ఐదేళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సాగించిన అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలపై ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే.. వైసీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపు అనే పాత పాటను అందుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ఫామ్ హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా లగ్జరీ ఇల్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారనే ఆరోపణలపై అధికారులు సర్వేకు నోటీసులు ఇస్తే, ఆయన మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు అక్కడ ఏ తప్పూ జరగనప్పుడు, అనుమతులన్నీ సక్రమంగా ఉన్నప్పుడు సర్వే చేయించుకోవడానికి భయం ఎందుకు? నిప్పులాంటి నిజాయితీ ఉంటే అధికారులకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి కదా!
దోపిడీని కప్పిపుచ్చుకునే విక్టిమ్ కార్డ్ రాజకీయం!
వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన అక్రమ సంపాదన, ఆస్తుల కూడబెట్టుడు పర్వం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఐదేళ్ల పాటు సామాన్యుల భూములను, ప్రభుత్వ ఆస్తులను చెరబట్టిన నేతలు.. ఇప్పుడు లెక్కలు తేల్చమంటే బాధితులుగా నటిస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి నేతలు నోటీసులను ఎదుర్కోలేక మీడియా ముందు గంతులు వేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. ప్రజల్లో సానుభూతి పొందడం , విచారణను అడ్డుకోవడమే. తప్పులు చేసినప్పుడు శిక్ష తప్పదని తెలిసిన దొంగల తెలివితేటలు ఇవి. నోటీసులు ఇవ్వడమే తప్పయితే, ఇక చట్టం ఎందుకు? వ్యవస్థలు ఎందుకు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
చట్టం తన పని తాను చేయాల్సిందే !
వైసీపీ నేతలు తాము చేసిన అక్రమాలకు రాజకీయ రంగు పులిమి తప్పించుకోవాలని చూస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్, విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడానికి నిధులు ఎక్కడివి? అనుమతులు ఎవరిచ్చారు? అనే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, రంకెలేయడం వల్ల నిజం దాగదు. ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించే ముందు, తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలి. చట్టానికి ఎవరూ చుట్టాలు కారు. సామాన్యుడికి ఒక న్యాయం, మాజీ మంత్రులకు ఒక న్యాయం ఉండదు కదా! విచారణ ఎదుర్కోకుండా పారిపోవాలనుకోవడం వారి నేరాన్ని వారే ఒప్పుకున్నట్లు అవుతుంది.
దొంగల తెలివితేటల కన్నా చట్టం పదును
అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి వైసీపీ నేతలు వేస్తున్న ఎత్తుగడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మేము తప్పు చేశాం కాబట్టే ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది అని చెప్పలేక, కక్ష సాధింపు అనే సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చట్టానికి ఉన్న పదును ముందు ఈ పప్పులు ఉడకవు. అక్రమ కట్టడాలను గుర్తించడం, సర్వే చేయడం అధికారుల బాధ్యత. దానికి అడ్డుపడటం అంటే రాజ్యాంగ వ్యవస్థలను ధిక్కరించడమే. చేసిన తప్పులకు సంజాయిషీ ఇచ్చుకోలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపడం వైసీపీ నేతల దివాళాకోరుతనానికి పరాకాష్ట.


