దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు!
ఈ పేరు గుర్తు చేసుకొంటే చాలు. తెలుగు తెర అందంగా సిగ్గుపడుతుంది. కెమెరా కన్ను కొడుతుంది. తెలుగు సినిమాకి కమర్షియల్ వన్నెలద్దిన దర్శకుడాయన. కథానాయికల అందాల్ని, హీరోల గాంభిర్యాన్నీ, పాత్రల మధ్య సంఘర్షణనీ, మాటల మాటున మెస్మరిజాన్నీ, పాటల్లోని మెరుపుని సరికొత్తగా ఆవిష్కరించిన ఘనత ఆయనది. వంద చిత్రాలు తీసి – టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకొన్నారు. అయితే.. త్వరలోనే దర్శకేంద్రుడు మెగా ఫోన్ పక్కన పెట్టబోతున్నాడా, ఇక సినిమా నుంచి శాశ్వతంగా తప్పుకొంటున్నాడా? ఆ అవకాశాలున్నాయన్నది టాలీవుడ్ వర్గాల మాట. ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతన్న చిత్రం `ఓం నమో వేంకటేశాయ`. దాదాపుగా దర్శకేంద్రుడి చివరి చిత్రం ఇదే అవ్వబోతోందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా తరవాత ఆయన మెగాఫోన్ ముట్టుకోరని, తన విశ్రాంత జీవితాన్ని ఎలా గడపాలన్న విషయంలో ఆయన ఆల్రెడీ కొన్ని ప్రణాళికలు వేసుకొన్నారని తెలుస్తోంది.
అన్నమయ్య తరవాత దర్శకేంద్రుడి దృక్పథం మారింది. ఆయన్ని ఆధ్యాత్మిక ఆలోచనలు చుట్టిముట్టాయి. మాస్ మసాలా సినిమాల జోలికి వెళ్లడం బాగా తగ్గించారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తి.తి.డి కు సంబంధించిన ఛానెల్‌కి ఓ ధారవాహిక కూడా అందించారు. ఇప్పుడాయన వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు హాథీరామ్ బాబా కథని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరవాత దాదాపుగా ఆయన దర్శకత్వానికి దూరం కావాలని నిర్ణయించుకొన్నార్ట. ఆ సమయన్ని నిర్మాతగా మారి ఔత్సాహికుల్ని ప్రోత్సహించడానికి ఉపయోగించాలని భావిస్తున్నార్ట. అంతే కాదు.. తి.తి.డి తరపున ఆయన కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చేపట్టాలని చూస్తున్నారట. పైగా.. వయసు మీదపడుతోంది. యువతరం తమ సత్తా చూపిస్తోంది. రాజమౌళి లాంటి శిష్యులు.. గురువుల్ని మించిపోయే సినిమాలు తీస్తున్నారు. ఇంకేం కావాలి..? అందుకే గౌరవంగా తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే… టాలీవుడ్‌కి ఇది పెద్ద షాక్. లెజెండరీ డైరెక్టర్లు.. వాళ్ల ఆలోచనలు నవతరానికి కావాలి. వాళ్ల సినిమాలు చూసి ఇంకా నేర్చుకోవడానికి ఈతరం తహతహలాడుతూనే ఉంది. అందులోనూ రాఘవేంద్రరావుది ప్రత్యేక శైలి. ఆయన ఫ్రేమ్ ఎప్పుడూ చూడ ముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫ్రేముల్నీ, రాఘవేంద్రరావు సినిమాల్లో మెరిసిపోయే హీరోయిన్నీ చూడలేమన్నమాట.