పెన్నుతో కాదు.. పాప్‌కార్న్‌తో థియేట‌ర్ల‌కు రండి : ఆది పినిశెట్టి

సినిమా బాగోలేదంటే క‌చ్చితంగా రివ్యూలు నెగిటీవ్‌గానే వ‌స్తాయి. అదెంత సాధార‌ణ‌మో, నెగిటీవ్ రివ్యూలు వ‌చ్చిన‌ప్పుడు వాటిపై నోరేసుకుని ప‌డిపోవ‌డం, సెటైర్లు వేయ‌డం అంతే సాధారణం. ‘నీవెవ‌రో’ సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. ఆది పినిశెట్టి న‌టించిన ఈ థ్రిల్ల‌ర్‌… థియేట‌ర్ల‌లో తేలిపోయింది. లాజిక్కులు లేకుండా, ఎక్క‌డా థ్రిల్ క‌లిగించ‌కుండా తీసిన ఈ సినిమాకు చాలా త‌క్కువ మార్కులు ప‌డ్డాయి. అది.. చిత్ర‌బృందానికి న‌చ్చ‌డం లేదు. ‘మేం తీసేది రాసేవాళ్ల కోసం కాదు, చూసేవాళ్ల కోసం’ అంటూ కామెంట్లు చేశాడు కోన‌. ఇప్పుడు ఆది పినిశెట్టి వంతు వ‌చ్చింది. ‘ఈ సినిమాపై వ‌చ్చిన రివ్యూలు చాలా బాధ పెట్టాయి. పెన్ను, పుస్త‌కం ప‌ట్టుకుని థియేట‌ర్లోకి అడుగుపెట్టి సినిమాని ఆ కోణం నుంచి చూస్తున్నారు. అలాంటి ప‌ది శాతం మందికీ ఈసినిమా న‌చ్చ‌క‌పోవొచ్చు. పాప్ కార్న్ ప‌ట్టుకుని వ‌చ్చిన 90 శాతం ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. వ‌రల‌క్ష్మి వ్ర‌తం వ‌ల్ల విడుద‌ల రోజున వ‌సూళ్లు ఆశాజ‌న‌కంగా లేవు.. ఇప్పుడు పుంజుకున్నాయి“ అంటున్నాడు ఆది. వీకెండ్‌లో వ‌సూళ్లు లేక‌పోతే. వీక్ డేస్‌లో ఎలా పెరుగుతాయి? అనేది ఇంకో పాయింటిక్క‌డ‌. `మేం మంచి సినిమానే తీశాం.. కానీ జ‌నాల‌కు చూడ్డ‌మే రాలేదు` అంటూ రుద్ద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారా? ఆ ఛాన్సు కూడా లేదు. ఎందుకంటే.. వీకెండ్ లో సినిమా చూడ‌ని జ‌నం.. వీక్ డేస్‌లో ఎలా థియేట‌ర్ల‌కు వ‌స్తారు? పైగా వ‌చ్చే వారం కూడా రెండు సినిమాలున్నాయి. అప్ప‌టి వ‌ర‌కూ `నీవెవ‌రో` నిల‌బ‌డుతుంద‌న్న భ‌రోసాతోనే ఇలా మాట్లాడుతున్నారా? ఏమో మ‌రి.. ఆ విష‌యం చిత్ర‌బృందానికే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com