ప‌దేళ్ల ‘సాక్షి’ ప్ర‌యాణం.. నాణానికి అటువైపు, ఇటువైపు..!

‘సాక్షి’ దిన ప‌త్రిక ప్రారంభ‌మై ప‌దేళ్ల‌యింది. విలువ‌ల‌తో కూడిన జ‌ర్న‌లిజం చేయాల‌నీ, ఒక వ‌ర్గం మీడియా గుత్తాధిప‌త్యాన్ని స‌వాలు చేస్తూ, నాణానికి రెండోవైపు కూడా ప్ర‌జ‌ల‌కు చూపించాల‌నే ల‌క్ష్యంతోనే ఛైర్మ‌న్ గా నాడు సాక్షిని ప్రారంభించాన‌ని ఇవాళ్ల‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రింట్ మీడియా మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా ఉన్న స‌మ‌యంలో ప్రారంభ‌మై, త‌న‌కంటూ కొంత మార్కెట్ ని సృష్టించుకుని, పాఠ‌కుల‌ను సొంతంగా పెంచుకుని, ప‌దేళ్ల పాటు ప‌య‌నం సాగించ‌డమంటే మెచ్చుకోద‌గ్గ అంశ‌మే. అయితే, ఈ ప‌దేళ్ల‌లో జ‌ర్న‌లిజంలో సాక్షి తీసుకొచ్చిన స‌మూల మార్పులేంటి..? ప్ర‌జ‌ల‌కు చూపించిన నిజాలేంటి..? ప‌్ర‌జ‌ల్లో సాక్షి ప‌ట్ల ఉన్న విశ్వ‌స‌నీయ‌త ఎంత‌.. ఇలాంటి అంశాల‌ను కొంత చ‌ర్చ‌నీయ‌మే.

ప‌త్రికాప‌రంగా చూసుకుంటే.. సాక్షి వ‌చ్చిన త‌రువాత ఫీచ‌ర్ జ‌ర్న‌లిజంలో స‌మూల మార్పులు వ‌చ్చాయి. ప్ర‌తీరోజూ ఫీచ‌ర్స్ ను ‘ఫ్యామిలీ’తో ప‌రిచ‌యం చేశారు. ఫీచ‌ర్స్ కి వార్త‌ల‌తో స‌మాన స్థాయిని క‌ల్పించ‌డం సాక్షితోనే ప్రారంభ‌మైంది. ఈ ఫీచ‌ర్స్ మ‌నుగ‌డ‌ను మొద‌ట్లో ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి కూడా ప్ర‌శ్నార్థ‌కంగానే చూశాయి. చివ‌రి వారు కూడా సాక్షిని అనుస‌రించాల్సిన పరిస్థితి వ‌చ్చింది. ఆ ర‌కంగా ఫీచ‌ర్స్ విష‌యంలో కొత్త ఒర‌వ‌డికి సాక్షి శ్రీ‌కారం చుట్టింద‌ని చెప్పొచ్చు. విద్యా సమాచారానికి ప్రాధాన్యత బాగానే ఇచ్చారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి సరిపడా కౌన్సిలింగ్ లు, సిలబస్ వంటివి ఇవ్వడంలో ఇతర పత్రికలంటే సాక్షి కాస్త ముందుందనే చెప్పొచ్చు. ఈ విషయంలో కూడా ఇతర పత్రికలు సాక్షిని అనుసరించాయని అనొచ్చు. మొద‌ట్లో రూ. 2 కే ప‌త్రికను విక్రయించారు. కానీ, మిగ‌తా ప‌త్రిక‌లు కూడా రూ. 2 ఇవ్వాలంటూ ఓ ఉద్య‌మ స్థాయి ప్ర‌చారం చేశారు! అయితే, అది సాధ్యం కాని ప‌ని అని సాక్షికీ రానురానూ అర్థ‌మైంది. ఇప్పుడు సాక్షి కూడా రూ. 5కే విక్ర‌యిస్తున్నారు.

‘విలువ‌ల‌తో కూడిన జ‌ర్న‌లిజం’ ట్యాగ్ లైన్ విష‌యానికొస్తే… దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. వారికి అనుకూల‌మైన విలువ‌ల్ని మాత్ర‌మే సాక్షి పాటిస్తూ వ‌స్తోందని చెప్పాలి. మీడియాప‌రంగా ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి ‘ఈనాడు’ కాబ‌ట్టి, ఆ సంస్థ అధినేత రామోజీరావు వ్య‌క్తిగ‌త జీవితంలోకి చొర‌బ‌డి… వారి కుటుంబ వ్య‌వ‌హారాల‌ను పేజీల‌కు ఎత్తేసిన సంద‌ర్భాలున్నాయి. ఓ ద‌శ‌లో.. కేన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న రామోజీ కుమారుడు సుమ‌న్ తో ఇంట‌ర్వ్యూ చేసి… రామోజీపై ఆయ‌న చేసిన నెగెటివ్ వ్యాఖ్య‌ల‌ను బ్యానర్స్ క‌ట్టారు. ఇది విలువ‌ల‌తో కూడిన జ‌ర్న‌లిజంలో ఒక కోణం. మ‌రోకోణం ఏంటంటే.. ఎన్నో కుంభ‌కోణాల‌ను వెలికితీసి, అక్ర‌మార్కుల అస‌లు స్వ‌రూపాల‌ను బ‌య‌ట‌పెట్టామ‌ని జ‌గ‌న్ ఈరోజున చెబుతున్నారు. అంత‌టి నిస్పాక్షిక‌త ఉన్న‌ప్పుడు.. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల వార్త‌ల్ని కూడా అదే స్థాయిలో ప్ర‌చురించాలి క‌దా! జ‌గ‌న్ విచార‌ణ గురించికానీ, ఆయ‌న‌పై ఉన్న కేసుల‌కు సంబంధించి వివ‌రాలు తెలియాలంటే ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఇత‌ర ప‌త్రిక‌లు చ‌ద‌వాల్సి వ‌స్తోంది.

సాక్షి త‌న‌కు తానుగా బ‌య‌ట‌పెట్టిన భారీ కుంభ‌కోణాలు అంటూ ఏవీ లేవు. ఆమాట‌కొస్తే, తెలుగు పాత్రికేయంలో ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిజం అనేది ఎప్పుడో పోయింది. పోనీ, చంద్రబాబు సర్కారులో లొసుగులను అత్యద్భుతంగా వెలికి తీసిందే అని ముచ్చటపడే సందర్భాలూ లేవు. టీడీపీకి ఇబ్బంది క‌లిగించే ప‌రిణామాల‌ను కూడా సాక్షి ఫోక‌స్ చేయ‌లేకోపోయింది. ఉదాహ‌ర‌ణ‌గా.. ఆ మ‌ధ్య వ‌చ్చిన ఎన్సీఈఏఆర్ రిపోర్ట్‌. ఆంధ్రాలో అవినీతి పెరుగుతోందంటూ ఫ‌స్ట్ పోస్ట్ వెబ్ సైట్ అప్ప‌ట్లో ఆ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టింది. దీన్ని ‘సాక్షి’ వాడుకోలేకోయింది. జ‌గ‌న్ ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేస్తుంటే.. స‌హ‌జంగానే ఇత‌ర ప‌త్రిక‌లు దాన్ని సంచ‌ల‌నంగా చేసి చూపుతాయి. సీబీఐ ఛార్జ్ షీట్ లో లేని ఆస్తులూ అటాచ్ చేశారూ, ఇది దారుణం అంటూ మాత్ర‌మే సాక్షి రాయ‌గ‌లిగిందే త‌ప్ప‌… ఇత‌ర ప‌త్రిక‌ల ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌లేక‌పోయింది. అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ‌లో కొంత‌మంది వ్య‌క్తం చేసిన నిర‌స‌న‌, తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు వ‌ద్దంటూ సాగిన ఆందోళ‌న‌, ఉద్దానం స‌మ‌స్య‌… ఇలా చాలా అంశాల‌పై సాక్షి ఫోక‌స్ చేయ‌లేక‌పోయింది. ఇప్ప‌టికీ చేయ‌లేక‌పోతోంది. ఇంకా, చెప్పాలంటే జ‌గ‌న్ కు, వైకాపాకు బలమైన అండ‌గా నిల‌వ‌లేక‌పోతోంది అనే చ‌ర్చ ఆ పార్టీ వ‌ర్గాల్లో ఎప్ప‌ట్నుంచో వినిపిస్తూనే ఉంది.

‘జ‌నాల‌కి నిజం చెప్పేది మేమే’ అని జ‌గ‌న్ ఇవాళ్ల చెబుతున్నారు. నిజానికి, న్యూస్ కోసం ప్ర‌జ‌లు ప‌త్రిక‌ల‌పై ఆధార‌ప‌డ‌టం లేదు, కేవ‌లం వ్యూస్ కోస‌మే..! అంటే, ఎవ‌రి వాద‌న ఏంట‌నేది తెలుసుకోవ‌డం కోస‌మే ఎక్కువ‌మంది ప‌త్రిక‌లు కొంటున్నారు. సాక్షిలో వ‌చ్చేవి మాత్ర‌మే నిజాలు అనేంత బ్రాండ్ ఇమేజ్ వారికి లేద‌నే చెప్పాలి. ఒక‌టి మాత్రం వాస్త‌వం… జ‌గ‌న్ అభిమానులను, వైకాపా కార్య‌క‌ర్త‌లతో నిత్యం ట‌చ్ లో ఉండే ఒక మాధ్య‌మంగా సాక్షి నిలుస్తూ వ‌స్తోంది. సాక్షి లేక‌పోతే జ‌గ‌న్ కు వాయిస్ ఉండ‌ద‌న్న‌ది నిజం. ఆ మేర‌కు కీల‌క పాత్ర పోషిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.