లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ తెలంగాణలో ఎక్కడిదక్కడే..!

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి రెండు నెలలవుతోంది. డిసెంబర్ పదకొండున తెలంగాణ అసెంబ్లీ ఫలితాలొచ్చాయి. టీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ రావడంతో ఫలితాలు వచ్చిన మూడో రోజునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తో మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసారు. వెంటనే హోం శాఖను కూడా కేటాయించారు. అప్పటి నుండి ఇప్పుడు, అప్పుడు అంటూ మంత్రి వర్గం వాయిదా పడుతూ వస్తోంది. మంచి రోజులు లేవన్న కారణంతో సంక్రాంతి తర్వాతే విస్తరణ అని చెప్తూ వచ్చారు…సంక్రాంతి తర్వాత కేవలం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి పరిమితం చేశారు. యాగం, పంచాయతీ ఎన్నికలు కూడా విస్తరణకు అడ్డుగా ప్రచారం జరిగింది..ఇక మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడుంటుందనే దానిపై కూడా టిఆర్ఎస్ వర్గాలకే తెలియడం లేదు..ఏ కారణంతో వాయిదా పడుతుందో కూడా అర్థం కావడం లేదని పార్టీ నేతలు, ఆశావహులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మంత్రివర్గ విస్తరణ లేకుంటే పాలనకేం ఇబ్బంది లేదని సిఎం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కానీ గత ఆరు నెలలుగా కీలక ఫైళ్లన్నీ నిలిచిపోయాయి..సెప్టెంబరు ఆరున అసెంబ్లీ రద్దైనప్పటి నుండి ముఖ్యమైన ఫైళ్లలో కదలిక లేదు..రోజు వారి పనులకు ఇబ్బంది లేకపోవచ్చు కానీ కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు,అభివృద్ధి పనులు నిలిపోతున్నాయి. మంత్రులు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు పలు శాఖల్లో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలే లేవు.పలు శాఖలకు అధికారులు లేక ఇంచార్జ్ లతోనే కొనసాగుతోంది. కొద్ది మంది అధికారులు పోస్టింగ్ ల కోసం ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి పనులు ముదుకు సాగడం లేదు. గత ఏడెనిమిది నెలలుగా ప్రతిష్టాత్మక ఫార్మాసిటి,టెక్స్ టైల్ పార్కు పనులు నత్తనడకన సాగుతన్నాయి..నగరం పరిధిలో జరుగుతున్న ఉప్పల్ రోడ్డు విస్తరణ పనులు,యాదాద్రి వరంగల్ హైవే పనుల వేగం మందగించింది.ఇప్పటికే పూర్తి కావల్సిన మిషన్ భగీరథ,పలు నీటి ప్రాజెక్టుల పనులు మెల్లగా చేస్తున్నా కాంట్రాక్టర్లను నిలదీసే వారే లేరు..దీంతో కొన్ని పనులను వచ్చే జూన్ కు వాయిదా వేసింది ప్రభుత్వం.

టీచర్,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు,లోక్ సభ ఎన్నికల కారణంగా మరో మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు అధికారులు..ఓ ప్రజాప్రతినిధి అభివృద్ధి పనుల కోసం వస్తే మంత్రి వర్గ విస్తరణ,లోక్ సభ ఎన్నికల వరకు ఆగాల్సిందేనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు అధికారులు. దీంతో ఎమ్మెల్యేలకూ పని లేనట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com