తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక.. ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు, యాజ్ఞాలు నిర్వహిస్తున్నారు. అలాగే విజయవాడ దుర్గమ్మ, తిరుపతి వెంకన్న, యాదగిరి నరసన్న, కొమురవెల్లి మల్లన్న ఇలా తెలుగు రాష్ర్టాల్లోని పుణ్యక్షేత్రాల్లోని మూలవిరాట్లకు మొక్కులుచెల్లిస్తున్నారు. ఈ మొక్కులు బంగారు ఆభరణాల రూపంలో ఉండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇటీవల తిరుపతి వెంకన్న దాదాపు రూ.6 కోట్ల బంగారు ఆభరణాలు, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు మొక్కులు కింద చెల్లించారు.
కేసీఆర్ దేవుడికి మొక్కు కింద సమర్పించిన ఆభరణాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని నగలు ప్రత్యక్షమయ్యాయి. ఇవి జాతీయ వ్యాప్తంగా చర్చానీయాంశమయ్యాయి. వీటిని చూసి కొందరు ముచ్చటపడ్డా.. కొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత మొక్కుల కోసం
ప్రజాసొమ్మును ఇలా ఉపయోగించడం ముమ్మాటికీ దుర్వినియోగం చేయడమేనేనని.. వాదిస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా కేసీఆర్ మాత్రం తన మొక్కుల సమర్పణ కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజాగా ఈ విమర్శలు వ్యాఖ్యల రూపం దాటి.. వ్యాజ్యాల రూపమెత్తాయి.. అదేనండి.. కేసీఆర్ దైవకానుకులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇది వేసింది మరెవరో కాదు. ఓయూ ఫ్రొఫెసర్ కంచె ఐలయ్య. బడుగుల ఐక్యత, దళితుల రాజ్యాధికారం కోసం పోరాడే కంచె ఐలయ్య శుక్రవారం హైకోర్టులో ఈ మేరకు పిల్ దాఖలు చేశారు. ప్రజల సొమ్మును ఇలా వ్యక్తిగత విషయాలకు వినియోగించడం ముమ్మాటికీ ప్రజా ప్రయోజనాలను విస్మరించడమేనని స్పష్టం చేశారు. పైగా దేవాలయాల కామన్ గుడ్ఫండ్ (సీజీఎఫ్) నుంచి ఇందుకోసం నిధులు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్లో ఆరోపించారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని నగలు, ఆభరణాల కోసం వెచ్చించిన మొత్తాన్ని రికవరీ అయ్యేలా ఆదేశించాలంటూ హైకోర్టుకు విన్నవించారు.
నిజానికి, కేసీఆర్ పూజలూ కానుకలూ అనేవి నిన్నమొన్నటి వరకూ రాజకీయ పార్టీల మధ్య ఓ విమర్శనాంశంగానే ఉంటూ వచ్చింది. కానీ, ఈ విషయంపై ఐలయ్య లాంటి వారు కూడా విమర్శలకు దిగడంతో కేసీఆర్కు ఇబ్బందులు తప్పేట్టుగా లేవు. ఇంకోపక్క తెలంగాణ జేయేసీ ఛైర్మన్ కోదండరామ్ కూడా కేసీఆర్ పాలనా విధివిధానాలపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.