తెలంగాణలో ఏకంగా 31 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న 10 జిల్లాల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగనుంది. దసరా నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అడిగిందే తడవుగా జిల్లాలను ఇచ్చేయడానికి సర్కారు సిద్ధంగా ఉన్నట్టుంది. చేతికి ఎముకన్నదే లేనట్టుగా పార్టీనాయకులు ఏ జిల్లా కోరితే ఆ జిల్లా ఇచ్చేస్తారనే విధంగా నిర్ణయాలు జరిగిపోయాయి.
ముందు ప్రతిపాదించిన జిల్లాలు 27. ఇప్పుడు కొత్తగా నాలుగు జిల్లాలకు పచ్చజెండా ఊపారు. 27 జిల్లాలు, డివిజన్లపై సీరియస్ గానో, నామ్ కే వాస్తేగానో ప్రజాభిప్రాయం అడిగారు. ఇప్పుడు కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయం అడిగేది ఉండదా? రెవెన్యూ డివిజన్లు, మండలాలపై వచ్చిన అభ్యంతరాల పరిస్థితి ఏమిటి? వీటికి జవాబు లేదు. సాంకేతికంగా, ప్రజలకు వివరించడం, వారి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి సమయం ఇవ్వక పోవడం న్యాయపరంగా చెల్లుతుందా లేదా అనేది ప్రశ్న. ఒక వేళ ఇది న్యాయపరంగా చెల్లకపోతే చిక్కులు తప్పవేమో అని అనుమానిస్తున్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎలా అనేదానిపైనా ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం.
30 జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం ముందే సిద్ధపడిందని ప్రచారం జరిగింది. ప్రజల అభీష్టం మేరకే అనే విధంగా సిరిసిల్ల, జనగామ, గద్వాలపై కాస్త ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే సోమవారం రాత్రి అనూహ్యంగా ఆసిఫాబాద్ తెరపైకి వచ్చింది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 31కి పెరగబోతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరున గట్టిగా పట్టుబట్టిన గద్వాల జిల్లాకు కూడా ఆమోదముద్ర పడింది. ఆ జిల్లాకు చెందిన తెరాస నేతలు కూడా ఈ జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రిని కోరారట. దీంతో గద్వాలకు లైన్ క్లియర్ అయింది.
తన తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పేరుతో జిల్లా ఏర్పాటుకు కేసీఆర్ ముందే నిర్నయించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. కొడుకు కోసం జిల్లా అనే విమర్శ రాకుండా, ప్రజాభిష్టం మేరకే నిర్ణయం అనే సంకేతాలు వెళ్లేలా జాగ్రత్త పడ్డారట. నిజానికి అక్కడ ప్రజల నుంచి కూడా సిరిసిల్ల జిల్లా కోసం గట్టిగానే డిమాండ్ వినిపించింది.
పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పెంచాలని కేసీఆర్ ఎప్పుడో నిర్ణయించారు. అంటే ఐదురు జిల్లాలను పెంచుతారేమో అని చాలా మంది అనుకున్నారు. అనూహ్యంగా 31 కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఐఎఎస్ అధికారులు అందుబాటులో లేకపోయినా గ్రూప్ 1 అధికారులతో జిల్లాల బండిని లాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చిన్న జిల్లాలైతేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందనేది ప్రభుత్వం చెప్తున్న మాట. కొత్త జిల్లాలకు కలెక్టర్లు సహా అనేక విధాలుగా ఉన్నతాధికారులు కావాలి. గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 అధికారులతోపని కానిచ్చేద్దాం అనే ఆలోచన ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.