ద గ్రేట్ రాబ‌రీ దొంగ‌ల ప‌ట్టివేత‌

ప‌క్కా స్కెచ్, ప‌క‌డ్బందీగా రెక్కీ, ప‌ర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముత్తూట్ ఫైనాన్స్ లో ప‌ట్ట‌ప‌గ‌లు దోపిడీ చేసిన దొంగ‌ల్లో ఇద్ద‌రి ఆట క‌ట్టించారు పోలీసులు. ముంబైలో ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి మిగ‌తా వాళ్ల కోసం గాలిస్తున్నారు.

హైద‌రాబాద్ శివార్ల‌లో ప‌టాన్ చెరు స‌మీపంలోని బీరం గూడ ముత్తూట్ పైనాన్స్ కార్యాల‌యంలో డిసెంబ‌ర్ 28న ఐదుగురు దుండ‌గులు భారీగా దోపిడీకి పాల్ప‌డ్డారు. సీబీఐ అధికారుల‌మంటూ లోపలికి వెళ్లి హ‌డావుడి చేశారు. 40 కిలోల బంగారం, ల‌క్ష రూపాయ‌ల డ‌బ్బు తీసుకుని ఉడాయించారు. అర‌గంట‌లోపే దోపిడీ పూర్తి చేశారు. సిబ్బందిని బాత్ రూంలో బంధించి స్కార్పియో కారులో పారిపోయారు.

అప్ప‌టి నుంచి ప్ర‌త్యేక పోలీస్ బృందాలు దొంగ‌ల కోసం గాలిస్తున్నాయి. సీసీటీవీల ఫుటేజీ ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగింది. చివ‌ర‌కు ముంబైలో ఇద్ద‌రు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. ఈ దొంగ‌లంద‌రూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు. వీరికి ముంబై జైల్లో ప‌రిచ‌యం అయింది. స‌ర్దార్జీ సూత్ర‌ధారిగా ముఠా క‌ట్టారు. బంగారం త‌న‌ఖా పెట్టుకునే ఫైనాన్స్ కంపెనీలో సీబీఐ పేరుతో వెళ్లి బెదిరించి దోపిడీ చేయాల‌ని ప్లాన్ చేశారు. క‌ర్ణాట‌క లోని వాడీ కేంద్రంగా అన్నీ స‌మ‌కూర్చుకున్నారు. అక్క‌డే డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక స్పార్పియో, ఒక టూవీల‌ర్ లో హైద‌రాబాద్ వ‌చ్చారు.

డిసెంబ‌ర్ 23, 24, 26తేదీల్లో మూడుసార్లు రెక్కీ జ‌రిపారు. ఫైనాన్స్ ప‌రిస‌రాలు అణువ‌ణులూ గ‌మ‌నించారు. ఎటు నుంచి లోప‌లికి వెళ్లాలి, త‌ర్వాత ఎటు నుంచి సుల‌భంగా పారిపోవ‌చ్చ‌నే దానిపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించేలా దోపిడీ చేశారు. స్కార్పియో నెంబ‌ర్ ప్లేటును మూడుసార్లు మార్చారు. అంతా ప‌క్కాగా ప్లాన్ చేశారు. అయినా పోలీసుల‌కు మ‌రింత ప‌క్కా స‌మాచారం అంద‌డ‌టంతో ఇద్ద‌రు ప‌ట్టుబ‌డ్డారు. మ‌రో ముగ్గురు దొంగ‌లు, కారు డ్రైవ‌ర్ కోసం గాలిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com