అజ్ఞాతవాసి రివ్యూ: ‘వాసి’ తక్కువ

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

ఎంత పెద్దవాళ్లయినా చిన్నపిల్లల్ని, బుజ్జాయిలను ఆడించడానికి ఛు..ఛు..బుజ్జీ..కన్నా..అనాల్సిందే. అంతే కానీ, చందరంగం ఆట మొదలుపెట్టకూడదు. పసిపిల్లలు దడుసుకుని, మరింత ఏడుపు లంకించుకునే ప్రమాదం వుంది. సినిమా అయినా అంతే. బాల్కనీ నుంచి నేల టికెట్ వరకు వున్న అన్ని రకాల ఆడియన్స్ ను దృష్టి లో వుంచుకుని కథకుడు, దర్శకుడు శతావధానం చేయాలి. అలా కాకుండా రెండూ తానే అయి, తనకు తానే నేత్రావధానం చేసుకుంటే, జనం అదేమిటో అర్థం కాక కిందా మీదా అవుతారు.

దర్శకుడు త్రివిక్రమ్ మేధావే కావచ్చు. ఆరితేరిన మాటల మాంత్రికుడే కావచ్చు. కానీ పవర్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్నపుడు కామన్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే కథ తయారుచేసుకోవాలి. కథ ఎప్పుడయితే కాస్త నేలబారుగా వుంటుందో, కథనంలో మేధావితనం కాస్త చూపించినా ఫరవాలేదు. అంతే కానీ కథ అంత ఎత్తున, కథనం ఇంత కిందన వుంటూ బండినడిపిద్దాం అనుకుంటే పొంతన కదురదు. ప్రమాదం తప్పదు.

అత్తారింటికి దారేది అనే ప్రతి ఇంటా వినిపించే టైటిల్ తో సినిమా చేసిన దర్శకుడు త్రివిక్రమ్, అజ్ఞాతవాసి అనే ఛాయిస్ తీసుకున్నపుడే జనం కాస్త అనుమాన పడ్డారు. అయితే ఇప్పటి దాకా త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు చూసి ధైర్యం తెచ్చుకుని థియేటర్ల వైపు నడిచారు.

‘అజ్ఞాతవాసి’లో ఓ డైలాగు వుంటుంది. వాడు వచ్చినపుడు గది అంతా వెడెక్కింది. గాలి ఆడలేదు..ఊపిరి అందలేదు..ఇలాంటి అర్థం వచ్చేలా. అజ్ఞాతవాసి సినిమా కూడా అలాగే వుంటుంది. థియేటర్లో తెరమీద సినిమా కదుల్తుంటుంది. ప్రేక్షకుల్లో స్పందన వుండదు. కళ్లప్పగించి చూడడమే. సంభ్రమాశ్చర్యాలతోనే. ఆ సంభ్రమాశ్చర్యాలు వచ్చింది. సినిమా అద్భుతంగా వుండి కాదు. త్రివిక్రమ్ నే ఈ సినిమా తీసాడా అన్న సందేహంతో. చివరకు ఇలాంటి సినిమా తీసాడేంటా అని నిట్టూర్చి, హాలు ను వేడెక్కించడమే.

ప్రతీదీ ప్లాన్ బి అని ఓ ఆప్షన్ వుంచుకునే బిజినెస్ టైకూన్ విందా (బొమ్మన్ ఇరానీ) ని ప్రత్యర్థులు కాల్చి చంపుతారు. ఆ విషయంలో పగతీర్చుకోవడం కోసం తన సవతి కొడుకు అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను పిలిపిస్తుంది విందా భార్య (కుష్బూ). అతగాడు ఎలా పగతీర్చుకున్నాడు అన్నది సింపుల్ గా సినిమా లైన్.

విశ్లేషణ :

ఆడేంట్రా ఏదో మొక్కకు అంటుకట్టినట్లు అంత శ్రద్ధగా, ఏదో శిల్పం చెక్కినట్లు నెమ్మదిగా కొట్టాడు అంటాడు ఓ సినిమాలో త్రివిక్రమ్. మరి ఆయనెందుకు శ్రద్ధగా, చక్కగా అజ్ఞాతవాసి కథనం తయారుచేసుకోలేదో అర్థం కాదు. తండ్రి మరణానికి కారకులైన వారిపై పగతీర్చుకోవడం అనే పాత చింతకాయపచ్చడి లాంటి లైన్ తీసుకుని, దాన్ని జనాలకు చేరువయ్యేలా సింపుల్, బాగా చెప్పడం మానేసి, ఏదోదో చేసాడతను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తొలిరోజు తొలి ఆట తొలిసగం పూర్తిగా నిశ్శబ్ధంగా కూర్చుని చూసారు అంటే ఆ సినిమా ఎలా వుందో ఇంక వివరంగా చెపనక్కరలేదేమో?

అసలు సినిమా రాసుకున్న కథనమే చాలా వీక్ గా వుంది. అస్సలు లాజిక్ లు లేని కథనాన్ని అందించాడు. సినిమాలో కొన్ని సీన్లకు లాజిక్ లే వుండవు. హీరో తన ఆఫీసులోకి తానే వేరే పేరుతో వెళ్లడానికి నానా హంగామా చేస్తాడు. ఓ సీన్లో అదే ఆఫీస్ లోకి సర్రున వచ్చేస్తారు తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్. తన ఆఫీసులోకి తను రావడానికి ఇంత తతంగం ఎందుకో? అప్పటికే టెంపరరీ సిఇఓగా వున్న సవతి తల్లి ఓ అపాయింట్ మెంట్ చేస్తే సరిపోయేది కదా? ఎప్పుడో వర్షం కురిసిన రాత్రి వదిలేసి వెళ్లిపోయాడు విందా అంటాడు తనికెళ్ల భరణి. ఫ్లాష్ బ్యాక్ సీన్లలో తండ్రితో, సవితి తల్లితో కులాసాగా గడపడం చూపిస్తాడు. సరే ఇలాంటివి సినిమా అడుగుఅడుగునా చాలా వున్నాయి. వాటి సంగతి వదిలేసి సినిమా చూస్తే..

దర్శకుడు త్రివిక్రమ్ చేసిన ఒకే ఒక తప్పు, సినిమా కథను పెద్దగా పట్టించుకోకుండా, కథనాన్ని తేలిగ్గా తీసుకుని, కేవలం చిత్రీకరణ మాత్రం అత్యున్నతంగా వుండేలా చూసుకోవడం. అందువల్ల కోట్ల ఖర్చు మిగిలింది తప్ప, ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. ప్రతి సీన్ ను ఇలా ఆకాశం అంత ఎత్తునే వుండాలనుకున్నాడు త్రివిక్రమ్. హీరో ఎంట్రన్స్. ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో. ఫోన్ సిగ్నల్స్ అందని చోట. కొండ కోనల్లో. కానీ అక్కడ హీరో ఎవరితోనో ఫైట్ ఎందుకు చేసినట్లు? ఎందుకు కత్తులతో దాడి చేసినట్లు? ఎబి కంపెనీకి భయంకరమైన బిల్డింగ్. కానీ అందులో చౌకబారు జనాలు, చౌకబారు హాస్యం. ఎక్కడో విదేశాల్లో వున్న విందాను ఛక్ ..ఛక్ మని కాల్చేసి చంపేసేంత ఉన్నతమైన సీన్. కానీ విలన్ చూస్తే పక్కా వీక్. తండ్రి పోయిన బాధలో మునిగిన తన మొహంపై మళ్లీ నవ్వు మొలవాలన్నది హీరో కోరిక. కానీ ఆ పగతీర్చుకోవడం అంతా పక్కా కామెడీ.

తొలిసగంలో ఇద్దరు హీరోయిన్ల దగ్గర హీరో వేసిన వేషాలు అటు రొమాంటిక్ గా వుండవు. ఇటు సరదాగానూ వుండవు. ఇక ఆఫీసులో శర్మ, వర్మ దోషులు కారని, అసలు దోషి ఎవరో ఉన్నారని తెలిసాక కూడా వాళ్లను కొట్టడం, అల్లరి చేయడం ఎందుకో అర్థం కాదు. సరే ఇలా ఏదో ఒకటి చేసి తొలిసగం ముగిసిందనిపిస్తాడు దర్శకుడు. అంతవరకు తమ మధ్య వేరే వేషంతో వున్నావాడే వారసుడు అంటూ ఎంటర్ కావడంతో తొలిసగం ఒక కొలిక్కి వస్తుంది. ఇదంతా ఫక్తు సవాలక్ష సినిమాల్లో చూసినట్లే వుంటుంది తప్ప, ఏమాత్రం ఉత్కంఠ లేదా ఉద్విగ్నత రేకెత్తించదు.
సరే, ద్వితీయార్థం మొదలయ్యాక, ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి, ఏదో కొత్త మార్గం అన్నట్లుగా, ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ నే అంతా ఊహించేస్తాడు. దాంతో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా రక్తి కట్టకుండా పోయింది. నిజానికి ఈ ఎపిసోడ్ ను నేరుగా రన్ చేసి వుంటే, సవతి తల్లి, కొడుకుల మధ్యా బాండిగ్ ను క్లియర్ గా చూపించడానికి వీలయ్యేది. అప్పుడు క్లయిమాక్స్ లో తల్లీ కొడుకుల మధ్య సీన్ రక్తి కట్టేది.

ద్వితీయార్థంలో ఏదోదే చేసేసి, ఇక చేసేదేమీ లేక, చేతి వాచీ కేసి చూసుకుని అప్పుడే రెండు గంటలు దాటేసింది. అని చటుక్కున క్లయిమాక్స్ కు తెచ్చేసాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది క్లయిమాక్స్ మోడల్ నచ్చింది కనుక, మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేద్దాం అనుకున్నాడు. పనిలో పనిగా అ..ఆ లోని ఎక్స్ టెండెడ్ క్లయిమాక్స్ ను కూడా రిపీట్ చేయాలనుకున్నాడు. ఇవన్నీ ఏవీ, ఏవీ, ఏవీ కూడా ప్రేక్షకుల్లో వన్ ఇంచ్ కూడా స్పందన కలిగించలేదు. ఇలాంటి సినిమాలో అక్కడక్కడ కేక్ పై జీడిపప్పు అద్దినట్లు పాటల అద్దారు. ఏవీ కూడా సరిగ్గా ఇమడలేదు. దాంతో, మొత్తంగా సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

నటీనటులు :

పవన్ కళ్యాణ్ ను అందంగా చూపించే ప్రయత్నం వరకు ఓకె. సిజి లో కూడా కాస్త వర్క్ చేసినట్లున్నారు. కానీ వయస్సు తెలుస్తోంది. పైగా పాటల్లో (ఒక్క కోటీశ్వర్రావా మినహా) కాలు కదపలేదు. ఫైట్లలో హు..హా..అంటూ క్లోజప్ లు ఎక్కువ. కదలికలు తక్కువ. ఇక డైలాగులు ఎలాగూ నిల్చుని, అలా కదలకుండా చెప్పడం. కానీ ఒకప్పటి పవన్ ఇలా కాదుగా. స్ప్రింగ్ లా కదులుతూ, ఎలా వుండేవి ఆ సినిమాలు, ఆ హుషారు. అది ఈ సినిమాలో కనిపించదు. హీరోయిన్లు ఇధ్దరూ కూడా అలరించలేదనే చెప్పాలి. కీర్తి సురేష్ మరీనూ. వెన్నెల కిషోర్ ను, శ్రీనివాస రెడ్డిని సరిగ్గా వాడుకోలేకపోయారు. సరైన పాత్రలను త్రివిక్రమ్ తయారుచేయలేకపోయారు.

సాంకేతికత వర్గం :

సినిమా టెక్నికల్ గా చాలా ఉన్నతంగా వుంది. అందులో సందేహం లేదు. వంద కోట్లకు ఫైగా ఖర్చు కనిపిస్తోంది. మూమూలుగా తీయాల్సిన కథ, సినిమాను కోట్ల ఉన్నాయి కదా అని భారీగా తీసినట్లు వుంది తప్ప, భారీ సినిమా కాబట్టి డబ్బులు ఖర్చు చేసినట్లు లేదు. ఉదాహరణకు ఓపెనింగ్ సీన్ ను కూడా అంత సిజి చేయాల్సినంత లేదు. మన రంపచోడవరం రూట్ లో తీసి వుంటే, సింపుల్ గా అయిపోయేది. కోట్లు మిగిలి వుండేవి. విందా ఇల్లు కూడా అంతే. దానికీ సీజీనే. ఇలా అయిన దానికీ, కాని దానికీ భయంకరంగా డబ్బులు తగలేసారు. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అనిరుధ్ సంగీతంలో మూడు పాటలు బాగున్నాయి కానీ సినిమాలో కాదు. అలాగే నేపథ్యసంగీతం దర్శకుడు, సంగీత దర్శకుడి టేస్ట్ లను బట్టి వెళ్లింది కానీ, సినిమాలో సన్నివేశాన్ని బట్టి కాదు. పోష్ కుర్రాడు, కాస్ట్లీ కారులో ఎక్కడో విదేశాల్లో ఫాస్ట్ గా వెళ్తుంటే, నేపథ్యంలో కర్ణాటకో,శాస్త్రీయమో అయిన సంగీతం వినిపిస్తుంటుంది. ఇలా చాలా వుంది వ్యవహారం.

కథకుడిగా ఫెయిల్ అయిన త్రివిక్రమ్ మాటల రచయితగా కూడా ఫెయిల్ అనే చెప్పాలి. ఎందుకంటే కథనానికి, కథకు సంబంధం లేకుండా, హీరోయిజం కోసం కాకుండా, హీరో కోసం, హీరో రాజకీయ నేపథ్యం కోసం అక్కర్లేని డైలాగులు రాసాడు. అక్కడక్కడ మాత్రం మెరుపులు మెరిసాయి. ‘నాన్నగారిని చూడొచ్చా అంటే, కాదంబరి కిరణ్ కుమార్..’ ఆయనేం తాజ్ మహాలా? టికెట్ కొని చూడ్డానికి. ఫ్రీగా చూడొచ్చు’ లాంటి స్పాంటేనియస్ స్పార్క్ లు త్రివిక్రమ్ స్టయిల్ ను గుర్తు చేసాయి.

తీర్పు :

ఇది త్రివిక్రమ్ తొలిసారి కాలు మోపిన జారుడు మెట్టు. మళ్లీ ఇలాంటి మరో మెట్టుపై కాలు మోపకుండా చూసుకోవాలన్నది అభిమానుల కోరిక. తెలుగు చలనచిత్రంలో తనకు మాత్రమే ఓ విభిన్న శైలి వున్న రచయిత, దర్శకుడు త్రివిక్రమ్. ఆయన కూడా ఇలా అయిపోతే అన్న ఊహే బాధాకరంగా వుంటుంది. అదే పదే పదే నిజమైతే..?

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com