‘రేయ్….ఎరేయ్…పాతేస్తా నా కొ…’… ఎప్పుడూ విలువల గురించి లెక్చర్లు దంచుతూ ఉండే చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేగారు నిండు అసెంబ్లీలో పలికిన పలుకులివి. ఇక రోజా మాటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని హద్దులనూ ఎప్పుడో దాటేశారు. రేవంత్‌రెడ్డి కూడా చాలా సార్లు రెచ్చిపోయారు. తన మాటలకు మరీ ఎక్కువ పబ్లిసిటీ దొరకడం లేదేమోనని జగన్వారు మరీ ఎక్కువ ఫీలవుతున్నారేమో తెలియదు కానీ, ఆయన కూడా చెప్పులు, చీపుర్లు అంటూ చిత్తం వచ్చినట్టుగా వాగేస్తున్నాడు. ఆ మధ్య ఓ సారి పవన్బాబు కూడా పంచెలూడగొట్టండి అంటూ ఆవేశపడిపోయాడు. ఇలాంటి ఆవేశపూరిత చర్యలు, మాటలు అన్నీ కూడా ఆ నాయకులను మూర్ఖంగా అభిమానించే కొంతమందికి అద్భుతంగా అనిపించొచ్చు. కానీ దీర్ఘ కాలంలో మాత్రం ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ మెడకే చుట్టుకుంటాయి.
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ విషయంలో ఇది మరోమారు రుజువైంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీదారులందరినీ ఓడించడంలో ట్రంప్ నోటి దురుసుతనమే ఆయనకు కవచంలా కలిసొచ్చింది. బోలెడుమంది మూర్ఖపు అభిమానులను తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్‌ని చూసుకుని మురిసిపోయిన ట్రంప్ కూడా మరి కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ ఓవర్ యాక్షనే అందరికీ మంట పుట్టేలా చేసింది. ఆవేశంగా నాలుగు మాటలు మాట్లాడి తెచ్చుకున్న క్రేజ్ మొత్తం కూడా కర్పూరంలా కరిగిపోవడం స్టార్ట్ అయింది. మీడియాలో ఉన్న ఎక్కువ మంది జర్నలిస్టులు కూడా ట్రంప్ ఆలోచనా విధానం, ప్రవర్తనను సహించలేకపోతున్నారు. హిల్లరీ సమర్థురాలా? కాదా? అని అనుమానాలు వ్యక్తం చేసినవారు కూడా…ట్రంప్ గెలిస్తే భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయన్న భయంతో హిల్లరీని సమర్థిస్తున్నారు.
ఆవేశంగా మాట్లాడడం, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయడం అనే ట్రెండ్ స్టార్ట్ చేసిన మనతరం నాయకుడు మాత్రం కేసీఆరే. అయితే ఆయన ఆవేశం అంతా కూడా కేవలం ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం తెచ్చిపెట్టుకున్నదే. ఎక్కడ మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నా? అనే విషయాల్లో కెసీఆర్‌కి చాలా చాలా స్పష్టత ఉండేది. ఆలోచన మర్చిపోయి ఆవేశపడిన సందర్భం ఒక్కటి కూడా ఉండదు. అదీ కెసీఆర్ స్థాయి. తిట్టడం విషయంలో కెసీఆర్‌కి నేనేం తక్కువ కాదు అని భావిస్తూ ఉండే రేవంత్‌కి అంత సీన్ లేదు. తెగ ఆవేశపడిపోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటాడు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా ఇరకాటంలో పెట్టేస్తూ ఉంటాడు. అలాగే వైఎస్ జగన్ కూడా ఆవేశపూరిత, రెచ్చగొట్టే మాటలతో తన ఇమేజ్‌ని ఇంకాస్త చెడగొట్టుకుంటున్నాడు. ఆవేశంగా, తిడుతూ మాట్లాడినప్పుడు వచ్చినంత తక్షణ స్పందన అవగాహనతో, ఆలోచించి మాట్లాడినప్పుడు రాకపోవచ్చు. కానీ ప్రజలందరి మన్ననలు పొందాలంటే మాత్రం నాయకుడికి సహనం ఉండాలి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా బేలన్స్ కోల్పోకూడదు. తెలివిగా మాట్లాడుతూ ప్రజల మెప్ప పొందాలి. ప్రత్యర్థిని ఓడించాలి. అంతేగానీ ఆవేశంగా మాట్లాడుతూ ఎవరినో రెచ్చగొట్టాలన్న ప్రయత్నాలు చేస్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది. అందరికీ దూరమవుతారు.