గాసిప్ రాయుళ్ల‌కు తేర‌గా దొరికేసిన ప్ర‌భాస్ – అనుష్క‌

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ వార్త వైరల్, ఏది రియల్ అనేది తేల్చుకోవడం ప్రశ్నార్ధకంగా మారింది. లెక్కలేని వెబ్ సైట్లు, కుప్పలు తెప్పలుగా యుట్యూబ్ ఛానళ్ళు .. సెన్సేషన్ కోసం ఏది పడితే అది వార్తలుగా గాసిప్పులు గా రాయడం మొదలుపెట్టాయి. ఈ ఉదృతిలో అసలు విషయం మిస్ లీడ్ అయిపోతుంది. ఒకప్పుడు ఓ గాసిప్ రాయాలన్నా ఓ ప్రమాణీకరణ వుండేది. ఇప్పుడు అలా కాదు. తల తోక లేని వార్త కూడా వైరల్ చేసి పారేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన అనుష్క- ప్రభాస్ పెళ్లి వ్యవహారం కూడా ఇలానే వుంది.

అనుష్క, ప్రభాస్.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిచిబుల్ బ్యాచిలర్స్. బిల్లా సినిమాలో తొలిసారి కలసి నటించారు. తర్వాత మిర్చి, ఇప్పుడు బాహుబలి తో ఈ జంట హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. అఫ్ స్క్రీన్ కూడా వీరి మధ్య మంచి స్నేహం వుంది. ”ప్రభాస్ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఆ ఫ్యామిలీ మెంబర్ గా చూస్తారు”అని చాలా సందర్భంల్లో చెప్పింది స్వీటీ.

అయితే ఇప్పుడు వున్నటుండి.. అనుష్క- ప్రభాస్ ల పెళ్లి అంటూ ఓ వార్త వైరల్ గా మారిపోయింది. అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని, ఈ విషయాన్ని ప్రభాస్ ఇంట్లో చెప్పేశాడని, అయితే పెదనాన్న కృష్ణమరాజు దీనిపై అభ్యంతరం చెప్పారని, ఇండస్ట్రీ పర్శన్ తప్పితే ఇంకా ఎవరైనా తనకు ఓకే కానీ, సినిమా పరిశ్రమకు చెందిన వారు వద్దన్నారని, అయితే ప్రభాస్ మాత్రం పెదన్నాన్నను ఒప్పించే పనిలో ఉన్నాడని.. ఇలా ఏదేదో ప్రచారం జరిగిపోతుంది. సోషల్ మీడియా తెరిస్తే చాలా.. ఈ టాపిక్ పైనే బోలెడు వార్తలు. అటు యుట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇదే తంతు. ఒకరి చూసి ఒకరు వీడియోలు ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఏమిటో తెలీదు.

అనుష్క పై పెళ్లి అంటూ వార్తలు రావడం కొత్తేం కాదు. ప్రభాస్ పై కూడా అంతే. అయితే ఈసారి ఏకంగా” ప్రభాస్ తో అనుష్క పెళ్లి” అనే గాసిప్పులు పుట్టించేయడం వెరైటీగా వుంది. మరి, ఈ వైరల్ న్యూస్ పై అనుష్క- ప్రభాస్ స్పందిస్తారో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com