేక తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తువలన టీఆర్ఎస్ ఎక్కువ లాభపడిందనేది అందరికీ తెలిసిన విషయమే. పొత్తు లేకుంటే టీడీపీకి మరిన్ని స్థానాలు వచ్చి ఉండేవని ఆ పార్టీ నేతలకు తర్వాత అర్థమయింది. ఇక 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి చంద్రబాబుకి ఆ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా కనిపించాయి. అప్పుడు గెలవకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుందనే భయంతో చాలా తప్పులు చేసేశారు. రుణమాఫీ హామీ అలాంటిదే. ఆ హామీ ఇవ్వకపోయినా టీడీపీ గెలిచేదే. కాంగ్రెస్ పార్టీనుంచి నాయకులు విపరీతంగా వచ్చి చేరుతుంటే ఒక పద్ధతి, పాడు లేకుండా అడ్డగోలుగా పార్టీలోకి తీసుకున్నారు. అయినా చాలావరకు వారందరినీ ప్రజలు గెలిపించారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశానికి చిరకాలశత్రువులైన జేసీ బ్రదర్స్‌ను పార్టీలో తీసుకోవటం అలాంటిదే. అయినా ఉన్న రెండు ప్రత్యామ్నాయాలలో జగన్‌కంటే చంద్రబాబే బెటరని ఈయనకు జనం పట్టంకట్టారు.

పదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉండి ఎన్నో చేదు అనుభవాలు, తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న చంద్రబాబు బాగా డస్సిపోవటంవలనే ఇలా అన్నిటికీ ఇతరులపై ఆధారపడుతున్నారనిపిస్తోంది. ఆ పదేళ్ళలో, ముఖ్యమంత్రి స్థాయి పదవి నిర్వహించిన ఏ వ్యక్తీ ఎదుర్కోనంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనటంతో చంద్రబాబు డస్సిపోయి ఉండొచ్చు. వైఎస్, కేసీఆర్ చంద్రబాబును ముప్పతిప్పలు పెట్టిన సంగతి విదితమే. ఇక తెలంగాణ విషయంలో బాబు అత్యంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుండేది ఆయన పరిస్థితి. ప్రత్యర్థిపార్టీలలో గల్లీనుంచి ఢిల్లీదాకా ఉన్న ప్రతి నాయకుడూ చంద్రబాబునే టార్గెట్ చేసేవారు. ఇంతటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారుకాబట్టి ఆయన డస్సిపోవటంలో అర్థం ఉంది. అంతటి పరిస్థితులను ఎదుర్కొనికూడా మళ్ళీ బాబు అధికారాన్ని చేజిక్కించుకున్నారంటే దానికి కారణం బాబు ఆశావహ దృక్ఫథమే అని చెప్పక తప్పదు. ఈ ఆశావహ దృక్పథంతోబాటు ఈ పదేళ్ళలో వ్యక్తిత్వపరంగా ఆయనలో అనేక మంచి మార్పులుకూడా చోటుచేసుకున్నట్లు దగ్గరనుంచి చూసినవాళ్ళు చెబుతున్నారు. ఇంతకుముందు జిత్తులమారిఅని ఆయనకు పేరు. ఎదుటివారిని వాడుకుని అడ్డంగా వదిలేస్తారని అపవాదు ఉండేది. తమను పట్టించుకోరని కార్యకర్తలు వాపోయేవారు. ఆ విషయాలలో బాబు పూర్తిగా మారిపోయారని, మానవీయత, సహనం, సానుభూతి కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కష్టాలు, కన్నీళ్ళు ఎదుర్కోవటంతో వచ్చిన పరిణతి అయి ఉండొచ్చు. అయితే పూర్వపు దక్షత, సామర్థ్యాలను పునరుద్ధరించుకోకపోతేమాత్రం బాబుకు కష్టాలు తప్పవు. ఇప్పటికైనా పార్టీ, ప్రభుత్వ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోలేకపోతే ఇలాంటి తప్పులు ముందుముందు మరెన్నో జరగటం ఖాయం. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవటం తథ్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close