రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ రాష్ట్ర విభజన, దానిలో జగన్ పాత్ర గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదే కాదని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించి అది దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి బయటకి వెళ్లిపోవడం చేతనే కాంగ్రెస్ అధిష్టానం విధిలేని పరిస్థితులలో రాష్ట్ర విభజన చేయవలసి వచ్చిందని అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టకుండా సోనియా గాంధీ పట్ల విధేయంగా ఉండి ఉంటే ఆమె రాష్ట్ర విభజనకి ఒప్పుకొనేవారే కాదు..అప్పుడు ఆంధ్ర ప్రజలకి, రాష్ట్రానికి ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవికావని టి.జి.వెంకటేష్ అన్నారు.
టి.జి.వెంకటేష్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చినవాడే కనుక ఆయన చెపుతున్న ఈ మాటలో ఎంతో కొంత వాస్తవం ఉందని భావించవచ్చు. తెలంగాణా కోసం చాలా కాలంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు వాటి ప్రభావం కనబడలేదు. ఆయన మరణించిన తరువాతే ఉద్యమాలు ఉదృత రూపం దాల్చాయి. కనుక ఆయన వారసుడుగా ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలలో మంచి గుర్తింపు, సానుభూతి ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే, సోనియా గాంధీ రాష్ట్ర విభజనకి అంగీకరించి ఉండేవారు కాదనే చెప్పవచ్చు. అప్పటికీ ఆమె సుమారు మూడేళ్ళ పాటు రాష్ట్ర విభజనకి అంగీకరించలేదు. జగన్ పార్టీని వీడివెళ్లిపోయిన తరువాత ఉభయరాష్ట్రాలకి ఆమోదయోగ్యుడైన బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం చేతనే ఆమె రాష్ట్ర విభజనకి అంగీకరించవలసి వచ్చిందని చెప్పవచ్చు. రాజశేఖర్ రెడ్డి తరువాత తెలంగాణాలో సీనియర్ కాంగ్రెస్ నేతలెవరినైనా ముఖ్యమంత్రిగా నియమించి ఉన్నా బహుశః రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదేమో? లేదా మరికొంత కాలం ఆ నిర్ణయం వాయిదాపడి ఉండేది.
తరువాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య అసమర్ధత, కిరణ్ కుమార్ రెడ్డి చాలా అహంభావంతో తెలంగాణా వ్యతిరేకత ప్రదర్శించడం వంటి కారణాలు కెసిఆర్, ప్రొఫెసర్ కోదండరాంల నేతృత్వంలో సాగుతున్న తెలంగాణా ఉద్యమాలకి ఆజ్యం పోసి ఉదృతరూపం దాల్చేందుకు దోహదపడ్డాయి. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కొంచెం ఓపికపట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉన్నా కూడా రాష్ట్ర విభజన నిర్ణయం మరికొంత కాలం వాయిదా పడేదేమో కానీ విభజన మాత్రం ఎప్పుడో అప్పుడు జరిగి తీరేదే. అయితే జగన్మోహన్ రెడ్డి చాలా అతివిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బయటకి వచ్చినప్పటికీ నేటికీ తన ముఖ్యమంత్రి కలని సాకారం చేసుకోలేకపోయారు. కనీసం వచ్చే ఎన్నికల తరువాతైన ఆయన కల నెరవేరుతుందో లేదో చూడాలి. ఆయన దుందుడుకుతనం వలన స్వయంగా ఆయన చాలా నష్టపోయారు, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా నష్టపోయింది.