ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన మెజారిటీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు చివరకు ఆ పార్టీ చీలికకు దారితీశాయి. ఆప్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభలో ఆప్ తరఫున ఉన్న సభ్యులలో 2/3 వంతు మంది అంటే 10 మందిలో 7 గురు భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ వంటి ఎంపీలతో కలిసి ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి రక్షణ పొందేందుకు, తమ సభ్యత్వాలు కోల్పోకుండా ఉండేలా రాఘవ్ చద్దా బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం, ఒక పార్టీలోని 2/3 వంతు సభ్యులు మరో పార్టీలో విలీనమైతే వారిపై అనర్హత వేటు పడదు. ఈ మేరకు సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు ఇప్పటికే సమర్పించినట్లు చద్దా తెలిపారు. ఈ బృందంలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్‌తో పాటు హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ ఉన్నట్లు సమాచారం.
తాము ఎంతో కష్టపడి నిర్మించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన ఆశయాలకు తిలోదకాలిచ్చిందని రాఘవ్ చద్దా ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల రక్తాన్ని, చెమటను ధారపోసి ఈ పార్టీని పెంచి పోషించాను. కానీ ఇప్పుడు ఆప్ తన విలువల నుండి పక్కకు తప్పుకుంది. దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. అందుకే మేము ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నాం అని ఆయన పేర్కొన్నారు.
రాజ్యసభలో 10 మంది ఎంపీలున్న ఆప్‌కు, ఒకేసారి ఏడుగురు సభ్యులు దూరమవ్వడం కోలుకోలేని దెబ్బ. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను పార్టీ తొలగించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తులైన నేతలే పార్టీని వీడటం ఆప్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. మరోవైపు, ఈ విలీనంతో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరగనుంది.
