ధృవ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మేకోవర్ స్పష్టంగా కనిపించింది. తెరపై కూడా చరణ్ బాడీ లాంగ్వేజ్‌లో… డైలాగ్ డెలివరీలో మార్పులొచ్చాయి. ‘కొత్తదనం’ కోసం పరితపించడం కనిపించింది. అందుకే…. తనకు సూటవ్వని, తన ఫార్ములా కాని కథే అయినా… తని ఒరువన్ లాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకొన్నాడు. వరుస ఫ్లాపులకు పుల్ స్టాప్ పెట్టాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే అనేది అర్థమైంది. అందుకే… తనకంటే అరవింద్ స్వామి పాత్రకు ఎక్కువ మైలేజీ వస్తుందన్నా… కాస్త ఓపిక పట్టాడు. ఇంట్రడక్షన్సాంగులో బీభత్సమైన డాన్సులు వేయకుండా, యాక్షన్ సీన్లలో మెగా ఫ్యామిలీ ప్రస్తావన తీసుకొచ్చే పంచ్ డైలాగులు పడకుండా.. తనని తాను కంట్రోల్ చేసుకొన్నాడు. ఈసారి పబ్లిసిటీ విషయంలో ఎలాంటి లోటూ రాకుండా జాగ్రత్తపడ్డాడు. వెబ్ మీడియాని వీలైనంత వాడుకొన్నాడు. ఎప్పుడూ లేనిది సినిమా రిలీజ్ టైమ్‌లో అమెరికాలో తిష్ట వేసి, ప్రీమియర్ షోలతో హడావుడి చేశాడు. అక్కడ ఫ్యాన్స్ దృష్టిలో పడడానికి చాలా చాలా చేశాడు.
ఇంతా పోగేస్తే.. ఓవర్సీస్లో 1 మిలియన్ క్లబ్లో చరణ్ ఇంకా చేరలేదు. దానికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నాడు. నేడో రేపో.. ఆ మైలు రాయి వచ్చేస్తుంది. అందులో సందేహం లేదు. కానీ.. ఇంత కష్టపడితే గానీ.. ఈ మాత్రం ప్రతిఫలం దక్కడం కష్టమైందా అనేది ఆలోచిస్తే మెగా ఫ్యాన్స్‌కు దిగులు పట్టడం ఖాయం. నిజానికి చరణ్ టార్గెట్ పెద్దదే. కానీ.. అందింది మాత్రం కొంతే! వన్ మిలియన్ క్లబ్ అంటే ఈరోజుల్లో చాలా ఈజీ అయిపోయింది. చిన్న చిన్న సినిమాలు ఈ ఫీట్ ని అవలీలగా ఛేదిస్తున్నాయి. ప్రతీ స్టార్ హీరో ఖాతాలోనూ రెండు మూడు వన్ మిలియన్ క్లబ్ సినిమాలున్నాయి. అందుకోసం వాళ్లేం ప్రత్యేకంగా ఇన్ని కసరత్తులు చేయలేదు. ఇన్ని ప్లాన్లు వేయలేదు. ఓవర్సీస్ ని పక్కన పెట్డండి. తెలుగు రాష్ట్రాలలో లెక్కలు తీస్తే… ఇక్కడి వసూళ్లు ట్రేడ్ పండితులన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మెగా హీరో సినిమా అంటే టాక్ని బట్టి కాకుండా క్రేజ్‌ని బట్టి టికెట్లు తెగుతాయి. కానీ.. చరణ్ సినిమా కి అదేం జరగలేదు. ‘సినిమా బాగుంటే చూద్దాం’ అనే మైండ్ సెట్‌కి వచ్చేశారు ప్రేక్షకులు. అందుకే అడ్వాన్స్ బుకింగుల మాట లేకుండా పోయింది. పెద్ద నోట్ల రద్దు కాస్త ప్రభావం చూపించిన విషయం నిజమే. కానీ.. అదో సాకు మాత్రమే. వరుస ఫ్లాపులతో చరణ్ తన కెరీర్‌ని ఇరకాటంలో పడేసుకొన్నాడు. అదే.. ఈ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ధృవకి డీసెంట్ టాక్ రావడంతో.. ఇప్పుడిప్పుడే జనం థియేటర్ల వైపు నడుస్తున్నారు. ఆ మైలేజీని ఎన్ని రోజులు చరణ్ నిలుపుకొంటాడనేదానిపైనే.. చరణ్ కెరీర్, ఇటు ధృవ అంతిమ ఫలితం డిసైడ్ అవుతాయి.