జగన్‌పై విమర్శలు…బాబుకు ఇంకా బలంగా తగుల్తున్నాయ్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్‌కి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. మోడీని జగన్ కలిశాడు. ఎప్పటి నుంచో అపాయింట్‌మెంట్ అడుగుతూ ఉంటే ఇఫ్పటికీ మోడీ కరుణించాడు. ఆ మీటింగ్‌లో మోడీ ఏం మాట్లాడాడో తెలియదు కానీ బయటికి వచ్చాక మాత్రం జగన్ మొహం వెలిగిపోయింది. జగన్‌ది రాజకీయ డ్రామానో, లేక మోడీ నిజంగా ఏదైనా గొప్ప హామీ ఇచ్చాడేమో తెలియదు. ఎందుకంటే నటించడం మన నాయకులకు బ్రహ్మాండంగా అలవాటే. గతంలో సోనియా సూపర్ పవర్‌గా ఉన్నప్పుడు కూడా తెలంగాణావాదులు, సమైక్యవాదులు సోనియాని తరచుగా కలుస్తూ ఉండేవారు. లోపల సోనియా ఏం మాట్లాడేవారో తెలియదు కానీ బయటికి వచ్చాక మాత్రం అందరూ కూడా పరమానందంగా ఫీలవుతున్న రేంజ్‌లో జనాలను మెప్పించడానికి రొటీన్ డైలాగులు చెప్పేవారు. ఇప్పుడు జగన్‌ది నటనో…కాదో తెలియదు కానీ జగన్ మొహంలో ఆ స్థాయిలో ఆనందం కనిపించడం మాత్రం టిడిపి జనాలకు అస్సలు నచ్చడం లేదు. వాళ్ళ అసహనం రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. అందుకే జగన్‌పై చేస్తున్న విమర్శలు తమ అధినేత చంద్రబాబుకు కూడా తగుల్తున్నాయి అనే విషయం మర్చిపోయి మరీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

మోడీ కాళ్ళ దగ్గర ప్రత్యేక హోదా పోరాటాన్ని తాకట్టు పెట్టాడు, కేసుల మాఫీ కోసం మోడీతో కాంప్రమైజ్ అయిపోయాడు, ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని మోడీ దగ్గర డిమాండ్ చెయ్యొచ్చు కదా…..ఇలాంటి విమర్శల బాణాలను జగన్‌పైకి ఎక్కుపెడుతున్నారు టిడిపి జనాలు. బలమైన భజన మీడియా ఉన్న పార్టీ కాబట్టి ఆ విమర్శలు కూడా జనాల్లోకి బాగానే వెళ్తున్నాయి. కాకపోతే ఈ విమర్శలన్నీ కూడా చంద్రబాబుకు కూడా వర్తిస్తాయి కదా అన్న కౌంటర్స్ కూడా ఆలోచనాపరులు వినిపిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అని ప్రతిపక్షనేత డిమాండ్ చేయాలని టిడిపివాళ్ళు….అదే డిమాండ్‌ని తమ నేత చంద్రబాబు కూడా వినిపించాలని ఎందుకు కోరుకోరు? ఇంత వరకూ ఉన్న తెలుగు ముఖ్యమంత్రులెవ్వరూ సాగిలపడనంత స్థాయిలో మోడీ దగ్గర బెండ్ అవుతున్నాడు చంద్రబాబు. అంతా ఓటుకు నోటు కేసు మహత్యం కాదని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు కూడా ఎంతసేపూ జగన్‌ని విమర్శించడమే కానీ మోడీని విమర్శించగలరా? టిడిపి నేతలు చెప్తున్నట్టుగా జగన్ లక్ష కోట్లు కనుక తిని ఉంటే…అలాంటి నేతతో సంబంధాలు నెరుపుతున్న మోడీ అవినీతిపరుడు కాడా? మరి మోడీ కూడా అవినీతిపరుడు అనే చెప్పే ధైర్యం టిడిపికి ఉందా? అయినా ఇప్పటి వరకూ ఉన్న భారతదేశ ప్రధానులందరిలోకి అత్యంత శక్తువంతురాలైన ఇందిరాగాంధీలాంటి నాయకురాలిని అత్యంత ధైర్యంగా ఎదుర్కున్న టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరుని ఎప్పుడూ జపించే చంద్రబాబుకు ఆయన ధైర్యంలో పావు వంతు కూడా ఎందుకు లేకుండా పోయింది? ప్రత్యేక హోదాని మోడీ కాళ్ళ దగ్గర చంద్రబాబు ఎప్పుడో తాకట్టుపెట్టేశాడు. ప్రతిపక్షనేత జగన్ ఇప్పుడు సరెండర్ అయిపోయాడు. ఇక ఈ ఇద్దరు నేతలకు, రెండు పార్టీల నాయకులకు, భజన మీడియా బృందానికి ఒకరినొకరు విమర్శించుకునే అర్హత ఉందా? ఇద్దరు బలహీన నేతల ఉత్తర కుమార ప్రగల్భాల వళ్ళ ఎవరికి ఉపయోగం?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.