బాహుబలి గురించి మాట్లాడుకోవడానికి బోలెడన్ని విశేషాలు. ఎప్పుడూ వార్తల్లో ఉండే సినిమా అది. దానికి రాజమౌళి తాలుకూ… మార్కెటింగ్ బుర్ర కూడా మహ బాగా అక్కరకు వస్తోంది. ఈ సినిమా గురించి తరచూ మాట్లాడుకొనేలా రాజమౌళి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు బాహుబలి కథ కామిక్ బుక్ రూపంలోకి బయటకు వచ్చింది. బాహుబలిలోని ప్రతీ సన్నివేశం.. ప్రింటు రూపంలో అచ్చు వేశారు. దానికి ‘బాహుబలి – బాటిల్ ఆఫ్ ది బోల్డ్’ అనే పేరు పెట్టారు. బాహుబలి, భళ్లాలదేవ, కట్టప్ప, శివగామి ఈ పాత్రలన్నీ కామిక్ పాత్రల రూపం సంతరించుకొన్నాయి. ఈ యానిమేషన్లను గ్రాఫిక్ ఇండియా సంస్థ రూపొందించింది.
ఇప్పుడు ఈ పుస్తకాన్ని బాహుబలి టీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పేజీల్ని తిరగేస్తూ, బొమ్మలు చూస్తూ..డైలాగుల్ని గుర్తు చేసుకొంటూ మరోసారి మహీష్మతీ సామ్రాజ్యంలోకి వెళ్లొచ్చేయన్నమాట. బాహుబలి 2 విడుదల తరవాత కూడా ఇలాంటి పుస్తకాన్ని మరోటి విడుదల చేస్తారు. అలా బాహుబలి కామిక్ రూపంలోనూ చూడొచ్చన్నమాట. సాధారణంగా హాలీవుడ్ సినిమాలే ఇలా కామిక్ పుస్తకాల్లో స్థానం సంపాదించుకొన్నాయి. ఓ భారతీయ చలన చిత్రం కూడా ఆ జాబితాలో చేరడం, అది మన తెలుగు సినిమా కావడం.. గర్వించదగిన విషయమే. అయితే ఇందులోనూ రాజమౌళి మార్కెటింగ్ నైపుణ్యమే ఉంది. బాహుబలి 2 విడదలయ్యేంత వరకూ ప్రేక్షకులు ఈ సినిమా గురించే మాట్లాడుతూ ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే వీలు చూసుకొని ఒకొక్కటీ వదులుతున్నారు. అందులో ఇదొకటి.