అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు ‘రాకా’ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ని రివీల్ చేశారు. దాంతో పాటుగా ఫస్ట్ లుక్ కూడా బయటకు వదిలారు. మనిషి, మృగం రెండూ కలిపిన లుక్ లో బన్నీ… ఫ్యాన్స్ కి అసలైన షాక్ ఇచ్చాడు. ఈ లుక్ తో.. సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. అట్లీ వెండి తెరపై ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడన్న విషయం మరోసారి రూఢీ అయిపోయింది.
రాక్షసుడు, రాకాస అనే పదాల నుంచి ‘రాకా’ని తీసుకొన్నారు. ఈ సినిమాలో బన్నీ పాత్ర కూడా నెగిటీవ్ షేడ్ లోనే ఉండబోతోంది. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు రకాల పాత్రల్లో కనిపించనున్నారని ముందు నుంచీ చెప్పుకొంటూనే ఉన్నారు. ఒకటి పాజిటీవ్ పాత్ర, మరోటి నెగిటీవ్ పాత్ర. రెండింటి మధ్య జరిగే యుద్ధమే ఈ ‘రాకా’. రెండో పాత్రకు సంబంధించిన లుక్ కూడా త్వరలో రివీల్ చేసే అవకాశం ఉంది.
బన్నీ టైటిల్ ని చాలా గోప్యంగా ఉంచింది టీమ్. ఒక్క లీక్ లేకుండా జాగ్రత్త పడింది. ఈ సినిమా టైటిల్ ఏమిటన్న విషయం దర్శకుడికీ, హీరోకీ తప్ప మూడో మనిషికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సినిమాకు సంబంధించిన కీలకమైన అంశాల్ని లీక్ చేసే.. లీకు వీరులకు కూడా టైటిల్ అందలేదు. మొత్తానికి టైటిల్ తోనూ, లుక్ తోనూ అందరికీ షాక్ ఇచ్చేసింది టీమ్.
