సెంటిమెంట్ నమ్ముకునే కోదండరామ్ పోరాటం..!

ఇక‌పై తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ కార్యాచ‌ర‌ణ చాలా తీవ్రంగా ఉంటుంద‌ని చెప్పారు ఆ పార్టీ అధినేత కోదండ‌రామ్‌. త్వ‌ర‌లోనే తాము కొన్ని అంశాల‌పై ఉద్య‌మాల‌ను ప్రారంభిస్తామ‌నీ, వాటికి అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు కావాల‌ని ఆయ‌న కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌ను, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా నిర్మించుకోవ‌డం కోసం అంద‌రూ పోరాడాల‌న్నారు. తెలంగాణ కోసం అమ‌రులైన‌వారి స్మృతి చిహ్నాలు క‌ట్ట‌డానికే తెరాస ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి నివాసం మూడు వంద‌ల కోట్ల‌తో మూడు నెల‌ల్లో నిర్మాణం పూర్త‌వుతుంద‌నీ, కానీ అమ‌ర వీరులకు స్మృతి చిహ్నం నిర్మించే స‌మ‌యం ప్ర‌భుత్వానికి లేదా అని ప్రశ్నించారు. దీని కోసం దీక్ష చేయ‌బోతున్నామ‌న్నారు.

మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మాన్ని గుర్తు చేసే విధంగా మ‌రో చిహ్నాన్ని డిజైన్ చేయిస్తామ‌న్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై కూడా ఉద్య‌మిస్తామ‌న్నారు. దీనిపైనా చాలా సీరియ‌స్ స్థాయి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌న్నారు. దీంతోపాటు మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌పై కూడా ఉద్య‌మ ప్ర‌ణాళిక సిద్ధంగా ఉంద‌న్నారు. తాము పోరాటాలు చేయ‌బోతున్న‌ది సొంత విష‌యాల‌పై కాద‌నీ, అందుకే అంద‌రూ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోదండ‌రామ్ కోరారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌స‌మితి పార్టీ పోటీ గురించి మాట్లాడుతూ… తాము అంశాలవారీగా కొంత‌మందితో క‌లిసి పోరాటం చేసినా, ఎన్నిక‌ల్లో సొంతంగా ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌న్నారు. అయితే, ఎంత‌మంది పోటీ చెయ్యాలీ.. ఎక్క‌డి నుంచి పోటీ చెయ్యాల‌నేది ఇంకా ఆలోచించలేద‌ని కోదండ‌రామ్ స్ప‌ష్టం చేశారు.

మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మం పేరుతో కోదండ‌రామ్ కూడా సెంటిమెంట్ మీద ప్ర‌ధానంగా ఆధార‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. అందుకే, ముందుగా అమ‌ర‌వీరుల స్థూపాల కోసం ఉద్య‌మం అంటున్నారు. వాస్త‌వం మాట్లాడుకుంటే… తెలంగాణ జ‌న స‌మితికి ఒక రాజ‌కీయ పార్టీగా తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఒక అటెన్ష‌న్ ఇంకా రాలేదు. అది రావాలంటే… ప్ర‌జ‌ల్లోకి సులువుగా వెళ్లొచ్చనుకునే ఇలాంటి భావోద్వేగపూరిత అంశాల‌నే ఎన్నుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టున్నారు. ఇకపై, జ‌న స‌మితి కార్యాచ‌ర‌ణ కాస్త వేగంగానే ఉంటుంద‌ని అనిపిస్తోంది. ఎందుకంటే, ఎన్నిక‌లు స‌మీపించేలోపు రాజకీయ పార్టీగా కొంత పట్టు సాధించాలి కదా. త్వ‌ర‌లో చేప‌డ‌తామంటున్న ఉద్య‌మాలను స‌క్సెస్ చేసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి జ‌న స‌మితిపై ఉంది. వాటి ఆధారంగానే ఒక రాజ‌కీయ పార్టీగా జ‌న స‌మితికి ఉన్న ఉనికి ఏమాత్రం అనేది తేట‌తెల్లం అవుతుంది. దాని ఆధారంగానే ఎన్నిక‌ల్లో ఎన్ని స్థానాల్లో ప్ర‌భావం చూప‌గ‌ల‌ద‌నే లెక్కా తేలిపోతుంది. మొత్తానికి ఇది మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మం అవునో కాదో చెప్ప‌లేంగానీ… కోదండ‌రామ్ పార్టీ ప్ర‌భావం ఎంత‌నేది తేల్చేసే కార్యాచ‌ర‌ణే అన‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com