రెండు వైపులా బిగుస్తున్న చిక్కుముడి!

Kapu Reservations
Kapu Reservations

(రాజకీయాల్లో కులాల కెమిస్ట్రీ-2)

Click to read Part – 1

కాపులను బిసిలలో చేర్పించాలన్న డిమాండే ఇపుడు హాట్ టాపిక్! ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది! ఆయన పిలుపు ప్రకారం చాలా ఊళ్ళలో గుంపులు గుంపులు గా ప్రజలు ఖాళీ కంచాలను గరిటెలతో మోగించారు.

రిజర్వేషన్లకు సంబంధించి భారత రాజ్యాంగంలో బీసీ అని పేర్కొన్నది వెనుకబడిన తరగతుల గురించి. చాలామంది దాన్ని వెనుకబడిన కులాలకు పర్యాయ పదంగా వాడుతున్నారు. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం వుంది. గుర్తింపు పొందని హిందూ, ముస్లీం తదితర మతాలవారిలో వెనుకబడిన కులాలు అనేకం వున్నాయి. అవన్నీ వెనుకబడిన తరగతులగా గుర్తింపు పొందాలని కోరుతున్నాయి. కులం అనేది శాశ్వతం. దీన్ని మార్చడం కుదరదు. తరగతి అనేది తాత్కాలిక సౌలభ్యం.

వెనుకబడిన తరగతులు – వెనుకబడిన కులాలు అనే సాంకేతిక అంశాన్ని పక్కనపెట్టేసినా సమాజంలో వున్న పరిగణణలను బట్టి కాపుల స్ధానం ఆధిపత్య కులాల్లో దిగువ కులంగా, దిగువ కులాల్లో ఆధిపత్య కులంగా వుంది.
అటూ ఆటూ కాని సామాజిక స్ధితిలో వున్న కాపులు తాము బిసిలతో కలసి గుర్తింపుపొందడానికి మానసికంగా సిద్ధమౌతున్నారు.

అయితే దీన్ని బిసిలు అంగీకరించడం లేదు. ఇందుకు వారు చూపుతున్న మొదటికారణం రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం కాపులు బిసిల వర్గీకరణలోకి రారు. రెండోకారణం తమ కోటాలు వాటాలను అర్హతలేనివారికి పంచడం బిసిలకు సమ్మతం కాకపోవడం.

బీసీలు అంటే వెనుకబడిన తరగతుల జాబితాలో కలపదలచిన కులాలలకు రెండు ప్రధాన ప్రాతిపదికలు ప్రాతిపదికలు వున్నాయి. మొదటిది ఒక కులం జనాభా దామాషాలో ఆకులస్తులకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాతినిథ్యం లేకపోతే అయా కులాన్ని బీసీ జాబితాలో చేర్చడానికి రాజ్యాంగం అవకాశాన్ని ఇచ్చింది. రెండవది సామాజిక వివక్షకు గురవుతున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించి.. అధికారంలో వాటా ఇచ్చి ఈ కులాల ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి సామాజిక గౌరవం ఇవ్వడానికి అవకాశం .

BCs-dharna-in-Rajamahendravaram

కాపులకు ఈ రెండు ప్రాతిపదికలు లేవని, విద్య, ఉద్యగ, రాజకీయ రంగాలలో వారి జనాభా ప్రపోర్షన్ కు మించిన ప్రాతినిథ్యం ఉందని, ఉన్నత స్థితిలో ఉన్న కాపు కులాన్ని బీసీ జాబితాలో ఎలా కలుపుతారని బిసి నాయకుడు తెలుగుదేశం ఎమ్మెల్యే కృష్ణయ్య ప్రశ్నించారు.

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ప్రత్యేక గ్రూపు ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. విద్యా-ఉద్యోగ రిజర్వేషన్లకు ఉన్నట్టు ఎ బి సి డి గ్రూపులు, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు లేవు. అలాంటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్‌పిటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ ఎన్నికలలో మొత్తం రిజర్వేషన్లు కాపులే చేజిక్కించుకుంటారన్నది బిసిల వాదన…అలాగే కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు విద్యా, ఉద్యోగాలకు రిజర్వేషన్లకు గ్రూపులు లేవు. అలాంటప్పుడు కేంద్రంలోని ఐఏఎస్, ఐపిఎస్, సివిల్ సర్వీస్, బ్యాంకింగ్, రైల్వే ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ బీసీ రిజర్వేషన్ల కోటా కింద మొత్తం కాపులే జేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇందువల్ల బీసీ జాబితాలోని చాకలి, మంగలి, వడ్డెర, మత్సకారులు, చేనేత, గొర్రెకాపరులు, గీత, సంచార జాతులు, వృత్తి కులాల వారికి ఒక్క ఉద్యోగం వచ్చే అవకాశం లేదని కృష్ణయ్య స్పష్టం చేశారు.

1969 అనంతరామన్ కమిషన్, 1983లో మురళీధర్‌రావు కమిషన్ కూడా కాపులను బీసీ జాబితాలో కలుపడానికి తిరస్కరించాయి. కమిషన్ సిఫార్సులు లేకుండా బీసీ జాబితాలో కలుపుతామంటే న్యాయస్థానాలు ఒప్పుకోవని, ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చొరవతో ఉత్తరప్రదేశ్‌లోని జాట్‌లను ఓబీసి జాబితాలో కలిపితే సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతిని మర్చిపోవద్దన్నారు. 1993లో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపులను బీసీ జాబితాలో చేర్చుతూ జీవో జారీ చేశారు. దాన్ని సవాలు చేస్తూ బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో కేసు వేసింది. జివో చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.

వాస్తవాలు ఇలావుండగా కాపులను బిసిలలో చేర్చడం అన్యాయమని, కాపులుకావాలో బిసిలు కావాలో ప్రభుత్వమే తేల్చకోవాలనీ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. నేను అధికారపార్టీ ఎమ్మెల్యేని అన్నది నిజం…కానీ మొదటినుంచీ బిసి ఉద్యమకారుణ్ణి అన్నది అన్నది మరీ నిజం అనికూడా ఆయన వివరించారు.

డిమాండ్లసాధనకోసం నిరాహారదీక్ష ప్రారంభించిన ముద్రగడ పద్మనాభానికి ఊరూరా కాపుసమాజం నుంచి మద్దతు పెరుగుతోంది. కాపులను బిసిలలోచేర్చరాదని బిసిలు రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు.

ఇది బిగుస్తున్న చిక్కుముడిని విప్పే రాజకీయ ప్రక్రియ కొనసాగవలసిన సమయం…ఇది ఉద్రిక్తతలు పెరగకుండా ప్రభుత్వ యంత్రాంగం వెయ్యికళ్ళతో సమాజాన్ని కాపాడవలసిన, ప్రభుత్వ ప్రయివేటు ఆస్తులను వెయ్యి చేతులతో రక్షించవలసిన తరుణం.

 

Click to read Part – 3

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com