ప్రమాదస్థలంలో మద్యం సీసాలు తీసేసిన ఎమ్మెల్యే ?

మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ విషాద మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అదే సమయంలో సంపన్న వర్గాల సంతానంపై అదుపు పెరగాలనే మాట కూడా వినిపించింది. ఈ ప్రమాదానికి అందరూ చెప్పుకున్న కారణాలు మూడు- వర్షం, ఓవర్‌ స్పీడు, స్తంభం ఇబ్బందికరమైన రీతిలో వుండటం. ఇవన్నీ పైకి చెబుతున్నా ఆ స్థాయిలో చెప్పలేకపోతున్న మాట వారు మద్యం మత్తులో వున్నారన్నది. ఇలాటి ప్రమాదాలలో నూటికి తొంభైతొమ్మిది శాతం జరిగేదే అది. నిషిత్‌ రవిచంద్ర కూడా మద్యం తీసుకున్నారనే అత్యధికులు నమ్ముతున్నారు. అయితే మంత్రి మర్యాద కోసం ఆస్పత్రి వారిని ఒప్పించి ఆ ప్రభావం లేదని చెప్పించారట. అంతకంటే ఆసక్తికరమైందేమంటే ప్రమాదం జరిగిన చోట మొదట మద్యం బాటిళ్లు కూడా పడివున్నాయట. ఈ ప్రమాదం గురించి తెలిశాక అందరికంటే ముందు వెళ్లిన టిడిపి కృష్ణాజిల్లా ఎంఎల్‌ఎ ఒకరు వాటిని లేకుండా చేశారట. అప్పటికి సందర్శకులు కూడా లేరు గనక తెల్లవారు ఝామున చీకటిలోనే జరిగిపోయింది. రాజకీయ విమర్శలకు వివాదాలకు మారుపేరైన ఆ ఎంఎల్‌ఎ కూడా కుమారుల కారణంగా సమస్యలు ఎదుర్కొన్నవారే కావడం విశేషం. మద్యం సేవించివున్నారంటే సానుభూతి బదులు దానిపై చర్చ జరుగుతుంది గనక సీన్‌ మార్చేయాలని భావించిన ఎంఎల్‌ఎ చకచకా ఈ పనిచేశారని లేకుంటే మీడియాలో మరో విధమైన కథనాలూ వచ్చేవని మొదటగా వెళ్లిన వారు చెబుతున్నారు. దాదాపు ప్రధాన ఛానళ్లన్ని ఆ పరిసరాల్లోనే వున్నా సిసిటివిలో అస్పష్ట దృశ్యం తప్ప ప్రమాదానంతర బీభత్సం కూడా పెద్దగా చూపించలేకపోయారు. ఇక అగ్రశ్రేణి పత్రిక అరపేజీ దీనిపైనే ఇవ్వడం కూడా విమర్శఅకు గురైంది.

నారాయణ విద్యాసంస్థల ఆదాయం ప్రధానం గనక ఇలా చేశారనే సమాధానం లభించింది. అయితే అమితవేగమే ప్రాణాంతకమైందన్న మాట మాత్రం అందరూ చెప్పకతప్పలేదు. సోషల్‌ మీడియాలో మాత్రం కొందరు నారాయణ సంస్థల్లో ఆత్మహత్యలు అనుమానాస్పద మరణాలపాలైన విద్యార్థులతో పోల్చారు. ఏమైనా విచారాన్ని అందరూ పంచుకోవడం, మంత్రి హరీష్‌రావుపూర్తి బాధ్యత తీసుకుని సహకరించడం మన్నన పొందింది. ఈ ఘటనైనా భవిష్యత్తులో శ్రుతిమించిన వేగజీవులకు గుణపాఠమైతే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.