గత కొన్నేళ్లుగా వేసవి సీజన్ ని టాలీవుడ్ క్యాష్ చేసుకోలేకపోతోందన్న అసంతృప్తి ఉంది. 2026 కూడా చప్పచప్పగానే సాగుతోంది. పెద్ద సినిమాలేవీ బరిలో లేకపోవడం, చిన్న సినిమాలు నిలబడలేకపోవడం, మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్ల వైపు తీసుకురావడంలో విఫలం అవ్వడంతో ఈ వేసవి నీరుగారిపోతోంది. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కూడా వేసవి వృథా అవుతోంది.
అయితే 2027 వేసవి ఇలాక్కాదు. ఈసారీ హీట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే రాబోయే సినిమాలు అలా ఉన్నాయి. 2027 సమ్మర్ సీజన్ ని టాలీవుడ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొంది. అగ్ర హీరోల సినిమాలన్నీ 2027 వేసవిలోనే రాబోతున్నాయి.
‘వారణాసి’ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రాజమౌళి సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండగ. దానికి సీజన్లతో పని లేదు. సాధారణంగా రాజమౌళి సినిమాలన్నీ వాయిదాల పర్వంలో.. సాగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం జక్కన్న చెప్పిన సమయానికే సినిమాని విడుదల చేయబోతున్నారు. షూటింగ్ ఆ రేంజ్ లో సాగుతోంది.
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ మార్చి 5న డేట్ ఫిక్స్ చేసుకొంది. ప్రభాస్ రేంజ్ గురించి అందరికీ తెలిసిందే. పైగా ఇది సందీప్ సినిమా. కాబట్టి.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘స్పిరిట్’ తో వచ్చే వేసవికి కిక్ స్టార్ట్ దొరకబోతోంది.
ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కూడా 2027 వేసవిలోనే రాబోతోందని ప్రకటించారు. జూన్ 11న ముహూర్తం ఫిక్స్ చేశారు. సో.. ఎన్టీఆర్ సినిమాతో వేసవికి శుభం కార్డు పడబోతోంది. అయితే ఈమధ్యలో ‘రాకా’ కూడా వచ్చే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పకపోయినా 2027లోనే ‘రాకా’ రాబోతోంది. వేసవి ఈ సినిమాకు బెస్ట్ సీజన్. సంక్రాంతి లక్ష్యంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటున్నా… వేసవికే షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికైతే ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ.. ఇలా అగ్ర హీరోల సినిమాలన్నీ 2027 వేసవి సమరంలో దిగడం ఖాయం. ఈ లిస్టులో ఇంకెంతమంది హీరోల పేర్లు తోడవుతాయో?
