నందమూరి బాలకృష్ఱకు ముహూర్త బలంపై నమ్మకం ఎక్కువ. ఏ పని చేసినా.. ముహూర్తాలు తప్పని సరి. ఆడియో వేడుక కూడా ఆయన చెప్పిన టైమ్‌కి జరుగుతుంటుంది. ఇప్పుడూ అంతే! ఆయన టీజర్‌కి టైమ్ ఫిక్స్ చేశారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శ్రియ కథానాయిక. దసరా సందర్భంగా టీజర్‌ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకు బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరా మంగళవారం వచ్చింది. సెంటిమెంట్ పరంగా మంగళవారం కలసి రావడం లేదు. అందుకే సోమవారం రాత్రే టీజర్‌ని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్వయంగా ముహూర్తం చూసి టైమ్ ఫిక్స్ చేశారట బాలకృష్ణ. గంటలు, నిమిషాలతో సహా… కోట్ చేశార్ట. దాన్ని బట్టి టైమ్ విషయంలో బాలయ్య ఎంత పక్కాగా ఉన్నారో అర్థమవుతోంది.
ఇప్పటికే టీజర్ కట్ చేసిన క్రిష్.. దాన్ని చూపించి బాలయ్య అనుమతి పొందాడట. దసరా తరవాత దీపావళికి ఓ టీజర్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబరు మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలకే సరిపోతుంది. ఇప్పటికే గౌతమి పుత్ర 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. ఇందులో 40 శాతం యుద్ద సన్నివేశాలే ఉండడం విశేషం. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం నాలుగు టీమ్‌లు రాత్రింబవళ్లూ కష్టపడుతున్నాయి. అన్నట్టు… ఈ సంక్రాంతికి చిరుతో పోటీ పడేది… బాలయ్య సినిమానే.