బాహుబలి సెట్ చేసిన బెంచ్ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. పాతికేళ్లకు ఓసారొచ్చే వెండితెర అద్భుతం అది. బాహుబలిని బీట్ చేయాలన్న ఆలోచన రావడం కూడా సహసమే అనిపిస్తోంది. వసూళ్ల పరంగా, క్రేజ్ పరంగా… ఆ సినిమాని దాటడానికి టాలీవుడ్‌కి మరో పదేళ్లయినా పట్టొచ్చు. అయితే.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న బాలయ్య వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ఓ విషయంలో బాహుబలిని దాటేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది వసూళ్లలోనో, క్రేజ్ పరంగానో కాదు. కంటెంట్ పరంగా.. ఎమోషన్ పరంగా.
బాహుబలి గొప్ప సినిమా కావొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఆ సినిమాని బీట్ చేసే సాహసం మరో సినిమా ఇప్పట్లో చేయలేదు. అయితే కంటెంట్ విషయంలో అంతా పెదవి విరిచిన మాట గుర్తుంచుకోవాల్సిందే. ఆరొందల కోట్ల సినిమాని కూడా ఆరోజునే విమర్శకులు వేలెత్తి చూపించారంటే అది కంటెంట్ విషయంలోనే. సాధారణ పగ, ప్రతీకారాల కథ అది. దానికి రాజమౌళి తన మార్క్ నైపుణ్యం జోడించాడు. కళ్లు చెదిరేలా.. వెండితెరపై ఆవిష్కరించాడు. అయితే గౌతమి పుత్రలో కంటెంట్ పరంగా క్రిష్ లోటు చేయలేదని తెలుస్తోంది. ప్రతీ సన్నివేశం ఎమోషన్‌తో ఆటాడేసుకొన్నాడన్నది విశ్వసనీయ వర్గాల మాట. దాంతో పాటు డైలాగుల విషయంలో బుర్రా సాయిమాధవ్ ప్రతిభను మరో పదేళ్ల పాటు గుర్తించుకొంటారని శాతకర్ణికి పనిచేసిన టీమ్ నమ్మకంగా చెబుతోంది. క్రిష్ ఎమోషన్ కంటెంట్‌ని హృదయానికి హత్తుకొనేలా తెరకెక్కించడంలో దిట్ట. వేదం, గమ్యం, కంచె ఇలాంటి సినిమాలు చూస్తే.. క్రిష్ సత్తా ఏమిటో అర్థం అవుతుంది. ఎక్కడ ప్రేక్షకుల మనసుల్ని మెలితిప్పాలన్న నేర్పు ఈ తరం దర్శకుల్లో క్రిష్‌కి మాత్రమే తెలుసు. క్రిష్ ఈ సినిమా కోసం నమ్ముకొన్నదీ అదే.
బాహుబలిలానే శాతకర్ణిలో కూడా యుద్ద సన్నివేశాలు భారీ స్థాయిలో ఉన్నా… వాటిని బాహుబలి చూసిన కళ్లతోనే చూస్తారని క్రిష్‌కి తెలుసు. కాబట్టి క్రిష్ తన దృష్టిని ఎమోషన్ కంటెంట్‌పై ఫోకస్ చేశాడని తెలుస్తోంది. శత్రువులతో శాతకర్ణి చెప్పే డైలాగులు, ఉగాది వైశిష్టత గురించి మాట్లాడే మాటలు, అమ్మ కోసం గౌతమి పుత్ర శాతకర్ణి పడే ఆవేదన… ఇవన్నీ గౌతమి పుత్ర శాతకర్ణిని వేరే స్థాయిలో చూపిస్తాయన్నది చిత్రబృందం చెబుతున్న మాట. ఇప్పటి వరకూ తీసిన రషెష్ చూసిన ఓ బడా నిర్మాత… సినిమా చూస్తున్నంత సేపూ కళ్లు చెమరుస్తూ ఉన్నాడని, క్రిష్‌ని గట్టిగా హత్తుకొని.. కంగ్రాట్స్ చెప్పాడని.. దాన్ని బట్టే ఈ సినిమా స్థాయేంటో ఊహించొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి క్రిష్ ఓ అద్భుతం చేయబోతున్నాడు. వసూళ్ల గురించి మాట్లాడేటప్పుడు బాహుబలి ప్రస్తావన ఎలా ఉంటుందో.. ఎమోషన్ గురించి చర్చించేటప్పుడు శాతకర్ణి గురించి అలా మాట్లాడుకొంటే… చరిత్రలో శాతకర్ణికీ చోటు దక్కితే… బాలయ్య అభిమానులు అంతకంటే ఏం కోరుకొంటారు??