కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు దాటిపోయింది. సామాన్యుడి పరిస్థితి ఇంకా మారలేదు! కరెన్సీ కష్టాలు ఇంకా తీరలేదు. బ్యాంకుల ముందు క్యూలు అలానే ఉంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాదాయాలపై తీవ్రంగా ఉంటుందని మొదట గళమెత్తింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్! ఆ తరువాత, ప్రధాని మోడీ బాటలోకి ఆయనా వెళ్లిపోయారు. రెండుసార్లు ప్రధానికి కలిసేసరికి కేసీఆర్ వాణి మారిపోయింది. డిజిటల్ ఎకానమీ అన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ టీ వ్యాలెట్ అంటూ చెబుతున్నారు. అయితే, ఇవన్నీ కంటితుడుపు చర్యలే అనే వాస్తవం నెమ్మదిగా ఇప్పుడిప్పుడే అర్థమౌతున్నట్టుగా ఉంది. ఎంత ప్రచారం కల్పించినా వాస్తవంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలవైపు ప్రజలు ఉన్నపళంగా మళ్లిపోవడం, అనుకుంత సులువుగా జరిగే పని కాదు. మొత్తానికి, మళ్లీ సాధారణ పరిస్థితి ఎప్పటికి వస్తుందో అనే టెన్షన్ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎక్కువౌతోందన్న మాట వినిపిస్తోంది.
పరిస్థితులు చక్కబడే వరకూ దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని కూడా మంత్రులకు ఆయన సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధుల విషయంలో కూడా ఆచితూచి ఖర్చులు చేయాల్సిందిగా కోరారనీ సమాచారం. పరిస్థితులు ఎప్పటికి సాధారణ స్థితికి వస్తాయో ఎవ్వరికీ స్పష్టత లేకపోవడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టు సమాచారం! కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టవద్దనీ, ఉన్నవాటి నిధుల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. తప్పనిసరి అయితేనే తప్ప నిధులను విడుదలపై ఒకటికి పదిసార్లు ఆలోచించాలని అన్నారు. లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పారు.
మొత్తానికి, ఆయన బహిరంగంగా చెప్పలేకపోతున్నా… రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. రాజకీయ కారణాల దృష్ట్యా ఈ విషయాలపై మాట్లాడకుండా… నగదు రహితం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పుకుంటున్నా… పెద్ద నోట్ల రద్దు తరువాత అసలైన టెన్షన్ తెలంగాణ సర్కారు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పాలి. మరి, ముఖ్యమంత్రి చెప్పినట్టు మంత్రులు ఏ మేరకు దుబారా తగ్గించుకుంటారో చూడాలి. ఆంధ్రాలో కూడా ఇంతకంటే భిన్నమైన పరిస్థితి ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే, ఎక్కడైనా సరే, ప్రజల చేతిలో డబ్బులుంటేనే కదా ఏదో ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ ఉండేది. ఏదేమైనా, రాబోయే రోజులు రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత గడ్డురోజులుగా పరిణమించేట్టుగానే ఉన్నాయనడానికి కేసీఆర్ ఆందోళనే సంకేతం!