నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండడమే గెలుపు.
నిన్ను నువ్వు దాటుకొంటూ వెళ్లడమే విజయం.
ఈ సినిమాతో గెలుచుకొందేమిటి? అనేది కాదు.. ఈ సినిమాతో నేర్చుకొన్నదేమిటి? అనేదే ఎదుగుదలకు సూత్రం.
ఈ విషయంలో అల్లు అర్జున్ ప్రయాణం, తనకు తాను నిర్దేశించుకొంటున్న ప్రమాణాలు.. ఆచరణీయం. ఆదర్శ ప్రాయం.
గంగోత్రిలో అల్లు అర్జున్ ని చూస్తే `ఇతనేంటి? హీరో ఏంటి` అనుకొన్నవాళ్లే అంతా. నెపోటిజం ఆ రోజున మరోసారి గట్టిగా గుర్తొచ్చి ఉంటుంది. `ఇలా హీరోల్ని రుద్దుకుంటూ పోతారా` అనే ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. కానీ వెంటనే `ఆర్య` తో ప్రతీ ప్రశ్నకూ సమాధానం చెప్పాడు బన్నీ. ప్రతీ నిందనీ విసిరి అవతల పారేశాడు.
గంగోత్రీకీ ఆర్యకీ మధ్య జరిగిన `మార్పే` బన్నీ..
ఆర్యకీ బన్నీ సినిమాకీ మధ్య నేర్చకొన్న పాఠమే.. అల్లు అర్జున్.
అక్కడ్నుంచీ ప్రతీ ఒక్క సినిమాకూ నేర్చుకొంటూ వెళ్లాడు. ఎదిగాడు. ఇప్పుడు `జాతీయ ఉత్తమ నటుడు` కిరీటాన్ని కైవసం చేసుకొన్నాడు. బన్నీ నుంచి సినిమా వస్తోందంటే దేశం అంతా ఎదురు చూసే స్థాయికి చేరుకొన్నాడు. ఇదంతా ఒక్క సినిమాతో సాధించిన విజయం కాదు. ఒక్కో సినిమాతో తనని తాను చెక్కుకొంటూ సాగించిన ప్రయాణం. బన్నీ చేసిన సినిమాలూ, నేర్చుకొన్న పాఠాలూ ఒక్కసారి రివైండ్ చేసుకొంటే..
తొలి అడుగు ‘ గంగోత్రి`: టాలీవుడ్ అప్పట్లో మాస్ సినిమాల ఆధిపత్యంలో కొనసాగుతోంది. కొత్త రక్తం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయమది. కాలేజీ ప్రేమకథలు రాజ్యమేలుతున్న టైంలో ఇంకేదో కోరుకుంటున్నారు ప్రేక్షకులు. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి అల్లు అరవింద్ తనదైన తనదైన ముద్ర వేశాక, ఆయన వారసత్వాన్ని ప్రొడక్షన్ లో కాకుండా నటనలో చూపించాలని నిర్ణయించుకున్నాడు వాళ్ళ రెండో అబ్బాయి అల్లు అర్జున్ అలియాస్ బన్నీ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వందో సినిమాగా గంగోత్రికి శ్రీకారం చుట్టారు. అల్లు అర్జున్ కది తొలి అడుగు. కథ ప్రకారం ఒక పాటలో అమ్మాయి వేషం వేయమన్నా నో అనలేదు. ప్రకాష్ రాజ్, సుమన్, సీత లాంటి సీనియర్ ఆర్టిస్టుల ముందు బెరుకు పడలేదు. డాన్సులు, ఫైట్లు అన్నింటికి సిద్ధపడ్డారు. గంగోత్రి మంచి విజయం సాధించింది. ఆ ఘనత బన్నీ కన్నా ఎక్కువగా దర్శకుడికీ, సంగీతానికీ దక్కింది. బన్నీ లుక్, నటన మీద కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఉలి దెబ్బలు తింటేనే కదా రాయి శిల్పంగా మారేది.
యూత్ సంచలనం `ఆర్య`: సుకుమార్ అనే దర్శకుడు ఆర్య కథ తీసుకొచ్చాడు. వన్ సైడ్ లవ్ అంటూ అప్పటిదాకా ఎవరూ చూపించని ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కోసం అల్లు అర్జున్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. స్టెప్పులో గ్రేస్ పెరిగింది. నటనలో చలాకీతనం వచ్చింది. మాస్ కోసం కష్టమైన పోరాటాలతో తెగువ చేరింది. యువతను ఆకట్టుకునే స్టయిలింగ్ తో తనను తాను బన్నీ కొత్తగా ఆవిష్కరించిన తీరు నంది స్పెషల్ జ్యురి అవార్డు తీసుకొచ్చింది. ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెంచేసింది. బన్నీ మేకోవర్ జనాలను స్పెల్ బౌండ్ చేసింది.
చొక్కా విప్పిన హీరో: ఆర్య తరవాత మాస్ లో ఫాలోయింగ్ పెంచిన సినిమా `బన్నీ`. తండ్రి ఆశయం కోసం పోరాడే యువకుడిగా అన్ని వర్గాలకు కనెక్ట్ అయిపోయాడు. హ్యాపీ ఆశించిన ఫలితం అందుకోకపోయినా అల్లు అర్జున్ లోని మరిన్ని షేడ్స్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. దేశముదురులో బన్నీలోని మాస్ మొత్తాన్ని బయటకు లాక్కొచ్చారు పూరి. ముఖ్యంగా అప్పటికే చొక్కా విప్పడానికే మహా నామోషీ పడిన తెలుగు హీరోల పరిమితులను బద్దలు కొడుతూ సిక్స్ ప్యాక్ లో అల్లు అర్జున్ కనిపించిన విధానం మాస్ కే మెంటల్ ఎక్కించింది. వరుడు, బద్రీనాథ్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా వేదంలో కేబుల్ రాజుగా అల్లు అర్జున్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ విమర్శకులతోనూ చప్పట్లు కొట్టించింది. పరుగులో బాధ్యత కలిగిన ప్రేమికుడిగా, ఆర్య 2 లో అతి క్లిష్టమైన ఆర్య క్యారెక్టర్ లో జీవించడం దాన్నో కల్ట్ క్లాసిక్ గా మార్చేసింది.చలాకీ ‘జులాయి’గా బన్నీ విశ్వరూపం జులాయితో త్రివిక్రమ్ అనే బంధం బన్నీతో కలిసి చరిత్ర సృష్టించేందుకు పునాది వేసుకుంది.
బాక్సాఫీస్ రేసుగుర్రం: బన్నీ కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్ రేసు గుర్రం. లక్కీగా బన్నీ నటన పెద్దలు పిల్లలను సమానంగా మెప్పించడంతో ఎప్పటికీ గుర్తుండిపోయే మాస్ క్లాసిక్ గా నిలబెట్టింది. కుటుంబం విలువల కోసం కట్టుబడే విరాజ్ ఆనంద్ గా సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ పాత్ర కుటుంబ ప్రేక్షకుల్ని మరింత దగ్గర చేసింది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఒకప్పుడు లెజెండరీ స్టార్లే చేసేందుకు వెనుకడుగు వేసిన గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ పలికించిన తెలంగాణ యాస రుద్రమదేవికి కొండంత బలంగా నిలిచింది. టైటిల్ రోల్ అనుష్కదే అయినా తన ఉనికితో కలెక్షన్లలో సింహభాగం వచ్చేలా చేసిన అల్లు అర్జున్ ఈ సినిమాలో ఆభరణం. ఆ తరవాత బోయపాటితో చేసిన `సరైనోడు` వంద కోట్ల వసూళ్లు ఇంత సులభమా అనిపించేలా రికార్డులు కొల్లగొట్టిన తీరు గీతా ఆర్ట్స్ బ్యానర్ కు మరో బ్లాక్ బస్టర్ జోడించింది. ఒక యూత్ హీరో మాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు రుచి చూపించిన బొమ్మ సరైనోడు. హరీష్ శంకర్ తీసిన డీజే దువ్వాడ జగన్నాథంలో బ్రాహ్మణ వంటవాడిగా చూపించిన వేరియేషన్స్ ఫ్యాన్స్ కి మరో కలికితురాయి.
అల.. రికార్డుల పురములో: కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వెనుకాడని బన్నీ మనస్తత్వం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చేసేలా ప్రేరేపించింది. రిజల్ట్ ఎలా ఉన్నా ఆర్మీ ఆఫీసర్ గా తన నటనకు ఫిదా అయినవాళ్లు ఎందరో. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించి త్రివిక్రమ్ ఆవిష్కరించిన అల వైకుంఠపురములో చేసిన మేజిక్ గురించి మాటల్లో వర్ణించడం కష్టం. మితిమీరిన మాస్ ఎలిమెంట్స్ లేకుండా ఈ కుటుంబ కథా ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎందరినో ఈ జానర్ వైపు వెళ్లేలా చేసింది.
పెను సంచలనం పుష్ప: అడవిని న(అ)మ్ముకున్న ఒక స్మగ్లర్ జీవితాన్ని చాలా దగ్గరగా చూసినట్టు అల్లు అర్జున్ పుష్ప పాత్రకు ప్రాణం పోసిన తీరు నార్త్ నుంచి సౌత్ దాకా బాక్సాఫీస్ ని కొల్లగొట్టేసింది. దర్శకుడు సుకుమార్ విజన్ ని అంతకు పదింతలు సొంతం చేసుకుని బన్నీ అందులో పరకాయ ప్రవేశం చేయడం కొత్త చరిత్రను రాయించింది. తగ్గేదేలే అంటూ చూపించిన మ్యానరిజమ్ గల్లీ బాయ్స్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ దాకా కోట్లాది మంది ఇమిటేట్ చేసేలా ప్రేరేపించింది. పుష్ప 2 ఇండియన్ హిస్టరీలో రెండు వేల కోట్లకు దగ్గరగా వెళ్లిన అరుదైన రికార్డును సొంతం చేసుకొంది.
బన్నీ కేవలం మాస్ హీరోనో కమర్షియల్ హీరోనో కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని తనవంతుగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న నిత్య సైనికుడు. దశాబ్దాల టాలీవుడ్ చరిత్రలో కలగా మిగిలిపోయిన ఉత్తమ జాతీయ నటుడి అవార్డుని సాధించడం తన తపనను తెలియజేస్తుంది. చిత్రసీమ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఖ్యాతి అల్లు అర్జున్ అందుకోవడం వెనుక ఏళ్ళ తరబడి కృషి కసి ఉంది. ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు, మూడు నంది పురస్కారాలు, ఒక జాతీయ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డు పాటు ఎన్నో లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్న అల్లు అర్జున్, తనను ఇంతవాడిని చేసిన ప్రేక్షకులు మళ్ళీ ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో తండ్రి అల్లు అరవింద్ తో పాటు స్థాపించిన అల్లు సినిమాస్ హైదరాబాద్ మూవీ లవర్స్ ఎక్స్ పీరియన్స్ ని మరో స్థాయిని తీసుకెళుతోంది. ఒక హీరో స్థాయి కేవలం ఎన్ని సినిమాలు చేశామనే దాని కన్నా ఎలాంటి సినిమాలు చేశామనే దాని మీద ఉంటుందని బలంగా నమ్మే అల్లు అర్జున్ అందులో భాగంగానే అట్లీ, లోకేష్ కనగ రాజ్ లాంటి ఫిలిం మేకర్స్ తో కాంబోలు సెట్ చేసుకోవడం ద్వారా కొత్త స్టాండర్డ్స్ ఏర్పరిచారు.
హిందీలో మార్కెట్ సంపాదించుకోవడమే గొప్పనుకునే టైంలో మలయాళం నటుల డామినేషన్ అధికంగా ఉండే కేరళలో జెండా పాతడం బన్నీకి మాత్రమే సాధ్యమయ్యింది. అక్కడి అభిమానులు ప్రేమగా మల్లుస్టార్ అని పిలుచుకోవడమే కాదు కొత్త సినిమా రిలీజైన ప్రతి సందర్భంగా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకునే ఫ్యాన్సీ సొంతం చేసుకోవడం ఇంకెవరి వల్ల కాలేదు.
ఇండియా హద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో తెలుగోడి సత్తా చాటడానికి అల్లు అర్జున్ – అట్లీ కలయికకు శ్రీకారం చుట్టడం టాలీవుడ్ లో ఒక నూతన అధ్యాయం. ఫాంటసీ, యాక్షన్, థ్రిల్, కమర్షియల్, విజువల్ గ్రాండియర్ ఇలా అన్ని అంశాలు మేళవించి ఇప్పటిదాకా భారతీయ స్క్రీన్ మీద ఎవరూ చూడనంత గొప్ప కంటెంట్ ఇవ్వడానికి ఇద్దరు పూనుకోవడం భవిష్యత్తులో హాలీవుడ్ మేకర్స్ కి స్ఫూర్తినిచ్చినా ఆశ్చర్యం లేదు. దీని కోసం తన బెస్ట్ ఇవ్వడానికి సర్వశక్తులు పెట్టుబడిగా పెడుతున్న బన్నీ లక్ష్యం అంచనాలకు అందని స్థాయిలో ఉంది.
లెగసీ అందరికీ వస్తుంది, దాన్ని నిలబెట్టుకునే సత్తా కొందరికే ఉంటుంది……అందుకే అల్లు అర్జున్….కేవలం స్టయిలిష్ స్టార్ కాదు……టాలీవుడ్ ఫ్యూచర్ మార్చాలని తపన పడుతున్న ట్రూ ఐకాన్ స్టార్.
(అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా)


