ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో ఏ ప్రాతిపదికన జగన్ నిర్ణయించారో .. ఆ ఫార్ములా ఏంటో వైసీపీ నేతలకు ఇప్పటికీ తెలియదు. ఎక్కడో శ్రీకాకుళం రాజాం నుంచి తీసుకు వచ్చి పాయకరావుపేటలో పోటీ చేయించారు. ఎర్రగొండపాలంలో సురేష్ సోదరుడ్ని తీసుకెళ్లి కర్నూలు జిల్లాలో నిలబెట్టారు. ఇక మంత్రులు, మాజీ మంత్రులు నియోజకవర్గాలు మారిపోయిన వాళ్లకు అసలు ఏ ప్రాతిపదికన మార్చారో కూడా ఎవరికీ తెలియదు. కనిగిరిలో ఉండే నేతకు కందుకూరులో వేశారు. అలా ఎందుకు సార్ అని అడిగే అడిగే అవకాశం ఇవ్వలేదు. అందర్నీ అస్సాం పంపేశారు. వారితో పాటు తాను కూడా వెళ్లిపోయారు.. అది వేరే విషయం.
ఇప్పటికీ అదే జంబ్లింగ్ టార్చర్
జగన్మోహన్ రెడ్డి తన జంబ్లింగ్ ఘోరంగా ఫెయిలయినప్పటికీ ఆయన వదిలి పెట్టడం లేదు. ఏడాదిన్నర గడుస్తున్న తర్వాత చాలా నియోజకవర్గాల్లో పని చేసే ఇంచార్జులు లేరు. అలాంటి చోట్ల కుల సమీకరణాలు చూసుకుని ఇతర నేతల్ని అక్కడికి పంపిస్తారు. ఆ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడికి పోవాల్సిందేనని జగన్ హూంకరిస్తున్నారు. జగన్ తీరుతో నొచ్చుకున్న విడదల రజనీ లాంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి ఇంట్లో కూర్చుకుందామని అనుకుంటున్నారు. ఆమె తనను చిలుకలూరిపేట నుంచి మారిస్తే… తాను పార్టీకి గుడ్ బై చెబుతానని సంకేతాలు పంపారు.
తమ పాత నియోజకవర్గాలు కావాలంటున్న నేతలు
గతంలో జంబ్లింగ్ దెబ్బకు ఎక్కడెక్కడకో పోయి పడిన నేతలంతా తమకు తమ పాత నియోజకవర్గాలు కావాలని అడుగుతున్నారు. ఆదిమూలం సురేష్ .. చక్కగా యర్రగొండపాలెంలో ఈజీగా గెలిచేవారు. ఆయనను తీసుకెళ్లి టీడీపీ కంచుకోట కొండెపిలో పడేశారు. ఆయన నాకు యర్రగొండపాలెం కావాలని అడుగుతున్నారు. కొండెపిలో ఉండటం లేదు. కానీ జగన్ మాత్రం గతంలో పోటీ చేసిన చోటే పని చేసుకోవాలని అంటున్నారు. ఆయా నియోజవకర్గాల్లో అపరిచితులమైన తాము .. ఏ కనెక్షన్స్ తో అనుబంధం పెంచుకోవాలో తెలియక వారు మథనపడుతున్నారు. రాజకీయాలకు దూరమవుతున్నారు. పార్టీని పట్టించుకోవడం లేదు.
ఎవరెవరో వస్తే ప్రజలు ఆదరించేస్తారా?
ఎవరెవరో వచ్చి నేను మీకు వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిని అంటే.. ప్రజలు ఆహ్వానించే అవకాశం ఉండదు. ప్రజలు కాదు.. వైసీపీ క్యాడరే ఆహ్వానించరు. అయినా సరే జగన్ మాత్రం.. తనకు మోకాలు రుద్దుకున్నప్పుడు ఎలాంటి ఆలోచన వస్తే దాన్ని అమలు చేయడాన్ని మించిన మార్గం లేదని తేల్చేస్తారు. ఇప్పటికీ .. పార్టీ అభ్యర్థుల్ని ఓ చోట పని చేసుకోకుండా అడ్డదిడ్డంగా నియోజకవర్గాలు మార్చేస్తున్నారు. దీంతో ఖర్చు పెట్టుకోవడం ఎందుకని చెప్పి.. చాలా మంది నేతలు సైలెంట్ అవుతున్నారు. ఏదైనా ఉంటే.. ఎన్నికలకు ఆరు నెలల ముందు చూసుకుందామని అనుకుంటున్నారు. జగన్ కు పట్టుకున్న జంబ్లింగ్ పిచ్చి వల్ల.. టిక్కెట్ ఎక్కడిస్తారో కూడా అంచనా వేయడం కష్టమని అనుకుంటున్నారు.
