కోకాపేటలో రెండు ఎకరాలు..! స్వరూపానందకు యాగఫలాలు..!

తెలంగాణ కేబినెట్‌ మూడు నెలల తర్వాత సమావేశమైనప్పుడు.. పదుల సంఖ్యలో తీసుకున్న అతి కీలకమైన నిర్ణయాల్లో.. ఒకటి అందర్నీ ఆకర్షిస్తోంది. ఆ నిర్ణయమే.. విశాఖ శారదాపీఠానికి.. హైదరాబాద్ శివార్లలో రెండు ఎకరాలను నామమాత్ర ధరకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం. స్వరూపానందస్వామికి… కేసీఆర్‌తో ఉన్న అనుబంధం రీత్యా ఇది జరిగిందనేది బహిరంగరహస్యమే. కానీ.. ఏ నిబంధనల ప్రకారం.. భూములు కేటాయించారనేదే ఆసక్తికరం.

ప్రజాప్రయోజనాలకే భూములు కేటాయించాలి..!

ప్రభుత్వం.. ప్రభుత్వానికి చెందిన భూములను ఎవరికైనా కేటాయించాలంటే.. నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. పరిశ్రమలు స్థాపించి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వారికో… వృద్ధాశ్రమం పెడతామరో.. సేవా కార్యక్రమాలు చేస్తామనో.. చెప్పి.. భూములు అడగవచ్చు. వారి నిబద్ధత.. ట్రాక్ రికార్డు చూసి.. ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. అలాగే దేశం కోసం.. జీవితాలను త్యాగం చేసిన వారికి నివాస స్థలాలు కేటాయిస్తారు. కొన్ని సార్లు సాగుభూమి కూడా కేటాయిస్తారు. ఇవన్నీ పక్కాగా నిబంధనల ప్రకారం జరుగుతాయి. ఏదైనా.. ప్రజాప్రయోజనాన్నే ప్రధానంగా చూపిస్తారు. కానీ… స్వరూపానంద ఆశ్రమానికి రెండు ఎకరాలను.. ఏ కేటగరిలో.. తెలంగాణ సర్కార్ కేటాయిస్తుందనేది.. చాలా మందికి అర్థం కావడం లేదు.

కోకాపేటలో ఎకరం రూ. పాతిక కోట్లు..!

హైదరాబాద్ శివార్లలో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతం ఏదైనా ఉందా అంటే.. అది కోకాపేట మాత్రమే. అక్కడ పదేళ్ల కిందటే… ఎకరం యాభై కోట్లు చేరింది. దాన్ని చూస్తే.. అప్పట్లో వేణుమాధవ్ హీరోగా… భూకైలాస్.. ఎకరం యాభై కోట్లు అనే సినిమా కూడా తీశారు. అయితే.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కరెక్షన్ వచ్చింది. వివిధ కారణాలతో మార్కెట్ డౌన్ అయిపోయింది. ఎంత డౌన్ అయినా.. ఇప్పుడు… కోకాపేట ప్రాంతంలో.. ఎకరం ధర కనీసం.. రూ. పాతిక కోట్లు ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం… రెండు ఎకరాలు రూ. యాభై కోట్లు.. స్వరూపానంద ఆశ్రమానికి కలసి రాబోతున్నాయి.

స్వరూపానందకు యాగఫలాలు దక్కుతున్నాయా..?

స్వరూపానంద స్వామి.. ఇటీవలి కాలంలో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత సన్నిహితుడయ్యారు. ఆయన … జగన్మోహన్ రెడ్డి కోసం.. ఏకంగా తపస్సు చేశానని చెప్పుకున్నారు. కేసీఆర్ కోసం… రాజశ్యామల యాగాలు చేశారు. ఇద్దరూ గెలిచారు. గెలుపునకు కారణాలు ఏమైనా… స్వరూపానంద పూజలు కూడా కారణమని.. ఇద్దరూ నమ్ముతున్నారు. కేసీఆర్ మరింత డైనమిక్ కాబట్టి… ఆయన కోకాపేటలో రెండు ఎకరాలను.. స్వరూపానంద ఆశ్రమానికి.. రాసిచ్చేస్తున్నారు. తెలంగాణలో ప్రశ్నించడానికి ప్రతిపక్షం యాక్టివ్ గా లేదు.. ప్రశ్నించినా పట్టించుకునే మీడియా లేదు కాబట్టి… యాగానికి.. ఫలం.. స్వరూపానందకు దక్కినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com