ప్రలోభాలు లేకపోయినా 7 శాతం ఓట్లు..! మార్పునకు ఇదే నాంది అంటున్న పవన్..!

ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ ఏ మాత్రం దిగ్భ్రాంతికి గురి కాలేదు. పైగా.. పూర్తి పాజిటివ్ దృక్పధంతో … పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారు. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలు పెట్టకుండా.. దాదాపుగా ఏడు శాతం ఓట్లు సాధించామని…మార్పునకు ఇంత కంటే పెద్ద సూచిక ఏముంటుందన్న అభిప్రాయం.. జనసేన నేతల్లో వ్యక్తమవుతోంది.

ఓటమిని లెక్క చేయని పవన్..! భవిష్యత్ పై దృష్టి..!

జనసేన తరపున పోటీ చేసిన కొంత మంది అభ్యర్థులు ముఖ్య నేతలతో.. పవన్ కల్యాణ్ విజయవాడలో సమావేశమయ్యారు. ఫలితాలపై ఏ మాత్రం నిరాశ చెందాల్సిన పని లేదని… పవన్ కల్యాణ్ తన చేతలతోనే ఆ నేతలకు చెప్పారు. ఉల్లాసంగా .. ఉత్సాహంగా.. మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపైనా పిచ్చాపాటిగా మట్లాడారు. పాతికేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం.. వెంటనే అధికారం కోరుకోట్లేమని పవన్ కల్యాణ్ ఇంతకు ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. అయితే పార్టీ నేతల్లో మాత్రం..కొంత సందిగ్ధం ఉంది. ఘోరపరాభవం తర్వాత పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు అన్నది వారికి టెన్షన్‌గా మారింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్పందన వారిని భవిష్యత్ రాజకీయంపై మరింత దృష్టి పెట్టేలా చేసింది.

పాతికేళ్ల రాజకీయానికి పునాదులు..!

తమ లక్ష్యం పాతికేళ్లు అని.. పార్టీ ఆవిర్భావం రోజే నిర్ణయించుకున్నామని.. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆగిపోయేది లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు, అభిమానులకు సందేశం పంపుతున్నారు. మద్యం, నగదు ప్రభావం లేకుండా క్లీన్‌ పాలిటిక్స్‌ తీసుకువచ్చామని.. ఇదే తరహా రాజకీయాలను జనాలు కోరుకుంటున్నారని.. తమకు వచ్చిన ఓట్లతో తెలిసిందని.. పవన్‌ కల్యాణ్‌ ధీమాతోఉన్నారు. ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో జనసేన సాధించిన ఓట్లు..టీడీపీ పరాజయానికి కారణం అయ్యాయి. ఎన్నికల ప్రచారసభల్లో తాను గెలవకపోవచ్చు కానీ.. ఓడిస్తానని చెప్పారు. అన్నట్లుగా..చాలా చోట్ల ఓడించారు.

అడపాదడపా సినిమాలు కూడా చేస్తారా..?

పవన్ కల్యాణ్… ఇక పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. గ్రామాల వారీగా క్యాడర్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నారు. జూన్ మొదటి వారంలో.. పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరితో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే పవన్ ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా రాజకీయాల మీద దృష్టి సారిస్తారా.. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అని రెండు పడవల ప్రయాణం చేస్తారా అన్న చర్చ జనసైనికులు, పవన్‌ అభిమానుల్లో నడుస్తోంది. దీనిపై పవన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com