ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అప్పుడెప్పుడో మొదలైంది ‘అధీర’. డివివి దానయ్య తనయుడు కల్యాణ్ దాసరిని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. ఓ గ్లింప్స్ కూడా వదిలారు. కానీ ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. ఈలోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో ‘మహాకాళి’ సినిమా మొదలైపోయింది. మరి ‘అధీర’ ఏమయ్యాడు? అనేదే పెద్ద ప్రశ్న.
అధీరాకు సంబంధించిన స్క్రిప్టు ఎప్పుడో రెడీ. కాకపోతే.. దర్శకుడే కావాలి. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించారు. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారంతే. ఆయన అండర్లో పని చేయడానికి ఓ దర్శకుడు కావాలి. నిన్నా మొన్నటి వరకూ విజయ్ బిన్నీ పేరు గట్టిగా వినిపించింది. నాగార్జున తో ‘నా సామి రంగ’ సినిమా తీశారు విజయ్ బిన్నీ. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. ఆ వెంటనే నాగ్ తో మరో సినిమాప్లాన్ చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తరవాత ‘అధీర’కు సంబంధించిన డిస్కర్షన్స్ నడిచాయి. కానీ… ఇప్పుడు విజయ్ కూడా రేసు నుంచి తప్పుకొన్నారని తెలుస్తోంది.
దానయ్య మాత్రం ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడైతే బాగుంటుంది అని ఉంది. మరోవైపు ఆయన ప్రశాంత్ వర్మపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వదిలి ఇంత కాలమైనా షూటింగ్ మొదలుపెట్టకపోతే ప్రాజెక్ట్ పై ఆసక్తి సన్నగిల్లుతోంది. వీలైనంత త్వరగా దర్శకుడ్ని సెట్ చేయాలన్నది ప్రశాంత్ వర్మ ఆలోచన. ఈ సినిమా ఓ కొలిక్కి వస్తే, ఆయన పూర్తిగా ప్రభాస్ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.