అదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిన్న నిర్వహించిన రైతు గర్జన సభలో పాల్గొన్న నేతలు అందరూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమ సభకి హాజరైన బారీ జనాలని చూసి చాలా మురిసిపోయారు. కానీ మంత్రి హరీష్ రావు వారికి అంతే ఘాటుగా జవాబు చెప్పడమే కాకుండా వారికి సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు.
నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ మండలంలోని రూ.23.80 కోట్ల వ్యయంతో చేపడుతున్న గుత్ప ఎత్తిపోతల పధకానికి ఆయన మంగళవారం శంఖుస్థాపన చేశారు. దాని ద్వారా జిల్లాలో అదనంగా 2642ఎకరాలకి నీళ్ళు అందించవచ్చు. ఆ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, “10 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటే కుంభకర్ణుడిలాగ మొద్దు నిద్రపోయింది అంతే! అధికారంలో ఉన్నప్పుడు మొద్దునిద్రపోయినే కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు రాష్ట్రం కోసం మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. మళ్ళీ మాప్రభుత్వం చేస్తున్న పనులని కూడా వారు అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
పైగా సిగ్గులేకుండా ఆదిలాబాద్ లో రైతు గర్జన సభ కూడా నిర్వహించారు. ఇంతకీ ఆ సభలో వారు ఏమి చెప్తారు? మా నిర్లక్ష్యం కారణంగానే నిజాంసాగర్ ప్రాజెక్టు క్రికెట్ మైదానంగా మిగిలిపోయిందని చెపుతారా? మేము కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ద్వారా నిజాంసాగర్ ని నింపాలనుకొంటున్నాము. అది తప్పా? కాంగ్రెస్ నేతలే చెప్పాలి. రైతుల కష్టసుఖాలు, వారి అవసరాలు తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ జిల్లాకి నీళ్ళు పారించడం మాకిష్టం లేదని చెపుతారా? ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులకి అడ్డుపడుతూ మళ్ళీ రైతులకి అన్యాయం జరిగిపోతోందంటూ రైతు గర్జన సభ నిర్వహించడం సిగ్గుచేటు..ప్రజలని మోసగించడమే అవుతుంది,” అని అన్నారు.
టీ-కాంగ్రెస్ నేతలని హరీష్ రావు చాలా చక్కగానే నిలదీశారు. అయితే వారు చేస్తున్న ప్రధాన ఆరోపణ-సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాల గురించి ప్రస్తావించలేదు. నేరుగా సమాధానం చెప్పలేదు. టీ-కాంగ్రెస్ నేతలు కూడా ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని చెపుతున్నారే తప్ప తమ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించడం లేదు కనుక వాటిని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి అడ్డుకొనే ప్రయత్నం చేయడం లేదు. అంటే అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్, అది ప్రాజెక్టులని అడ్డుకొంటోందనే సాకుతో టిఆర్ఎస్ రెండు కూడా రాజకీయాలు చేస్తున్నాయే తప్ప అవినీతి జరుగకుండా అడ్డుకొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని అనుమానించవలసి వస్తోంది. ఇంతకీ తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి జరుగుతోందా లేదా? అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెపుతారు? దానిని అడ్డుకొనే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా …ప్రతిపక్షాలదా లేక న్యాయస్థానాలదా?అందరూ ఆలోచించాలి.