రాజకీయం చేయడం అంటే ఫేక్ న్యూస్లు ప్రచారం చేయడమే అన్నట్లుగా చెలరేగిపోతున్న వైసీపీ మూకలకు ముకుతాడు వేయడానికి చంద్రబాబు ప్రత్యేక చట్టం ఆలోచన చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు కథనాలు, పోస్టులు పెట్టి ప్రజల్ని గందరగోళ పరిచి.. ఉద్రిక్తలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఇందు కోసం ప్రత్యేక ముఠాలను ఏర్పాటు చేసుకున్నారని స్పష్టమైన సమాచారం ప్రభుత్వానికి అందింది.అందుకే వారి ఆగడాలను ఏ మాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు.
మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. హోంమంత్రి సహా ఐదుగురు మంత్రులతో ఓ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కఠిన చర్యలతో చట్టం ఉండేలా ఈ సబ్ కమిటీ సలహాలు ఇవ్వనుంది. యూరియా విషయంలో.. హంద్రీనీవా నీటి విషయంలో తప్పుడు ప్రచారాలు చేయడం చంద్రబాబును తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. చట్టపరంగానే ఫేక్ న్యూస్ కట్టడి చేయకపోతే ప్రజలు అదే నమ్ముతారని భావిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా హెరిటేజ్ స్టోర్లు లేకపోయినా ఉన్నట్లుగా ఊహించి..అందులో ఉల్లిపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ప్రచారం చేయడం అందులో భాగమేనని నమ్ముతున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై చర్యలు తీసుకుటూ చట్టం తీసుకువస్తే కొంత మంది మీడియా స్వేచ్చ అంటూ గగ్గోలు పెట్టే అవకాశం ఉంది. కానీ నిజాలు చెప్పే వారికి ఎలాంటి సమస్యలు లేకుండా.. ఉద్దేశపూర్వకంగా ఫేక్లు, మార్ఫింగ్లుతో ఫేక్ ప్రచారం చేసే వారిపైనే చర్యలు తీసుకునే కఠిన చట్టం తీసుకు వస్తే ప్రజలు కూడా స్వాగతించే అవకాశం ఉంది.


