ఇటీవల ఒక భారతీయ తెలుగు జంట రెండో ప్రపంచ యుద్ధ స్మారకం వద్ద చేసిన ఒక సాధారణ డ్యాన్స్ రీల్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పవిత్రమైన స్మారక చిహ్నం వద్ద అసభ్యత లేకుండా కేవలం సరదాగా డ్యాన్స్ చేసిన ఈ జంటపై కొందరు అమెరికన్లు, ముఖ్యంగా జాత్యాహంకార ధోరణి ఉన్నవారు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. స్మారకానికి గౌరవం ఇవ్వడం లేదంటూ వారు చేసిన విమర్శల దాడికి తట్టుకోలేక, ఆ జంట తమ సామాజిక మాధ్యమ ఖాతాలనే మూసివేయాల్సి వచ్చింది. ఈ వివాదం వెనుక ఉన్న అసలు రంగులు ఇప్పుడు మెల్లగా బయటపడుతున్నాయి.
ఆ యుద్ధ స్మారకం అంటే అమెరికన్లకే అగౌరవం
అమెరికన్లు సదరు స్మారకానికి ఇచ్చే గౌరవం ఎంతటిదో సోషల్ మీడియా రికార్డులే సాక్ష్యమిస్తున్నాయి. వాస్తవానికి, అదే స్మారక చిహ్నం వద్ద నిలబడి ఉన్న ఆ నిలువు స్తంభాలను తమ ప్రైవేట్ భాగాలతో పోల్చుతూ, అసభ్యకరమైన భంగిమల్లో ఫోటోలు దిగి పోస్ట్ చేసిన అమెరికన్ల జాబితా చాంతాడంత ఉంది. ఇంకా ఘోరంగా, ఓన్లీ ఫ్యాన్స్ వంటి అడల్ట్ ప్లాట్‌ఫారమ్‌లకు చెందిన స్టార్లు అక్కడ నగ్నంగా డ్యాన్సులు చేసిన సందర్భాలు, అర్ధనగ్న ఫోటో షూట్లు చేసిన దాఖలాలు కోకొల్లలు. తమ సొంత పౌరులు చేస్తున్న ఇటువంటి అరాచకాలను పట్టించుకోని వారు, ఒక భారతీయ జంట ఎంతో హుందాగా చేసిన డ్యాన్స్‌ను తప్పుబట్టడం వారి జాత్యాహంకారానికి నిదర్శనం.
భారతీయ నెటిజన్ల విమర్శలతోనే అ జంటకు సమస్య
ఈ వివాదంలో చాలా మంది భారతీయులు కూడా ఆ జంటను విమర్శించారు. అందరూ చేస్తున్నారు కాబట్టి వారు చేశారు .. పైగా అది ఇప్పుడు చేసింది కాదు.. పదేళ్ల కిందట చేసింది. ఇప్పుడు అమెరికా జాత్యాహంకారులు.. భారతీయులపై వ్యతిరేకత పెంచుకున్న వారు వైరల్ చేశారు. జాత్యాహంకారం ముసుగులో అమెరికన్లు చేసిన విమర్శలకు మనవాళ్లే వంత పాడటం ఆ జంటను ఒంటరిని చేసింది. కానీ, ఇప్పుడు నెమ్మదిగా అమెరికన్ల అసభ్యకర ఫోటోలు బయటకు వస్తుండటంతో, విమర్శించిన వారే ఆశ్చర్యపోతున్నారు.
అగ్రరాజ్యంలో పెరుగుతున్న జాత్యాహంకార ధోరణి
దీనిని కేవలం ఒక గౌరవ సమస్యగా చూడలేము. ఇది స్పష్టమైన జాత్యాహంకారం , పక్షపాతం. తెల్లజాతి వారు చేసే అరాచకాలు వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తాయని, అదే వేరే దేశస్థులు చిన్న పొరపాటు చేసినా అది నేరం అని చిత్రించడం పాశ్చాత్య దేశాల అలవాటుగా మారింది. స్మారక చిహ్నాలను గౌరవించాలనే నియమం అందరికీ వర్తించాలి. తన సొంత పౌరుల అసభ్యతను భరించే అమెరికా సమాజం, ఒక భారతీయ జంట చేసిన కళాత్మక ప్రదర్శనను ఇంతలా రాద్ధాంతం చేయడం వారి నైతిక పతనాన్ని సూచిస్తోంది.
