పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత హైదరాబాదులో సీన్ పూర్తిగా తారుమారైంది. ఆదివారం సండే సందడీ లేదు. వీకెండ్ వినోదమూ లేదు. చాలా మంది విషయంలో ఇదీ సంగతి.
వరసగా ఐదో రోజు ఆదివారం సైతం జనం నోట్ల మార్పిడి కోసం ఇబ్బంది పడ్డారు. పోనీ ఏటీఎంలలో విత్ డ్రా చేద్దామన్నా చాలాచోట్ల అవీ పనిచేయలేదు. అయితే శనివారం సాయంత్రం నుంచి పరిస్థితి కాస్త మెరుగైంది. నగరంలో తెరుచుకున్న ఏటీఎంల సంఖ్య పెరిగింది. వంద నోట్లు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం సెలవురోజు కావడంతో బ్యాంకుల్లో రద్దీ పెరిగింది. అయినా శుక్ర, శనివారాలతో పోలిస్తే కాస్త పరవాలేదనిపించింది.
ఆదివారం మటన్, చేపల పారులకు మాత్రం గిరాకీ తగ్గింది. కొన్ని చోట్ల సాధారణం కంటే సగానికి పైగా విక్రయాలు పడిపోయాయి. చిల్లర సమస్యే దీనికి కారణం. అయితే బంజారా హిల్స్ లాంటి కొన్ని చోట్ల మటన్ చికెన్ వ్యాపారులు ఏటీఎం కార్డు ద్వారా చెల్లించే అవకాశం ఇచ్చారు. స్వైపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచి గిరాకీ పెంచుకున్నారు. సినిమా హాళ్లలో వీకెండ్ రష్ కూడా భారీగా తగ్గింది. అందరూ ఆన్ లైన్లో టికెట్లు కొనడానికి అలవాటు పడక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
కొత్తగా ముద్రించిన 500 రూపాయల నోట్లు సోమవారం నుంచి హైదరాబాదుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని బ్యాంక్ అధికారులు చెప్పారు. మహారాష్ట్ర నాసిక్ లోని సెక్యూరిటీ ప్రెస్ లో 50 లక్షల నోట్లను ముద్రించారు. వాటిని దేశ వ్యాప్తంగా రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్నానికే ఢిల్లీ, భోపాల్, మరికొన్ని నగరాల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం హైదరాబాద్ ప్రజలకూ అందుబాటులోకి వస్తాయట. అదే జరిగితే 2000 రూపాయల నోట్లతో పడుతున్న చిల్లర కష్టాలు తప్పవచ్చు.
పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత మొదటి రెండు మూడు రోజులూ జేబులో ఉన్న చిల్లర, ఇంట్లో ఉన్న చిన్నపాటి మొత్తంతో నెట్టుకొచ్చారు. రానురానూ ఉన్న చిల్లర అయిపోయింది. బ్యాంకుల్లో చాంతాడు క్యూలో నిల్చుంటేగానీ చెల్లుబాటయ్యే డబ్బు చేతికి అందని పరిస్థితి. అదికూడా పరిమితంగానే. 4 వేలు తీసుకుంటే 2 రెండు వేల నోట్లు చేతిలో పెట్టడం వల్ల ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. సోమ, మంగళ వారాల్లో ప్రజలకు మరింత భారీ స్థాయిలో కొత్త నోట్లు, 100 నోట్లు అందుబాటులోకి వస్తాయని బ్యాంకర్లు చెప్తున్నారు. అలా అయితే పరవాలేదు. లేకపోతే ప్రజల్లో సహనం నశించి, ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం ఉంది.