వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి చెందిన అక్రమాస్తుల కేసు విషయంలో మళ్లీ కదలిక వచ్చింది! గతంలో అటాచ్ చేసిన ఆస్తుల నుంచీ రూ. 177 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకోవడం గమనార్హం. భారతీ సిమెంట్స్‌కు చెంది దాదాపు రూ. 750 కోట్ల ఆస్తులను ఈ ఏడాది జూన్ నెలలోనే ఈడీ ఎటాచ్ చేసింది. వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న రూ. 177 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకునే విధంగా ఈడీకి అనుమతులు లభించాయి. చాలా రోజుల తరువాత జగన్ అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఇది. అయితే, ఇక్కడే చాలా ప్రశ్నలకు ఆస్కారం ఉంది! ఇన్నాళ్ల తరువాత ఇప్పుడే ఈ డిపాజిట్లను ఈడీ ఎందుకు స్వాధీనం చేసుకున్నట్టు అనేది అసలు ప్రశ్న..? ఈ కదిలక వెనక పనిచేసిన ఒత్తిళ్లు ఏంటనేవి మరో ప్రశ్న..?
నిజానికి, గతంలో జగన్ కేసుకులకు సంబంధించి ఈడీ చేసినవన్నీ ఆస్తుల ఎటాచ్మెంట్ మాత్రమే. అంటే, ఆ ఆస్తులను జగన్ అమ్ముకోలేరు, వాటిని ఇతరులకు బదిలీ చేయలేరు, రుణం పొందలేరు. అయితే, తాజాగా నిర్ణయంతో జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం మొదలౌతుందా అనే సంకేతాలుగా కొంతమంది భావిస్తున్నారు. ఈ డిపాజిట్లు మాదిరిగానే దశలవారీగా జగన్ కేసులకు సంబంధించిన అన్ని ఆస్తులనూ ఒక్కోటిగా లాక్కుంటూ పోతారేమో అనే అనుమానం వైకాపా వర్గాల్లో వ్యక్తమౌతోందని సమాచారం. గతంలో తెలుగుదేశం కూడా ఇదే అంశంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. జగన్‌కు చెంది మీడియా సంస్థ మూతబడుతుందని దేశం నేతలు అంటూ ఉండేవారు! అంటే, ఆ దిశగానే పావులు కదులుతున్నాయా అనే ఆందోళన జగన్ శిబిరంలో వినిపిస్తోందని సమాచారం. ఇప్పటికిప్పుడు ఈడీ కదిలక వెనక ఎవరి ఒత్తిడి పనిచేసిందన్నదన్న చర్చ మొదలైంది!
కేంద్రంలోని భాజపా సర్కారుకు వ్యతిరేకంగా జగన్ వెళ్తున్నారన్నది వాస్తవం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని కేంద్రాన్ని తప్పుబడుతున్నారు. భాజపా వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. తాజాగా…కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కూడా ధ్వజమెత్తుతున్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ కూడా ప్రధానికి ‘జీ హుజూర్’ అనేశారు. కానీ, జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెద్ద నోట్ల రద్దును ఎవరు వ్యతిరేకించినా ఆగ్రహించే పట్టుదలతో కేంద్రం ఉంది. సో.. ఓరకంగా కేంద్రానికి జగన్ ఎదురెళ్తున్నారు!
ఇంకోపక్క, జగన్‌ను ఎలాగోలా జైలుకు పంపించాలన్న ఆశ తెలుగుదేశం నేతలకు లేదని మాత్రం చెప్పలేం! కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎలాగూ చంద్రబాబుకు మాంచి దోస్త్. కాబట్టి, ఆ ఛానల్ ద్వారా ఇప్పటికే కేంద్రంపై ఈ దిశగా ఒత్తిడి తెచ్చే ఉంటారన్నది ఓపెన్ సీక్రెట్. అయితే, ఎన్నిరకాల ఒత్తిళ్లు ఎదురైనా జగన్ విషయంలో భాజపా ఇంతవరకూ ఎలాంటి కక్ష సాధింపులకూ వెళ్లలేదు. కానీ, తాజాగా కేంద్రం విషయంలో జగన్ వైఖరి వేరేలా ఉంది. సో… తాజా ఈడీ కదలికలపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంటే, జగన్ చుట్టూ ఉన్న ఉచ్చును ఇంకాస్త బిగించే ప్రయత్నమేదో జరుగుతున్నట్టుగా ఉందన్న అనుమానం వ్యక్తమౌతోంది!