రాజ‌మౌళి ముందు రెండు ఆప్ష‌న్లు

బాహుబ‌లి ప‌నుల‌న్నీ అయిపోయాయి. ఇక ప్ర‌మోషన్లు చూసుకొంటే స‌రిపోతుంది. ఆ త‌ర‌వాత బాహుబలి 2 వ‌సూళ్లు, రికార్డులు లెక్క‌పెట్టుకోవ‌డం మిన‌హా పెద్ద ప‌నులేం లేవు. బాహుబ‌లి 2 విడుద‌ల త‌ర‌వాత సుదీర్ఘ‌ విహార యాత్ర‌కు వెళ్లాల‌ని రాజ‌మౌళి అండ్ టీమ్ డిసైడ్ అయ్యింది. అయితే వెళ్లే లోపుగా నెక్ట్స్ సినిమా ఎవ‌రితో అనే విష‌యంలో ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా విష‌యంలో త‌న ముందు రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ఒక‌టి.. ఎన్టీఆర్‌తో ఓ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డం, రెండోది ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమాతో ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డం. మ‌గ‌ధీర త‌ర‌వాత మ‌ర్యాద రామ‌న్న సినిమాతో అంద‌రికీ షాక్ ఇచ్చాడు జ‌క్క‌న్న‌. భారీ హిట్ త‌ర‌వాత ఆటోమెటిగ్గా.. ఎవ‌రిపైనైనా ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని త‌గ్గించుకోవ‌డానికి ఇలా చిన్న‌, మీడియం సినిమాలు తీయ‌డం స‌రైన ఎత్తుగ‌డే. అందుకే మ‌ర్యాద రామ‌న్న‌తోనూ రాజ‌మౌళి అల‌రించ‌గ‌లిగాడు. ఈగ లాంటి సినిమా తీయ‌డం వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే. అంచ‌నాల్ని త‌గ్గించుకొంటూ వెళ్ల‌డం. బాహుబ‌లి త‌ర‌వాత రాజ‌మౌళి.. హాలీవుడ్ స్థాయి ద‌ర్శ‌కుడు అయిపోయాడు. త‌నపై పెరిగిన అంచ‌నాల్ని త‌గ్గించుకోవాలంటే ప్ర‌యోగాత్మ‌క సినిమాతో షాక్ ఇవ్వ‌డం స‌రైన పనే.

ఆ త‌ర‌హా క‌థ‌లు విజ‌యేంద్ర ప్ర‌సాద్ ద‌గ్గ‌ర సిద్దంగానే ఉన్నాయి. మ‌రోవైపు త‌న స్థాయిలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేసి చాలా కాలం అయ్యింది. య‌మ‌దొంగ త‌ర‌వాత‌, రెగ్యుల‌ర్ యాక్ష‌న్ సినిమాల్ని చేయ‌లేదు రాజ‌మౌళి. అందుకే.. ఎన్టీఆర్ తోసినిమా కూడా రాజ‌మౌళికి బెస్ట్ ఆప్ష‌నే. దానికి తోడు ఎన్టీఆర్ కూడా జ‌క్క‌న్న‌తో సినిమా చేయ‌డానికి త‌హ‌త‌హ‌లాడిపోతున్నాడు. బాబి సినిమా కూడా వీలైనంత త్వ‌ర‌గానే పూర్త‌వుతుంది. ఈలోగా రాజ‌మౌళి సెల‌వ‌లు ముగించుకొని, స్క్రిప్టు ప‌నులు కూడా పూర్తి చేసుకోవొచ్చు. `ఈసారి నాతోనే చేయాలి..` అంటూ ఎన్టీఆర్ కూడా రాజ‌మౌళిపై ఒత్తిడి పెంచుతున్న‌ట్టు స‌మాచారం. 2018లో మ‌హేష్ తో ఓ సినిమా ఫిక్స‌య్యాడు రాజ‌మౌళి. అందుకే… ఇప్పుడు కాక‌పోతే ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డం కుద‌ర‌క‌పోవొచ్చు. అందుకే రాజ‌మౌళి కూడా ఎన్టీఆర్ తో ప్రొసీడ్ అయిపోదామ‌నుకొంటున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com