మంచి చేసిన వాడిని నెత్తిన పెట్టుకునే వారు. అనునిత్యం గుర్తుచేసుకునే వారు. వారి వల్లే ఇలా ఉన్నామని చెప్పుకునే వారు. ప్రస్తుతం తరం మారిపోయింది. మహానుభావుల్ని ఉత్సవ విగ్రహాల్ని చేసేశారు. వారిపేరుతో ఎలా లబ్ధిపొందాలా అనే ఆలోచిస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి బీజం వేసిన అమరజీవి పేరును అమ్మేసుకున్నారు. పొట్టి శ్రీరాములు పేరుమీద చెన్నైలో ఉన్న స్మారక సమితి దీనికి వేదికైంది. రిజిస్ట్రేషన్ కూడా పునరుద్ధరించుకోకుండా కార్యకలాపాలను కొనసాగిస్తోంది ఈ సంస్థ. 1984లో పొట్టి శ్రీరాములు మిషన్ నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీగా అవతరించిన ఈ సంస్థలో కొన్నేళ్ళుగా పారదర్శకత లోపించింది. సభ్యుల సంఖ్య పెంచకపోవడం, ఒక వర్గం మాత్రమే సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొటుండడం సాగుతోంది. కిందటి నెల 25న నిర్వహించిన ఎన్నికలను ఒక తంతుగా ముగించారనీ, అనేక మంది సభ్యుల పేర్లు జాబితాలోనే లేవనీ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల గురించి సమాచారమే అందని సభ్యుడు, మద్రాస్ హైకోర్టులో ప్రముఖ న్యాయవాదీ అయిన ద్రోణాదుల సత్యనారాయణ సూచనను పట్టించుకోకుండా ఒక వర్గం ఎన్నికలను నిర్వహించినట్లు పత్రికలలో ప్రకటనలు ఇచ్చింది.
ఈ వ్యవహారం తేల్చాలని నిర్ణయించుకున్న సత్యనారాయణ తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీని ఆశ్రయించారు. బైలాస్, సభ్యుల జాబితాను ఇవ్వాలని కోరారు. 1998నుంచి అసలు సమితిని రెన్యూవలే చేయలేదని వచ్చిన సమాధానం విని, ఆయన నిర్ఘాంతపోయారు. ఈ 17ఏళ్ళుగా సమితి నిర్వహించిన కార్యకలాపాలు చట్టబద్ధమైనవి కాదని దీనితో తేలిపోయింది.
మరో వంక, ప్రస్తుత నిర్వాహకులు అసలు నిజాలను దాచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మించి పది లక్షల రూపాయల గ్రాంట్‌ను మంజూరు చేయించుకున్నారు. వాహిని వారి పెద్ద మనుషులు సినిమాను గుర్తుచేసే రీతిలో ఈ వ్యవహారం నడిచింది. అమరజీవిపై ఉన్న గౌరవాన్ని నిర్వాహకులు క్యాష్ చేసుకున్నారని తేలుతోంది. చట్టబద్ధతే లేని సమితికి ఇంత పెద్ద మొత్తాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎలా మంజూరు చేసిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక విభాగం డైరెక్టర్ ఈ సమితికి కో ఆప్టెడ్ సభ్యుడవడం కొసమెరుపు. అనుభవజ్ఞుడిగానూ, పాలనాదక్షుడిగానూ నిరంతరం ప్రశంసలందుకునే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ వ్యవహారం తలనొప్పే.
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు ఈ సొసైటీ భవంతి ఉన్న స్థలంలోనే 57రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ప్రాణాలు విడిచారు. ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పవిత్రమైన యజ్ఞానికి వేదికైన ఆ స్థలంలో ఓ మూడంతస్తుల భవనం ఉంది. చెన్నై మైలాపూర్‌లో ఉన్న ఈ భవంతిలో పొట్టి శ్రీరాములు దీక్ష చేసిన ప్రాంతంలో ఆయన విగ్రహం.. ఆనాటి దృశ్యాలు. .. ఆయన అంతిమ యాత్ర ఛాయా చిత్రాలు కనిపిస్తాయి. ఇంతటి పవిత్ర స్థలాన్ని తమ స్వార్థానికి వాడుకుంటున్న అంశంపై చెన్నైలోనే కాక, నెల్లూరు జిల్లాలో ఉన్న పొట్టి శ్రీరాములు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్ది ఆయన ఖ్యాతిని నిలపాలని కోరుకుంటున్నారు.
సొసైటీ వ్యవహారంపై తాను మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు న్యాయవాది ద్రోణాదుల సత్యనారాయణ చెబుతున్నారు. రెన్యూవల్ చేయించుకోని సంస్థకు గ్రాంటెలా ఇస్తారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. అసలు నిజాలు దాచి సాగిస్తున్న ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రికీ, రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్కీ లేఖలు పంపానన్నారు. ఈ ఉదంతం వాహినీ వారి పెద్ద మనుషులు చిత్రాన్ని గుర్తుకు తెస్తోంది కదూ.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి