వైసీపీలో ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. జగన్ రెడ్డి కన్నా అంబటి రాంబాబే ఆ పార్టీలో పెద్ద లీడర్ గా ఎదిగారు. ఆయన ఇంటికి క్యూ కడుతున్న వైసీపీ నేతలే దీనికి సాక్ష్యం. ఓ ముఖ్యమంత్రిని అడ్డగోలుగా తిట్టి జైలుకుపోయిన ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ నేతలకు ఓ షెడ్యూల్ ఇచ్చారు. అటు పెద్దిరెడ్డి నుంచి ఇటు జడ శ్రవణ్ వరకూ అందరూ ఈ షెడ్యూల్ ప్రకారం అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను ఓదార్చి.. వస్తున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు అంటే ఒక ఇది.. ఒక అది అని ఎలివేషన్లు ఇస్తున్నారు.
వైసీపీ సాక్షి మీడియాలో గతంలో జగన్ రెడ్డి కనిపించని గంట ఉండేది కాదు. సాక్షి మీడియాలో ఓ గంట ప్రసారాలను విశ్లేషిస్తే కనీసం అరగంట జగన్ రెడ్డి గురించి ఉండాలనేది రూల్. కానీ ఇప్పుడు అది అంబటి రాంబాబు ఆక్రమించారు. ప్రతి గంట ప్రసారాల్లో అరగంట పాటు అంబటి రాంబాబుకు డెడికేట్ చేస్తున్నారు. ఆయన పరామర్శల కోసం వస్తున్న వారి వీడియోలు.. పరామర్శలు.. బైట్లకు విరివిగా ప్రచారం కల్పిస్తున్నారు.
కొన్ని రోజులు పోతే వైసీపీ కార్యకర్తలు కూడా తమ నాయకుడు.. జగన్ రెడ్డినా.. అంబటి రాంబాబునా అన్న డౌట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇవాళ కాకపోతే రేపు బెయిల్ పై వస్తారు. అయితే ఎందుకు జైలుకెళ్లారన్న విషయం ఎవరికీ గుర్తుండి ఉండకుండా ఉంటుందా.. ?. చేసింది తప్పుడు పని..దానికి ఎలివేషన్లు ఇచ్చుకుని ప్రజల ముందు నవ్వుల పాలవడం తప్ప .. రాజకీయ ప్రయోజనం ఉంటుందా?. అయినా వైసీపీలో అలాంటివే రాజకీయ వ్యూహాలు.
