రివ్యూ : ఇంట్లో దెయ్యం.. నాకేం భ‌యం

తెలుగు 360 రేటింగ్‌: 2

దెయ్యం సినిమా మ‌రీ కామెడీ అయిపోయింది. ఓ దెయ్యం, ఓ ఇల్లు, అందులో దెయ్యంతో బాదించుకోవ‌డానికి నాలుగు క్యారెక్ట‌ర్లూ ఉంటే చాలు… సినిమా తయారైపోతోంద‌న్న మిడిమిడి జ్ఞానంలో ఉన్నారు ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు.. వాటిని న‌మ్మి సినిమాలు తీసే హీరోలు, నిర్మాత‌లు. అస‌లు హార‌ర్‌లో కామెడీని ఎప్పుడైతే త‌గిలించారో, అప్పుడే భ‌యానికి చెద‌లు ప‌ట్టేశాయి. పోనీలే.. అదో ట్రెండ్ కామోసు అంటూ ప్రేక్ష‌కులు ఆయా సినిమాల్ని భ‌రించ‌డం అల‌వాటు చేసుకొన్నారు. ఇదే ట్రెండ్ ని ప‌ట్టుకొని వేలాడుతూ సినిమాలూ తీసి పారేస్తున్నారు హీరోలు. ఇప్పుడొచ్చిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం’ కూడా హార‌ర్ కామెడీ త‌ర‌హా సినిమానే. క‌నీసం న‌రేష్ అయినా.. కొత్త దారిలో న‌వ్వించాడా, హార‌ర్‌.. కామెడీ సినిమా అనే పేరుకి న్యాయం చేశాడా?? తెలియాలంటే రివ్యూలోకి దూకాల్సిందే.

క‌థ‌

దెయ్యం సినిమాల క‌థ‌లు ఎలా ఉంటాయి?? అచ్చం అలానే ఈ సినిమాల క‌థ కూడా ఉంటుంది. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి రాసుకొన్నాడో.. అలా రాయ‌డం ఎందుకు టైమ్ వేస్ట్ అంటూ పాత హార‌ర్ కామెడీ సినిమాల్ని చూసి, అందులో ఏరి కోరిన స‌న్నివేశాల నుంచి క‌థ పుట్టించాడో తెలీదుగానీ… ‘ఇంట్లో దెయ్యం’లోకి అడుగుపెడితే.. స‌వాల‌క్ష హార‌ర్ కామెడీ సినిమాలు గంప‌గుత్త‌గా గుర్తుకొచ్చేయ‌డం ఖాయం. అన‌గ‌న‌గా ఊర‌వ‌త‌ల ఓ బంగ్లా. అందులో ఓ దెయ్యం. ఆ బంగ్లాలోని దెయ్యాన్ని త‌రిమేయ‌డానికి విచ్చేసిన ఉత్తుత్తి భూత వైద్యులుం గారు మ‌న హీరో! ఇంత‌కీ ఆ ఆత్మ ఎవ‌రిదో కాదు.. త‌న మ‌ర‌ద‌లిదే. త‌న మ‌ర‌ద‌లు ఎందుకు చ‌చ్చిపోయింది? ఆ ఇంట్లోనే ఎందుకు తిష్ట వేసింది? అనేది వెండి తెర‌పై చూసి త‌రించాల్సిందే.

తెలుగు 360 విశ్లేష‌ణ‌

దెయ్యం క‌థ‌లంటే మ‌న ద‌ర్శ‌కుల‌కు ఎంత చిన్న చూపో… ఈ సినిమా చూశాక మ‌రోసారి అర్థం అవుతోంది. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి త‌న పెన్నుకి గానీ, ద‌ర్శ‌కుడిగా త‌న మేథ‌కు గానీ ఏమాత్రం ప‌ని పెట్ట‌లేదు. ఈ సీను ఫ‌లానా సినిమాలో ఉంది, ఈ ట్విస్టు.. ఫ‌లానా సినిమా లోనిది అని బోల్డ‌న్ని రిఫ‌రెన్సులు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దొరికేస్తుంటాయి. హీరో హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ నుంచి మొద‌లెడ‌దాం. ఆవిడ‌గారు పుణ్య‌వ‌తి. ఈయ‌నగారు త్యాగ‌శీలి! అనాథ పిల్ల‌లంద‌రినీ ఉద్ధరించే హీరోయిన్‌.. అందులో ఓ పాప‌కు గుండె జ‌బ్బు. ఏ హీరో అయినా ఏం చేస్తాడు? డ‌బ్బులు సంపాదించి ఆ పాప ప్రాణాలు నిల‌బెడ‌తాడు. హీరోయిన్ ఫ్లాటైపోయి.. పాటేసుకొందాం రా.. అంటుంది. ఇక్క‌డా అంత‌కు మించి ఏం జ‌ర‌గ‌లేదు. ఓ బంగ్లాలో ఉన్న దెయ్యాన్ని త‌రిమేయ‌డానికి హీరో త‌న గ్యాంగ్ తో స‌హా అక్క‌డ‌కు వెళ్తాడు. ఆ బంగ్లాలో ఉన్న‌వాళ్లంద‌రితోనూ దెయ్యం ఫుడ్ బాల్ మ్యాచ్ ఆడేసుకొంటుంటుంది. వెనుక అదేదో కామెడీ బిట్ అయిన‌ట్టు బీభ‌త్స‌మైన ఆర్‌.ఆర్ వ‌చ్చేస్తుంటుంది. దెయ్యం వ‌చ్చి ఒక‌డ్ని చావ‌బాదుతోంటే.. దాన్ని హాస్యం అనుకోండెహె అని చెప్ప‌డం కేవ‌లం తెలుగు సినిమాల్లోనే సాధ్య‌మేమో. ద్వితీయార్థం గురించి ఇక చెప్ప‌క్క‌ర్లెద్దు. దెయ్యం సీన్ల‌లో హార‌రూ ఉండ‌దు. మిగిలిన వాళ్లు కామెడీ చేయ‌రు. మ‌న‌కు ట్రాజెడీ త‌ప్ప మిగిలేదేం ఉండ‌దు. హీరోలో దెయ్యం పూనుతుంది. ఆ హీరోగారు ఓ మ‌ర్డ‌ర్ చేస్తారు. దాన్ని సాలో చేయ‌డానికి వ‌చ్చిన పోలీస్ ఆఫీస‌ర్ (ఆయ‌న బహ్మానంద‌మే కావొచ్చు గాక‌) శ‌వాన్ని ముంద‌రెట్టుకొని వీర కామెడీ చేసేస్తుంటాడు. భార్యా భ‌ర్త‌ల అనుబంధం గురించి న‌రేష్ క్లాసు పీకుతుంటే… మ‌న‌కు చెవుల్లోంచి ర‌క్తాలు రావ‌డం ఒక్క‌టే త‌క్కువ‌. క‌బాలిరా… అంటూ ర‌జ‌నీకాంత్ డైలాగ్‌కి పేర‌డీ చెబుతుంటే.. థియేట‌ర్లోంచి పారిపోవాల‌న్న కోరిక‌ను బ‌ల‌వంతంగా అదిమిపెట్టుకోవాల్సివ‌స్తుంది. ఇక ప‌తాక స‌న్నివేశాలైతే… బీభ‌త్స‌ర‌సం ప‌తాక స్థాయికి చేరిపోతుంది. సినిమాలో శుభం కార్డు చూసిన‌ప్పుడూ.. తిరుప‌తి కొండెక్కితే దేవుడి ద‌ర్శ‌న‌మైనంత ప‌ర‌మానందం క‌లుగుతుందంటే.. ఈ సినిమాని నాగేశ్వ‌ర‌రెడ్డి ఏ రేంజులో తీసుంటాడో ఓ సారి అంచ‌నా వేయొచ్చు.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌

న‌రేష్ త‌న పాత సినిమాల‌న్నీ ముంద‌ర పెట్టుకొని వాటిని ఓసారి చూసుకోవ‌డం బెట‌ర్ ఏమో అనిపిస్తోంది. త‌న టైమింగ్ పూర్తిగా త‌ప్పుతోంది. డైలాగులో ఏమాత్రం ప‌దును లేక‌పోయినా.. కేవ‌లం త‌న టైమింగ్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో నెట్టుకొచ్చే న‌రేష్ ఎందుక‌నో.. ఆ విద్య పూర్తిగా మ‌ర్చిపోయాడు. ఈ సీన్‌లో న‌రేష్ ఇర‌గ‌దీశాడ్రా అనిపించే సంద‌ర్భం ఒక్క‌టీ లేదు. దృశ్యంలో చాలా సంప్ర‌దాయంగా క‌నిపించిన కృతిక ఈసారి చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో మెరిసింది. అది త‌ప్ప‌.. హీరోయిన్ పాత్ర‌లో తాను చేయ‌గ‌లిగింది ఏమీ లేదు. రాజేంద్ర‌ప్ర‌సాద్ `ఆ ఒక్క‌టీ అడ‌క్కు`లోని తాగుబోతు సీన్ ఈ సినిమాలో రిపీట్ చేయ‌బోయి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. రాజేంద్రుడు లాంటి వాడు కూడా ఓవ‌రాక్ష‌న్ చేశాడంటే… అదంతా ద‌ర్శ‌కుడిలోని లోప‌మే. ష‌క‌ల‌క శంక‌ర్ – చ‌మ్మ‌క్ చంద్ర `ఇది కూడా జ‌బ‌ర్ ద‌స్త్ స్టేజీనే` అనుకొని వాళ్ల స్టైల్‌లో కామెడీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు.

సాంకేతిక వ‌ర్గం

సినిమాకి క‌ర్త క‌ర్మ క్రియ ద‌ర్శ‌కుడు. ఆయ‌న్ని బ‌ట్టే మిగిలిన సాంకేతిక వ‌ర్గం. ఇక్క‌డ ద‌ర్శ‌కుడే పూర్తిగా ఫెయిల్ అయిన‌ప్పుడు మిగిలిన వాళ్ల‌ని నిందించ‌డానికి ఏం లేదు. సినిమా బడ్జెట్ నీ, లెంగ్త్‌నీ పెంచ‌డానికి త‌ప్ప పాట‌లెక్క‌డా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. డైమండ్ ర‌త్న బాబు మాట‌లు సో..సోగా ఉన్నాయి. ‘మీ స‌ర్విస్ అయిపోయింద‌న్నారు..’ అంటూ బ్ర‌హ్మానందం ఎంట‌ర్ అవ్వ‌గానే ఓ డైలాగ్ వినిపించారు. అదొక్క‌టే… క‌రెక్ట్‌గా పేలిన పంచ్ ఏమో…?? రొటీన్ క‌థ‌, క‌థ‌నాలు పెట్టుకొని గార‌డీలు చేసేయొచ్చు అనుకొన్న వాళ్ల‌కు ఈ సినిమాని ఓ పాఠంగా చూపించొచ్చు. హార‌ర్ కామెడీలు ఇలామాత్రం తీయ‌కూడ‌దు అని చెప్ప‌డానికి ఇంత‌కంటే గొప్ప ఉదాహ‌ర‌ణ‌… భ‌విష్య‌త్తులోనూ రాదేమో?

తెలుగు 360 రేటింగ్‌: 2

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close