’24 కిసెస్’ ట్రైల‌ర్‌: కామిగానివాడు మోక్ష‌గామి కాలేడు

అర్జున్‌రెడ్డి ద‌య‌… ఇప్ప‌టి సినిమాల్లో ముద్దులు ఎక్కువ‌య్యాయి. ఆర్.ఎక్స్ 100 తో.. సెక్స్ కూడా ఎక్కువయ్యింది. సినిమా సినిమా అంటే – ఉంటే ముద్దులైనా ఉండాలి, లేదంటే సెక్స్ అయినా ఉండాలి అన్న‌ట్టు త‌యారైంది వ్య‌వ‌హారం. `24 కిసెస్‌` ట్రైల‌ర్ చూస్తే.. ఈ జాబితాలో చేరే చిత్రం అయి తీరుతుంద‌నిపిస్తోంది.

‘మిణుగురులు’ తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న అయోధ్య‌కుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన సినిమా ఇది. మంచి క్లాస్ సినిమాతో అడుగుపెట్టిన అయోధ్య‌కుమార్‌.. ఈసారి ఊర మాస్‌, యూత్‌ని కిర్రెక్కించే సినిమా తీశాడ‌నిపిస్తోంది. ప్లేబాయ్ లాంటి కుర్రాడి క‌థ ఇది. అత‌ని జీవితంలోకి ల‌క్ష్మి అనే ఓ అంద‌మైన, అమాయకురాలైన అమ్మాయి ప్ర‌వేశిస్తే.. ఏం జ‌రుగుతుందో చూపించారు. టైటిల్‌కి త‌గ్గ‌ట్టు ట్రైల‌ర్లో ముద్దులే ముద్దులు. కొన్ని అర్జున్ రెడ్డిని, ఆర్‌.ఎక్స్ 100ని మించిపోయాయి. మ‌రి సినిమాలో ఎన్నుంటాయో చూడాలి. రావు ర‌మేష్ పేల్చిన డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా ‘‘అద్వైతాన్నైనా అర్థం చేసుకోవచ్చు కానీ ఆడదాన్ని అర్థం చేసుకోలేం సుబ్బారావ్‌.. అని ఎస్వీఆర్ అన్నారు’’ అనే డైలాగ్ ఈ సినిమా కంటెంట్ మొత్తం చెప్పేస్తోంది. హెబ్బాప‌టేల్ అందాలు, ముద్దులు ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. సెప్టెంబరు 13న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com