“తమ్ముళ్ళూ నేను ఎప్పుడైనా ఎవరికైనా భయపడ్డానా?” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగే ప్రశ్నకి సమాధానం ఆయనకీ తెలుసు…తమ్ముళకీ తెలుసు. ముంజేతి కంకణం చూసుకొనేందుకు మళ్ళీ అద్దం ఎందుకు అన్నట్లుగా ఆయన తమ్ముళ్ళని ఆ ప్రశ్న అడగడటం కూడా అనవసరం. తమ్ముళ్ళు మొహమాటపడి ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పకపోయినా వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అటువంటి మొహమాటాలు ఏవీ లేవు కనుక చాలా నిర్మొహమాటంగానే సమాధానం చెప్పారు. అంతే కాదు చాలా సంచలన ఆరోపణ కూడా చేశారు.
ఓటుకి నోటు కేసు నుంచి విముక్తి పొందేందుకు చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి రూ.500 కోట్లు చెల్లించారని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని కూడా తాకట్టు పడుతున్నారని ఆరోపించారు. అందుకే ‘చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని ప్రగల్భాలు పలికిన కెసిఆర్, 14నెలలు గడిచినా ఇంతవరకు ఆ కేసులో అనుబంద చార్జ్ షీట్ వేయలేదని’ ఆరోపించారు. కెసిఆర్ తో కుదిరిన ఆ ఒప్పందంలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఉన్న పళంగా హైదరాబాద్ ని విడిచిపెట్టేసి విజయవాడ తరలివచ్చేశారని ఆరోపించారు. ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడుని కాపాడటానికి తెర వెనుక చాలా పెద్ద కధే నడిచిందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
ఓటుకి నోటు,టెలిఫోన్ ట్యాపింగ్ కేసులతో ఇరువురు ముఖ్యమంత్రులు చిక్కుకొని ఉన్నప్పుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మద్యవర్తిత్వం చేసి వారిద్దరికీ రాజీ కుదిర్చారనే వార్తలు వచ్చాయి కానీ భూమన ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు కెసిఆర్ కి రూ.500 కోట్లు చెల్లించారనే వార్తలు ఎన్నడూ వినలేదు. కనుక ఆ ఆరోపణలకి ఆధారాలు చూపించవలసిన బాధ్యత అయన మీదే ఉంది. అదేవిధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దానిని ఖండించవలసి ఉంటుంది. లేకుంటే ఆ ఆరోపణలు నిజమని ప్రజలు భావించే అవకాశం ఉంది.
ఓటుకి నోటు కేసుని పునర్విచారణ చేయాలని ఏసిబి కోర్టు ఆదేశించినందున తెదేపాకి మళ్ళీ పెద్ద సమస్యే వచ్చి పడిందని చెప్పవచ్చు.