సాగునీటి ప్రాజెక్టులపై దూకుడు పెంచిన కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కరువు నేలను సస్యశ్యామలం చేయడానికి దృఢ చిత్తంతో అడుగులు వేస్తుంది. పొలాలకు నీరు లేక, ఉపాధి అవకాశాలు లేక లక్షల మంది పాలమూరు కూలీలు ఆంధ్రా నుంచి అస్సాం దాకా వలస పోతున్న దయనీయ పరిస్థితులు ఇగ ముందు ఉండొద్దని కేసీఆర్ సర్కార్ కంకంణం కట్టుకున్నది.

ఇందులో భాగంగా పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టుకు కేసీఆర్ గత రెండు రోజుల్లో శంకుస్తాపన చేశారు. తెలంగాణలో కృష్ణా నది ప్రవేశించేది పాలమూరు జిల్లాలోనే అయినా అక్కడి ప్రజలకు ఆ నీరు అందడం లేదు. అక్కడి పొలాల్లో ఆ నీరు పెద్దగా పారడం లేదు. అందుకే, పాలమూరుతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలకు కలిపి 10 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వడానికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును తలపెట్టారు. దీని కోసం 35,250 కోట్లు ఖర్చు పెట్టడానికి సర్కారు సిద్ధపడ్డది.

ఫ్లోరైడ్ సమస్యతో బతికుండంగనే నరకం అనుభవిస్తున్న నల్లగొండ జిల్లా ప్రజలకు గొంతు తడపడానికి, పొలాలకు నీళ్లు పారించడానికి డిండి ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. మూడున్నర లక్షల ఎకరాలకు నీరివ్వడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల వారికి సురక్షితమైన తాగు నీరు అందుతుంది. ఆరునూరైనా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

అయితే, పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరాలను తెలిపింది. అనుమతులు లేకుండా కడుతున్నారని విమర్శలు మొదలుపెట్టింది. దీనికి తెలంగాణ కౌంటర్ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు, పట్టిసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఏందని నిగ్గదీసి అడిగింది. దీనికి ఏపీ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుందని రెట్టించి అడుగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండానే వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును కట్టలేదా అనే ప్రశ్నకు ఏపీ ప్రభుత్వం జవాబును తడుముకోవాల్సిన పరిస్థితి.

అనుమతులు, ఇతర వివాదాలు ఎలా ఉన్నా ప్రాజెక్టులను అనుకున్న ప్రకారం పూర్తి చేయడానికే తెలంగాణ సర్కార్ ముందుకు పోతుంది. దీనికోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. కరువు ప్రాంతాల్లో పొలాలకు నీరివ్వడానికి, ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవడానికి చేసే ప్రయత్నాలను ఎవరు అడ్డుకున్నా ఆటలు సాగనిచ్చేది లేదని కేసీఆర్ పరుష పదజాలంతోనే హెచ్చరిస్తున్నరు. తరతరాల అణచివేత తర్వాత మా ప్రభుత్వం వచ్చినా అడ్డంకుటు ఏందనే ఆక్రోశం ఆయన మాటల్లో ధ్వనిస్తుంది.

స్వీయ పాలనలో మా ప్లానింగ్, మా విజన్, విధానాలు మేం అమలు చేసుకుంటామనే తరహాలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. దీనికి తెలంగాణ సమాజం సంపూర్ణంగా ఆమోదం తెలుపుతున్నది. పదే పదే వ్యతిరేక ప్రకటనలు చేయడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకి అనే ముద్ర బలపడేలా వ్యవహరించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సాంకేతిక అంశాలను ఆ విధంగానే ప్రస్తావించాలే తప్ప, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం అనే తరహాలో ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేయడం ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీసే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]