భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తె శత వసంతాల వేడుకలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే కూనంనేని ప్రకటించారు. గతమెంతో ఘన చరిత్ర అన్నట్లుగా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇస్తే చాలన్నట్లుగా పొత్తులు పెట్టుకునే స్థితికి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల్లో అది కూడా ఇస్తారో లేదో చెప్పడం కష్టం
1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిన సీపీఐ దేశ చరిత్రలో అనేక కీలక మలుపులకు సాక్షిగా నిలిచింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వంటి చారిత్రాత్మక ఘట్టాల్లో సీపీఐ పోషించిన పాత్ర చిరస్మరణీయం. అయితే, నేడు ఆ వైభవం మచ్చుకైనా కనిపించకపోవడం ఆ పార్టీ పతనానికి అద్దం పడుతోంది.
ఒకప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దిశానిర్దేశం చేసే డ్రైవింగ్ ఫోర్స్ గా ఉన్న కమ్యూనిస్టులు, ఇప్పుడు ఉనికి కోసం కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితికి చేరుకుంది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్తో పొత్తు పుణ్యమా అని దక్కిన ఏకైక ఎమ్మెల్యే సీటు ఇప్పుడు ఆ పార్టీకి మిగిలిన ఏకైక ఊరట. శత జయంతి వేడుకల ముగింపు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, భవిష్యత్తు తమదేనని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
సీపీఐ పతనానికి ప్రధాన కారణం కాలంతో పాటు మారని బూర్జువా సిద్ధాంతాలు, ప్రజల మారుతున్న ఆకాంక్షలను గుర్తించలేకపోవడమే. 1990ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మార్పులు, సాంకేతిక విప్లవం , యువతలో పెరిగిన కెరీర్ ధోరణులకు అనుగుణంగా పార్టీ తన సిద్ధాంతాలను ఆధునీకరించుకోలేకపోయింది. ప్రజల సమస్యల కంటే పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాట్లకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కరివేపాకు చందంగా మారింది. ఒకప్పుడు పదిశాతం వరకూ ఉండే ఓటు బ్యాంక్ ఇప్పుడు ఒక్క శాతానికి పడిపోయింది.
వందేళ్ల వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలోనైనా, పార్టీ తన వైఫల్యాలను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా, ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి పోరాడకపోతే, సీపీఐ ఉనికి కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితమవుతుంది.


