వైసీపీ నాయకత్వం రైతు పోరు పేరుతో మరో ధర్నా కార్యక్రమం ప్రకటించింది. ఏమీ చేయకపోతే వైసీపీ గురించి ప్రజలు మర్చిపోతారని.. ఎప్పుడో ఓ సారి ధర్నా కార్యక్రమాలకు పిలుపనిస్తారు. పార్టీ నేతలు ఓ వంద మందిని పోగేసి ర్యాలీ చేస్తే.. వైసీపీ మీడియాలో, సోషల్ మీడియాలో వాటిని గ్రాఫిక్స్ చేసుకుని ప్రచారం చేసుకుంటారు. అదే ప్రజా సమస్యల కోసం పోరాటం అని వైసీపీ నేతలు అనుకుంటూ ఉంటారు.
అలాంటి పోరాటం మళ్లీ చేయడానికి 9వ తేదీని ప్లాన్ చేసుకున్నారు. యూరియా సమస్యపై ధర్నా చేస్తారట. అంతకు మించి ఇతర రైతుల సమస్యలు ఏమున్నాయంటే.. జనరల్‌గా వైసీపీ అధికారం లేకపోతే.. జనం అంతా కష్టాల్లో ఉన్నారని అనుకుంటూ ఉంటారు.. అలాగే.. రైతులంతా కష్టాల్లో ఉన్నారని ధర్నా చేస్తారు. పోనీ ఇలాంటి కార్యక్రమాలకు అయినా జగన్ రెడ్డి వస్తారా.. పార్టీ క్యాడర్ ను ముందుండి నడిపిస్తారా అంటే.. అంటే అలాంటిదేమీ ఉండదు. ఆయన మాత్రం ప్యాలెస్ లోనే ఉంటారు.
పార్టీ ముఖ్యనేతలు చాలా మంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కొంత మంది అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. మరికొంత మంది మీడియా సమావేశాలు పెట్టడం మాత్రమే రాజకీయం అనుకుంటున్నారు. క్యాడర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా ఉండే రాజకీయాలు చేయుకండా.. మీడియాలో హైలెట్ చేసుకోవడానికి మాత్రమే వైసీపీ రాజకీయాలు చేస్తోంది.
