పీకే ‘ప‌శ్చిమ’ వ్యూహంపై నాయ‌కుల అసంతృప్తి..?

ఎక్క‌డ పోయిందో అక్క‌డే వెతుక్కోవాలి అంటారు. ప్ర‌తిప‌క్ష పార్టీని కూడా అదే బాట‌లో న‌డిపించాల‌ని అనుకుంటున్నారు ఆ పార్టీ స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్‌. జిల్లాల‌వారీగా ర‌హ‌స్య స‌ర్వేలు నిర్వ‌హించి, వైకాపా నేత‌ల బ‌లాబ‌లాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాపై పీకే ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. అక్క‌డే ఎందుకంటే.. 2014 ఎన్నిక‌ల్లో వైకాపాకు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా ఆ జిల్లాలో ద‌క్క‌లేదు. అత్య‌ధిక నియోజ‌క వ‌ర్గాల సంఖ్య ఉన్న ప‌శ్చిమ గోదావ‌రిలో జ‌గ‌న్ పై తీవ్ర వ్య‌తిరేక‌త నాడు వ్య‌క్త‌మైంది. జిల్లాలోని అన్ని స్థానాల‌నూ టీడీపీ ద‌క్కించుకోవ‌డంతో వైకాపా శ్రేణులు నీర‌సించిపోయాయి. గ‌డ‌చిన మూడున్న‌రేళ్ల‌లో ఈ జిల్లాలో ప్ర‌తిప‌క్ష పార్టీగా వైకాపా నాయ‌కుల హ‌డావుడి ఏమాత్రం క‌నిపించ‌లేదు. దీంతో ఇప్పుడీ జిల్లాపై పీకే ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్టు స‌మాచారం.

గుంటూరు ప్లీనరీ త‌రువాత ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ దూకుడు పెంచిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అప్ర‌క‌టిత ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం తీసుకొచ్చారని చెప్పాలి. ముఖ్యంగా వైకాపా శ్రేణుల్లో హ‌డావుడి మొద‌లైంది. ఇన్నాళ్లూ సుప్త చేత‌నావ‌స్థ‌లో ఉన్న చాలామంది నేత‌లు, ఇప్పుడు పార్టీ టిక్కెట్ల కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కూడా ఈ మ‌ధ్య కొంత‌మంది నేత‌ల హ‌డావుడి మొద‌లైంది. అయితే, పీకే రంగంలోకి దిగే స‌రికి ఆ నాయ‌కుల్లో కాస్త అసంతృప్తి ర‌గులుకుంద‌ని స‌మాచారం. ఎందుకంటే, టిక్కెట్ ఆశిస్తూ ఇప్పుడు వెలుగులోకి వ‌స్తున్న నేత‌ల బ‌లాబ‌లాల‌పై పీకే ఆరా తీయ‌డ‌మే! మూడున్న‌రేళ్లూ పార్టీ కోసం పాటుప‌డ్డ నేత‌ల‌కే టిక్కెట్లు ద‌క్కుతాయ‌ని పీకే సంకేతాలు ఇస్తున్నారట‌. ఇప్పుడు టిక్కెట్ ఆశిస్తున్న కొంత‌మంది నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల్లో స‌రైన ఆద‌ర‌ణ లేద‌నీ, కేడ‌ర్ లో ప‌ట్టు కూడా లేద‌ని పీకే స‌ర్వేల్లో తేలింద‌నీ, ఇదే అంశాన్ని జ‌గ‌న్ కూడా ఆయ‌న నివేదించార‌ని వైకాపా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

దీంతో త‌మకు టిక్కెట్లు ద‌క్క‌కుండా పీకే అడ్డుప‌డేలా ఉన్నారే అనే ఆందోళ‌న ప‌శ్చిమ వైకాపా నేత‌ల్లో పెరుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. స్థానిక ప‌రిస్థితులు ఆయ‌న‌కు అర్థం కావ‌నీ, జిల్లావ్యాప్తంగా టీడీపీ నియంత్ర‌ణ‌లో ఉంటే గ‌డ‌చిన మూడేళ్లూ తామేం చేశామంటే ఏం చెప్ప‌గ‌ల‌మ‌ని కొంత‌మంది నేత‌లు వాపోతున్నార‌ట‌! అంతేకాదు, టిక్కెట్టు ఆశించేవారు చేయాల్సిన ప‌నుల‌పై పీకే పెడుతున్న కొత్త నిబంధ‌న‌లు కూడా త‌మ‌కు కాస్త ఇబ్బందిక‌రంగానే ఉన్నాయ‌ని అంటున్నార‌ట‌. నియోజ‌క వ‌ర్గాల్లో బూతు స్థాయి క‌మిటీలు వేయాల్సిన బాధ్య‌త టిక్కెట్లు ఆశిస్తున్న‌వారే తీసుకోవాల‌నీ, పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియను కూడా ఆశావ‌హులే ద‌గ్గ‌రుండి చూసుకోవాల‌ని జ‌గ‌న్ దేశించార‌ని, ఆ బాధ్య‌త‌లు అన్నీ ఎవ‌రైతే తీసుకుంటారో వారికే గుర్తింపు ఉంటుంద‌ని పీకే అంటున్నార‌ట‌. అంతేకాదు, ఈ బాధ్య‌త‌ల‌తోపాటు పార్టీకి ఆర్థికంగా అండ‌గా నిల‌వాల‌ని కూడా అంటున్నార‌ట‌. ఇవ‌న్నీ బేరీజు వేసుకున్నాక‌నే టిక్కెట్లు ఎవ‌రికి ఇస్తామ‌నేది నిర్ణ‌యిస్తామ‌ని పీకే ష‌ర‌తులు పెడుతున్నార‌నీ, ఇలా అయితే పార్టీ బాధ్య‌త‌ను ఎవ‌రు నెత్తిన వేసుకుంటార‌నీ కొంత‌మంది నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com