వైసీపీలో అంబటి రాంబాబు లాయర్ అవతారం ఎత్తుతున్నారు. ఈ రోజు నల్లకోటు వేసుకుని ఆయన హైకోర్టుకు వెళ్లారు.తనను అక్రమంగా అరెస్టు చేశారని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కూడా స్వయంగా తయారు చేసుకున్నారు. పొన్నవోలును జోక్యం చేసుకోనివ్వలేదు. ఆ కేసులో తానే వాదించుకోబోతున్నారు. అంబటిని అరెస్టు చేసినప్పుడు పొన్నవోలే వాదించారు. అయితే ఇప్పుడు అంబటి మాత్రం తాను లా చదివినందున..తన పేరును లాయర్ గా నమోదు చేసుకున్నందున.. పిటిషన్లు వేసి వాదించుకునేందుకు రెడీ అయ్యారు. అంబటి రాంబాబు దూకుడు చూస్తూంటే ఇక వైసీపీలో లీగల్ సెల్ ఆయన దగ్గరే ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.
అసలు ట్విస్ట్ ఏంటంటే.. వైసీపీ ఇన్నాళ్లూ నమ్ముకున్న లీగల్ మేధావి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అంబటి సైడ్ ట్రాక్ చేయడం. గతంలో అంబటి అరెస్టయినప్పుడు కోర్టులో గొంతు చించుకుని వాదించిన పొన్నవోలును, ఈసారి పిటిషన్ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. నా కేసు నేనే వాదించుకుంటా.. నా పిటిషన్ నేనే రాసుకుంటా అంటూ అంబటి చూపిస్తున్న ఈ అతి ఉత్సాహం చూస్తుంటే, పార్టీలో పొన్నవోలు మార్కు న్యాయపోరాటాలకు చెక్ పడినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ లాయర్లకు కూడా అవకాశం ఇవ్వకుండా అంబటి చేస్తున్న ఈ సోలో పెర్ఫార్మెన్స్ చూసి అందరూ అవాక్కవుతున్నారు.
వైసీపీలో ఇప్పుడు అంబటి రాంబాబు దూకుడు చూస్తుంటే, ఇకపై పార్టీ లీగల్ సెల్ మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇన్నాళ్లూ పొన్నవోలు సినిమా నడిచింది కానీ, ఇప్పుడు అంబటి ‘లా’ పాయింట్లతో ఎంట్రీ ఇవ్వడంతో పాత వికెట్లు పడిపోయేలా ఉన్నాయి. అసలే ఓటమి తర్వాత పార్టీలో సెకండ్ లైన్ లీడర్లంతా సైలెంట్ అయిపోతే, అంబటి మాత్రం అటు రాజకీయాల్లోనూ, ఇటు న్యాయస్థానాల్లోనూ దూకుడు చూపించేందుకు రెడీ అయ్యారు. అంబటి లాయర్ గెటప్ వెనుక ఉన్న అసలు వ్యూహం రిమాండ్ సింహా గా పేరొందిన పొన్నవోలును తొక్కేయడమేనని .. పొన్నవోలు అనుచరులు అనుమానిస్తున్నారు.


