చట్టాన్ని తొక్కేసిన “ప్రయివేట్” రైలు!

విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. ఎన్ డి ఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడవ రైల్వే బడ్జెట్ లో కూడా రైల్వే జోన్ ప్రస్తావన లేదు. దేశంలోనే మొదటి ఆటో రైల్వే హబ్ ను చెన్నయ్ లో నెలకొల్పుతున్నట్టు బడ్జెట్ లో ప్రతిపాదించారు. ప్రజావసరాల కంటే, ఇచ్చిన మాట కంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలే ముఖ్యమని రైల్వే బడ్జెట్ ద్వారా కూడా బిజెపి ప్రభుత్వం రుజువు చేసుకుంది. విజయవాడ, విశాఖనగరాల మెట్రో రైళ్ళ ప్రస్తావన కూడా బడ్జెట్ లో లేదు. తెలుగు రాష్ట్రాల్లో 20 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు పెండింగ్ లో వున్నాయి. తెలంగాణాకు 400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లో కాకనాడ కోటిపల్లి రైల్వే లైనుకి 50 కోట్లు, కోటిపల్లి నరసాపురం లైనుకి 200 కోట్లరూపాయలు కేటాయించారు. ఈ మేరకు నిధులు విడుదలై పనులు మొదలయ్యాకే బడ్జెట్ ఇచ్చారు అని గత అనుభవాలను బట్టి నమ్మగలము. ఈ సారికూడా చార్జీలను పెంచడంలేదని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. 1లక్షా21వేలకోట్లరూపాయల బడ్జెట్ ప్రతిపాదనల్లో 50 వేలకోట్ల రూపాయల లోటు చూపించారు. దీన్ని ఎలా పూడుస్తారో చెప్పలేదు. ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే చార్జీలు పెంచేస్తారని అర్ధం చేసుకోడానికి అసాధారణమైన మేధస్సు అవసరంలేదు. సాధారణ బడ్జెట్‌లో భారీగా నిధులు ఆశిస్తున్నామని, ఎల్‌ఐసి రూ.1లక్షకోట్ల రూపాయల రుణం ఇస్తుందని రైల్వేమంత్రి చెప్పారు. జనరల్‌ బడ్జెట్‌ నుంచి రైల్వేలకు నిధుల కేటాయింపు కుదరదని ఇప్పటికే ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బకాయిల్లో 30 శాతం నిధులకు కోత పెట్టింది. స్వంత వనరులు అభివృద్ధి చేసుకోవాలని సలహా ఇచ్చింది. ఈ ఏడాది రైల్వే వృద్ది 10 శాతమని గత బడ్జెట్ లో అంచనా వేశారు. అది 6 శాతం కూడా చేరలేదు. వచ్చే ఏడాది 12.4 శాతం వృద్ధి సాధిస్తామని ప్రతిపాదించారు. అది ఎలాగో వివరించలేదు. పిపిపి ద్వారా పెట్టుబడులు పెట్టినా ఆ ఆదాయాలన్నీ ప్రయివేటు రంగానికే మరలిపోతాయే తప్ప రైల్వేలకు మిగలవు. వీటన్నిటి పర్యావసానంగా అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వే ప్రయివేటీకరణ పట్టాలు ఎక్కుతుందని అర్ధమౌతోంది. ప్రతిదీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) అనడంతో క్రమంగా సర్వీసులన్నిటికీ యూజర్ చార్జీలు అనివార్యమౌతాయి. ప్రయాణీకుల భద్రతను పట్టించకునే యంత్రాంగం నిర్వీర్యమైపోతుంది. కార్మికుల సంక్షేమం అంతరించిపోతుంది. కనీస సదుపాయాలు దక్కకుండా పోతాయి. భారీ లోటు వలన రైల్వే ఉద్యోగుల వేతన సవరణ అనుమానమైపోయింది.. వైఫై, డిజిటలైజేషన్‌, ఈ-కేటరింగ్‌ వంటివి పైపై మెరుగులు. ఇవన్నీ జాతీయ, అంతర్జాతీయ ఐటి కంపెనీలకు లాభాలు ఇచ్చేవే. జన జీవనంతో పెనవేసుకున్న రైల్వేలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గితే అంతిమంగా ప్రజలపై భారాలు పడతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com