విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలో నివసించే మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసే దిశగా VMRDA కీలక అడుగు వేసింది. 2026 సంవత్సరానికి గాను సంస్థ నిర్దేశించుకున్న 10 ప్రధాన లక్ష్యాలలో భాగంగా, సుమారు 25,000 నివాస ప్లాట్లను అభివృద్ధి చేయనున్నట్లు మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ ప్రకటించారు. పెరుగుతున్న జనాభా , పట్టణీకరణ అవసరాలకు అనుగుణంగా, మధ్య ఆదాయ వర్గాలకు సరసమైన ధరలకే స్థలాలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
ఈ బృహత్తర ప్రాజెక్టును పక్కా ప్రణాళికతో అమలు చేసేందుకు VMRDA కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సాలరీడ్ ప్రొఫెషనల్స్, ప్రభుత్వ ఉద్యోగులు ,చిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని ఈ లేఅవుట్లను రూపొందిస్తున్నారు. వివాద రహితమైన, అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన స్థలాలను అందించడం ద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్లో సామాన్యులకు భరోసా కల్పించాలని సంస్థ భావిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ , కొత్త ఐటీ కారిడార్ల సమీప ప్రాంతాల్లో ఈ ప్లాట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కేవలం ప్లాట్ల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా, పాలనలో పారదర్శకత కోసం VMRDA వినూత్న మార్పులు ప్రవేశపెడుతోంది. ప్లాట్ల కేటాయింపులో జాప్యం తగ్గించడానికి Vizag Integrated Buyers-Sellers Exchange, వాట్సాప్ ఆధారిత పౌర సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే హెల్ప్ డెస్క్‌ల ద్వారా కొనుగోలుదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ప్రతి సోమవారం ‘Work with VMRDA’ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా అధికారులను కలిసే అవకాశం కల్పించారు.
ఈ భారీ ప్లాట్ల అభివృద్ధి ప్రణాళికతో పాటు, 2026 మే నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానంగా ఉన్న ఏడు ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలని VMRDA లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మౌలిక సదుపాయాల కల్పన వల్ల కొత్తగా ఏర్పడే లేఅవుట్లకు డిమాండ్ పెరగడమే కాకుండా, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు భావిస్తున్నారు. పారదర్శకమైన వేలం ప్రక్రియ , డిజిటలైజేషన్ ద్వారా ఈ ప్లాట్ల విక్రయాలను చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
