టీ టీడీపీని మ‌ళ్లీ గంద‌ర‌గోళంలో వ‌దిలేస్తున్నారా..?

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మ‌ళ్లీ అదే సందిగ్ధ ప‌రిస్థితి..! చాన్నాళ్ల త‌రువాత పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర పార్టీ శాఖ‌కు కొంత స‌మ‌యం కేటాయించారు. కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేశారు. రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వ‌ని ఆశావ‌హ దృక్ప‌థం క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. అన్నీ బాగానే ఉన్నాయిగానీ.. పొత్తు విష‌య‌మై చంద్ర‌బాబు మ‌రింత స్ప‌ష్ట‌త ఇవ్వాల్సింది. చంద్ర‌బాబు ఇంట్లో పోలిట్ బ్యూరో స‌భ్యులు, ఇత‌ర టి. నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. దీన్లో ప్ర‌ధానంగా పొత్తు అంశ‌మే ప్ర‌స్థావ‌న‌కి వ‌చ్చినా అంతిమంగా స్ప‌ష్ట‌త రాలేదు.

గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న భాజ‌పా మ‌న‌కు చెప్ప‌కుండా బంధం తెంచుకుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. వారే ముందుగా పొత్తుపై బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తే మ‌న‌మేం చేస్తామ‌న్నారు. కార్య‌క‌ర్త‌ల్లో మంచి ఉత్సాహం ఉంద‌నీ, పార్టీని సంస్థాగ‌తంగా మ‌రింత బ‌లోపేతం చేయాల‌నీ, నాయ‌కులు క్షేత్ర‌స్థాయికి వెళ్లాల‌ని దిశా నిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టి. తెలుగుదేశం ఒంట‌రిపోరు చెయ్య‌ద‌నీ, పొత్తు క‌చ్చితంగా ఉంటుంద‌న్నారు. అయితే, ఎవ‌రితో ఉంటుంద‌నేది ఎన్నిక‌ల ముందు నిర్ణ‌యిద్దామ‌ని చంద్ర‌బాబు అన్నారు.

టి. టీడీపీకి నాయ‌క‌త్వ లేమి ఒక స‌మ‌స్య అయితే, రెండోది రాజ‌కీయ స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం. ఒంటరిగా తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు వెళ్లే ప‌రిస్థితి లేద‌న్న‌ది ఎప్ప‌ట్నుంచో అర్థ‌మౌతున్న విషయం. నిజానికి, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడే ముందు కూడా పొత్తు విష‌య‌మై త‌ర‌చూ డిమాండ్ చేస్తుండేవారు. ఎవ‌రితో పొత్తు ఉంటుందో స్ప‌ష్ట‌త ఇస్తే, దాని ప్ర‌కారం భ‌విష్య‌త్తు వ్యూహాలు ఉంటాయ‌ని అనేవారు. అయితే, ఆయ‌న తెచ్చిన ప్ర‌తిపాద‌న‌.. కాంగ్రెస్ తో టీడీపీతో పొత్తు! అది ఆచ‌ర‌ణ సాధ్యం కాబ‌ట్టి, ఆ ప్ర‌తిపాద‌న ప‌క్క‌కు వెళ్లింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భాజ‌పాతో తెలంగాణ టీడీపీ పొత్తు కూడా అనుమానంగానే క‌నిపిస్తోంది. ఎందుకంటే, ఆంధ్రాలోనే తెగ‌తెంపులు చేసుకునే స్థాయిలో టీడీపీ ఉంది. ఇక‌, మిగిలింది.. అధికార పార్టీ తెరాస‌. ఆ మ‌ధ్య కేసీఆర్ ఆంధ్రాకు వెళ్ల‌డం, అక్క‌డి టీడీపీ నేత‌ల‌తో చ‌నువుగా మాట్లాడ‌టం, హైద‌రాబాద్ అభివృద్ధిలో చంద్ర‌బాబు కృషి మ‌ర‌చిపోలేనిద‌ని మంత్రి కేటీఆర్ మెచ్చుకోవ‌డం.. ఈ నేప‌థ్యంలో టీడీపీ, తెరాస‌ల మ‌ధ్య కొంత సానుకూల వాతావ‌ర‌ణ‌మే ఏర్ప‌డింద‌నే సంకేతాలు వెలువ‌డ్డాయి. అయితే, తెరాస‌తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రాలో రియాక్ష‌న్స్ మ‌రోలా ఉండ‌టం ఖాయం. దీంతో తెలంగాణ తెలుగుదేశం పొత్తు మ‌రోసారి సందిగ్ధంలోనే ప‌డింది. దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చేస్తే రాష్ట్ర నేత‌లు వారి ప‌నిలోవారుంటారు క‌దా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.