జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కాసేపటి వరకూ సోషల్ మీడియాలో హడావుడి చేసిన బీఆర్ఎస్ సైనికులు తర్వాత ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం, రిగ్గింగ్ అంటూ ప్రచారం ప్రారంభించారు. ఆ పార్టీ బలం, బలహీనత సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం ఉద్ధృతంగా చేయడమే. కానీ గ్రౌండ్ లో మాత్రం ఆ ప్రచారం ప్రభావం ఎంత అన్నది మాత్రం వారు అర్థం చేసుకోలేకయారు.
సోషల్ మీడియా ద్వారా హైప్ ఎక్కించుకున్న బీఆర్ఎస్
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఖరారు చేయడంతోపాటు మజ్లిస్ మద్దతు ప్రకటించినప్పుడే కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేదని స్పష్టమయింది. అయితే ప్రయత్నం చేయాలి కదా అన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా హైప్ ఎక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బలహీనంగా ఉంది. ఆ పార్టీ వాయిస్ అనుకున్నంతగా బయటకు రాలేదు. దీంతో బీఆర్ఎస్దే రాజ్యం అయింది. కానీ ఆ హైప్ గ్రౌండ్ లోకి ట్రాన్స్ ఫర్ కాలేదు. ఎన్ని సర్వేలను అనుకూలంగా ప్రకటించుకున్నా.. ప్రజలు మాత్రం అలాంటి పరిస్థితి ఉందని అనుకోలేదు.
పోలింగ్ అయిపోగానే బయటపడిన బీఆర్ఎస్ నిరాశ
పోలింగ్ జరుగుతున్నప్పటి నుంచే ఓటమికి కారణాలన్నట్లుగా బీఆర్ఎస్ చెప్పుకోవడం ప్రారంభించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కరంటే ఒక్క లీడర్ కూడా తాము గెలుస్తామని ధైర్యంగా చెప్పలేకపోయారు. చివరికి కేటీఆర్ కూడా కాస్తంత అయినా కాన్ఫిడెన్స్ ఉన్నట్లుగా వ్యవహరించలేకపోయారు. పోలింగ్ అయిపోగానే కాంగ్రెస్ అరాచకాలు, దొంగ ఓట్లు అంటూ ఏడుపులు ప్రారంభించారు. కాంగ్రెస్ గెలుపు గెలుపు కాదని చెప్పడానికి తమ సోషల్ మీడియాశక్తిని ముందుగానే అలా ఉపయోగించడం ప్రారంభించారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత ధైర్యం ఇచ్చినట్లయింది. నిన్నటి వరకూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఇచ్చిన హైప్ చూసుకుని కంగారు పడిన కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకునేలా చేశారు.
ఫలితం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని సవాళ్లు
ఫలితం తరవాత బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి. బీజేపీ పూర్తిగా చేతులెత్తేసి..బీఆర్ఎస్ విజయం కోసం పరోక్ష సహకారం అందించిన పరిస్థితుల్లోనూ ఆ పార్టీ విజయం అందుకోకపోతే.. పార్టీ క్యాడర్ పార్టీలో ఉండటం కష్టం. ఈ ఉపఎన్నిక విజయం తర్వాత రేవంత్ రెడ్డి వెంటనే .. లోకల్ పోల్స్ కు వెళ్తారు. ఆ సమయంలో బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీ లేదా కాంగ్రెస్ కు వలసపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సమస్యల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం లీడర్లను..క్యాడర్ ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంది.


